– ఇండోసోల్‌కు భూములు ఇచ్చేందుకు రైతుల ససేమిరా
– మీ అభివృద్ధి మాకొద్దంటూ రైతుల నిరసన
– విపక్షంలో ఉండగా ఇండోసోల్‌పై టీడీపీ ఆరోపణలు
– విరుచుకుపడిన మాజీ మంత్రి లోకేష్, సోమిరెడ్డి
– అవి ఫేక్ పెట్టుబడులన్న లోకేష్
– ఈనాడు, ఆంధ్రజ్యోతిలో పుంఖాను పుంఖాల వ్యతిరేక కథనాలు
– ఇప్పుడు అదే కంపెనీకి భూములు ఎలా ఇస్తారంటున్న రైతులు
– సర్కారు తీరుపై టీడీపీ సీనియర్ల అసంతృప్తి
– జగన్ సర్కారు కంటే ఎక్కువ భూములు ఇస్తున్నారని కన్నెర్ర
– వైసీపీ బంధంతో ఆ పార్టీ నేతల మౌనం
– సోషల్‌మీడియాలో నాటి టీడీపీ ఆరోపణలు వైరల్
– కూటమి ప్రతిష్ఠ దెబ్బతింటుందని సోషల్‌మీడియా సైనికుల ఆవేదన
– టీడీపీ-వైసీపీకి తేడా ఏమిటంటూ ప్రశ్నల వర్షం
– నైతిక విలువలు పాటించరా అని తమ్ముళ్ల ఆగ్రహం
– బంధం కలిపిన బ్రోకర్లు ఎవరంటూ ప్రశ్నల వర్షం
( మార్తి సుబ్రహ్మణ్యం)
అవినీతి-అరాచకం-నియంతృత్వం కలగలిసిన నాటి జగన్ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా.. ఐదేళ్లు అలుపెరుగని పోరాటం చేసిన టీడీపీ కార్యకర్తలు- సోషల్‌మీడియా సైనికులు.. ప్రస్తుతం కూటమిలో తీసుకుంటున్న నిర్ణయాలపై నోరెళ్లబెడుతున్నారు. ‘చెప్పు అదే.. కాలు వేరం’టూ సోషల్‌మీడియా వేదికగా నిప్పులు కురిపిస్తున్నారు.
జగన్ జమానాలో రాంగయినది ఇప్పుడు రైటెలా అవుతుంది? ఆ మేరకు ప్రభుత్వ పెద్దలతో ఒప్పందాలు కుదిర్చిన బ్రోకర్లెవరు? మా త్యాగాలను జగన్ బినామీ కంపెనీలకు తాకట్టు పెడుతున్న ఆ రాజకీయ దళారులెవరు? సర్కారుతో బంధం కలిపిన బ్రోకర్లు ఎవరు? అందుకే వారికి ఉన్నత పదవులిచ్చారా? ఈ మ్యాచ్‌ఫిక్సింగులు ఏ స్థాయిలో జరుగుతున్నాయి? ఇలాగైతే ఇక టీడీపీ-వైసీపీకి తేడా ఏమిటి? చంద్రబాబును తప్పుదోవపట్టిస్తున్న శక్తులెవరు? ఇండోసోల్ ఒప్పందాన్ని రద్దు చేస్తే ప్రపంచం తల్లకిందులవుతుందా? పెట్టుబడి దారులు వెనక్కి వెళ్లిపోతారా? ఇంకో కంపెనీ వస్తుంది కదా?
అసలు జగన్ బినామీ కంపెనీ అని మన మే ఆరోపించిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌పై అంత ప్రేమ ఎందుకు? ఒకవేళ ఎన్నికల సమయంలో ఆ కంపెనీ మనకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలిస్తే.. దానిని తిరిగి చెల్లించకుండా, ఈ తెరచాటు ప్రేమ ఎందుకు? అంటే మనం జగన్ కంపెనీలతో చేస్తున్నది రణమా? రాజీనా? ఇది రాజకీయమా? రాజకీయ వ్యాపారమా? ఇవన్నీ బాబు-లోకేష్‌కు తెలిసి జరుగుతున్నాయా? తెలియకుండా జరుగుతున్నాయా?. అంటూ పసుపుదళాలు, సోషల్‌మీడియాలో ఒంటికాలితో విరుచుకుపడుతున్నాయి.
