వరస ఉత్సవాలకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి

Spread the love

ఈ నెల 30 నుంచి ఆషాఢ సారె
జులై 3న బంగారు బోనం
జులై 11 నుంచి శాకంబరి ఉత్సవాలు

బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి వరుస ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే పవిత్ర సారె మొదలుకొని.. తెలంగాణ నుంచి ఉమ్మడి దేవాలయాల కమిటీ దుర్గమ్మ సన్నిధికి తీసుకొచ్చే బంగారు బోనం సమర్పణ, ఆ తర్వాత శాకంబరీదేవి ఉత్సవాల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది భక్తుల రద్దీ పెరుగుతుందనే అంచనాతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది.

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 30 నుంచి జులై 28 వరకు పవిత్ర ఆషాఢ సారె కార్యక్రమం నిర్వహించనున్నారు. గత రెండేళ్లుగా కొవిడ్‌ కారణంగా ఆంక్షల మధ్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసారి మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో సారె సమర్పణకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని ధార్మిక సంస్థలు, భజన మండళ్లకు సమాచారం పంపారు. సారె సమర్పణకు బృందాలుగా తరలివచ్చే వారంతా మూడు రోజుల ముందు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.

బెజవాడ దుర్గమ్మకు హైదరాబాద్‌లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోనం ఆనవాయితీగా సమర్పిస్తుంది. ఈ ఏడాది బంగారు బోనాన్ని జులై 3న కనకదుర్గమ్మకు అందించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమిటీ సభ్యులు ఈవో భ్రమరాంబతో సమావేశమై ఈ విషయాన్ని వెల్లడించారు. బంగారు బోనం అందించే కార్యక్రమ వివరాలను దుర్గగుడి ఆలయ ఈవో, ఇంజినీరింగ్‌ అధికారులకు తెలిపారు.

జులై 11 నుంచి 13 వరకు శాకంబరీ దేవి ఉత్సవాలు జరగనున్నాయి. 11న విఘ్నేశ్వర పూజ, రుత్విక్ వరుణ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, అంకురార్పణతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మూడు రోజులు అమ్మవారి మూల స్వరూపానికి పండ్లు, కాయగూరలు, ఆకుకూరలతో శాకంబరీ దేవిగా ప్రత్యేక అలంకరణ చేస్తారు. భక్తులందరికీ కదంబం ప్రసాదాన్ని ప్రత్యేకంగా అందిస్తారు.

శాకంబరీ దేవి రూపంలో అమ్మవారు ప్రజల ఆకలిని తీర్చి అందరినీ రక్షించారనేది భక్తుల నమ్మకం. అయితే, కొవిడ్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నందున ఆలయానికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇందుకు తగినట్లుగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేశారు. మల్లేశ్వరస్వామి ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టినందున బాలాలయంలోనే దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

 

Leave a Reply