ఇండోసోల్.. ఇదో వివాదాస్పద సోలార్ ప్రాజెక్టు. జగన్ జమానాలోనే దీనికి కాళ్లొచ్చాయి. దానిని లోకేష్, సోమిరెడ్డి వంటి అగ్రనేతలు ‘ఫేక్ పెట్టుబుడులు’గా విరుచుకుపడ్డారు. ‘‘లక్షరూపాయల మూలధనంతో ఏర్పాటయిన ఇండోసోల్ 7200 కోట్లు పెట్టుబడులు పెడుతుందట. దీని అడ్రస్ పులివెందుల. ఈ ప్రభుత్వంలో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలు ఇవే బాపతు’’ అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు.
టీడీపీ ఆగ్రహానికి అసలు కారణం.. సదరు ఇండోసోల్ కంపెనీ, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ యాజమాన్యానిది కావడమే. షిర్డిసాయి కంపెనీ జగన్ బినామీ అని సోమిరెడ్డి, పట్టాభి, విజయకుమార్, అనం వెంకట రమణారెడ్డి, బికెట్ రవి, బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ వంటి నేతలంతా శరపరంగా ఆరోపణాస్త్రాలు సంధించారు. తాము అధికారంలోకి వస్తే దానిపై విజిలెన్స్ విచారణ జరిపించి శిక్షిస్తామని ప్రకటించారు.
అప్పట్లో జగన్ సర్కారు తమ కులానికి చెందిన అడ్డగోలుగా కేటాయించిన కంపెనీలపె..ై ఈనాడు, ఆంధ్రజ్యోతి వరస కథనాలతో విరుచుకుపడ్డాయి. ఆ కంపెనీల అర్హతలను ప్రశ్నించాయి. అవసరం లేకపోయినా వేల సంఖ్యలో తయారుచేసి, మూలన పడేసిన ట్రాన్స్‌ఫార్మర్ల ఫొటోలను ప్రచురించాయి. వాటిపై టీడీపీ ప్రెస్‌మీట్లు పెట్టి ఆ కంపెనీలపై ధ్వజమెత్తాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంలో ఆంధ్రజ్యోతి వ్యూహాత్మక మౌనం పాటించగా.. ‘ఈనాడు’ దినపత్రిక మాత్రం ఎక్కడా రాజీ పడకుండా షిర్డిసాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్‌పై ఇప్పటికీ వ్యతిరేక కథనాలు వెలువరిస్తూనే ఉంది.
ఇండోసోల్‌కు భూములు ఇలా..
సీన్ కట్ చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇండోసోల్‌కు 8234 ఎకరాల భూమి కేటాయించేందుకు క్యాబినెట్ నిర్ణయించింది. మామూలుగా అయితే జగన్ వల్ల లభ్దిపొంది.. తామే ఆరోపణలు చేసిన ఆ కంపెనీపై, కూటమి సర్కారు ఉక్కుపాదం మోపాలి. కానీ అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వమే గతంలో తాము ఆరోపించిన అదే ఇండోసోల్ కంపెనీకి 8234 ఎకరాలకు అనుమతివ్వడం పార్టీలో అనుమానాలు-విమర్శలకు కారణమయింది.
దానికి ‘‘కంపెనీలను వెనక్కి పంపించి అభివృద్ధిని అడ్డుకుంటామా? వాటిని వేరే రాష్ట్రానికి పంపించేయాలా?’’ అన్న ఎదురుదాడి ప్రశ్నలతో, పార్టీవాదుల నోరు మూయిస్తున్న వైనం సీనియర్ నాయకులకూ నచ్చడం లేదు. ‘‘మేం విపక్షంలో ఉన్నప్పుడు వాటిపై ఆరోపణలు చేసినప్పుడు, మరి ఆ ఆలోచన లేకుండానే వాటిపై ఎందుకు ఆరోపణలు చేసినట్లు? అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే ఇంకోలా మాట్లాడతామని ప్రజలు విమర్శిస్తే.. అప్పుడు ఎవరి ఇమేజ్ డ్యామేజీ అవుతుంద’ని ఓ మాజీ మంత్రి ప్రశ్నించారు.
నిజానికి సౌర విద్యుత్ ప్యానెళ్ల తయారీతోపాటు, విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఇండోసోల్ ముందుకొచ్చింది. దీనికి 8234 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా తొలి విడతలో 4,912 ఎకరాల భూమిని సేకరించేందుకు, జూన్ 21న కూటమి ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ ప్రకారంగా.. 16 గ్రామాల్లో భూములు సేకరించాలన్నది ఆ నోటిఫికేషన్ ప్రతిపాదన. ఇదీ నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు సమీ గ్రామాల ఇండోసోషల్ భూసేకరణ తెర వెనక కథ!
కరేడు కదనంతో కూటమికి ఇబ్బందేనా?
కరేడు భూములు ఇండోసోల్‌కు అప్పగించేందుకు రైతులు అంగీకరించడం లేదు. అభిప్రాయసేకరణకు వచ్చిన అధికారులను పరిగెత్తిస్తున్నారు. మీ భూములిస్తే అభివృద్ధి చేస్తామన్న అధికారులపె, తాజాగా రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మా గ్రామం అభివృద్ధి అయింది. ఇక మీ అభివృద్ధి మాకొద్దు. భూములు తీసుకున్న గ్రామాలు ఎన్ని అభివృద్ధి అయ్యాయో చెప్పండి’’ అంటూ నిలదీయడంతో, అధికారులు తోకముడవాల్సిన పరిస్థితి.
తాజాగా కరేడు భూముల కోసం వచ్చిన కందుకూరు సబ్‌కలెక్టర్‌కు రైతులు చుక్కలు చూపించారు. పచ్చని పొలాల్లో పరి
శ్రమలు పెట్టమని ఏ చట్టం చెప్పింది? చావనయినా చస్తాం గానీ భూములిచ్చే ప్రసక్తి లేదు. మా శవాలపై పరిశ్రమలు పెడతారా? అంటూ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులను మూడు చెరువుల నీళ్లు తాగించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కాగా తాజాగా కరేడు రైతుల ప్రతిఘటన, కూటమికి అప్రతిష్ట తెచ్చేదేనని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు షిర్డిసాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్, మేఘా కంపెనీలపై ఆరోపణలు చేసిన మనమే, ఇప్పుడు అధికారంలోకి రాగానే వారికి లబ్థి చేకూరుస్తుంటే, కార్యకర్తల్లో ఎలాంటి సంకేతాలు వెళతాయి? కార్యకర్తలు ప్రాణాలడ్డుపెట్టి పార్టీని అధికారంలోకి తీసుకువస్తే.. మీరు పైస్థాయిలో వారితో సర్దుకుపోతారా అని భావిస్తే, రేపు పార్టీ జెండా మోసే వాళ్లుకూడా ఉండరని హెచ్చరిస్తున్నారు.
‘‘ ఒకవేళ ఎన్నికల ముందు మన పార్టీకి ఎవరైనా భారీ స్ధాయిలో విరాళాలిస్తే వారికి డబ్బులు తిరిగి ఇచ్చేయండి. అంతేగానీ మళ్లీ అదే కంపెనీలను ప్రోత్సహిస్తే క్యాడర్ మనసు గాయపడుతుందని గ్రహించకపోవడమే విచారకరం. ఒకవేళ ఇండోసోల్ గానీ, షిర్డిసాయి గానీ రాష్ట్రం నుంచి వెళ్లిపోతే మరొకరు వస్తారు. అవి జగన్ కంపెనీలని మనమే ఆరోపించి, మళ్లీ మనమే అదే కంపెనీలను ప్రోత్సహిస్తే ప్రజలు ఏమనుకుంటారు? వైసీపీ అంటే దీనిపై మాట్లాడదు. కానీ వాటిని గుర్తు చేయడానికి గూగుల్, యూట్యూబ్ అనేవి ఉన్నాయి కదా? వాటి నోరు మూయించలేం కదా? ఏది ఏమైనా పోరాటలకు అలవాటు పడ్డ మన పార్టీ క్యాడర్ ఇలాంటి రాజీ వ్యవహారాలు అంగీకరించద’’ని ఓ ఉమ్మడి గోదావరి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కుండబద్దలు కొట్టారు.
ఇండోసోల్‌పై క్యాడర్‌లో నిరసన
ఇండోసోల్ వ్యవహారంపై పార్టీ అనుకూల సోషల్‌మీడియా మొత్తం, మూకుమ్మడిగా రైతుల పక్షాల నిలిచి.. ఇండోసోల్‌పై వ్యతిరే కథనాలతో కదం తొక్కిన వైనాన్ని, పార్టీ నాయకత్వం-ప్రభుత్వం గుర్తించాలని టీడీపీ సీనియర్లు సూచిస్తున్నారు. అక్కడ జరిగిన ఘటనలన్నీ రైతులకు అనుకూలంగా- ఇండోసోల్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీ సోషల్‌మీడియా చూపించిందంటే, వాస్తవ పరిస్థితి ఆ కంపెనీకి ఎంత వ్యతిరేకంగా ఉందో ఊహించకోవచ్చంటున్నారు.
ఎలాంటి స్వార్ధం లేకుండా పార్టీ-ప్రభుత్వం సరైన దారిలో నడవాలని కోరుకునే పార్టీ అనుకూల సోషల్‌మీడియా కథనాలతో.. పార్టీ క్యాడర్ ఏకీభివిస్తోన్న విషయాన్ని గుర్తించకపోతే, నష్టపోయేది పార్టీ-ప్రభుత్వమేనని ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
‘నిజానికి ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ ప్రతిపక్షంకాదు. టీడీపీ సోషల్‌మీడియా, టీడీపీ పట్ల సానుభూతిగా ఉండే సోషల్‌మీడియా మాత్రమే. షిర్డిసాయి, ఇండోసోల్, మేఘా వంటి కంపెనీలు ఎలాగూ జగన్ అనుకూలమైనవే కాబట్టి వైసీపీ వాటి గురించి మాట్లాడదు. అధికారంలోకి వచ్చిన ఏడాదిదాటినా కోర్టుల్లో ఇంకా తన పార్టీ నియమించిన పీపీ, ఏపీపీ, ఏజీలున్నందున వైసీపీ దాని గురించి మాట్లాడదు. కానీ ఎలాంటి స్వార్ధం లేకుండా పనిచేసే టీడీపీ సోషల్‌మీడియా సైనికులు, టీడీపీ అనుకూల సోషల్‌మీడియా బృందాలకు ఎలాంటి మొహమాటాలుండవన్న విషయాన్ని నాయకత్వం గ్రహించాలి. ఇప్పటివరకూ ఈ సోషల్‌మీడియా బృందాల విమర్శలతోనే, ప్రభుత్వం తన నిర్ణయాలను మార్చుకోవలసి వచ్చిందని’’ ఓ సీనియర్ మహిళా నేత వ్యాఖ్యానించారు. వాటి రాతలపై ఆగ్రహం చెందేబదులు,క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలని పార్టీ సీనియర్లు సూచిస్తున్నారు.