విద్యాదీవెన, వసతి దీవెన ఇవ్వకుండా చదువులెలా సాగుతాయి?
– టీ.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మానం ప్రణవ్ గోపాల్
సంక్షేమ క్యాలెండర్ ప్రకారం వసతి దీవెన నిధులు విడుదల చేయకుండా వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల విద్యార్ధులను సీఎం జగన్ రెడ్డి మోసం చేశారు. టీడీపీ హయాంలో డైట్ చార్జీలు నెలకు రూ. 1,450, కాస్మోటిక్స్ చార్జీలు నెలకు 500 చొప్పున 10నెలలకు రూ. 19,500 ఒక్కొక్క విద్యార్ధికి ఏడాదికి లబ్ది చేకూరేది కాని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వసతి దీవెన కింద రూ.20,000 అని చెప్పి ఇంత వరకు ఏ ఒక్క సంవత్సరం రూ.10వేలకు మించి ఇవ్వలేదు. అది కూడా అడ్డమైన నిబంధనలతో లబ్దిదారుల సంఖ్యను తగ్గించారు.
ఏటా రెండు దఫాలుగా ఇస్తామని ప్రకటించి ఇందులో సగమే చెల్లిస్తూ విద్యార్ధులను మోసం చేస్తున్నారు. ఇప్పటి వరకు 4 ఏళ్లల్లో 3 సార్లు మాత్రమే రూ.10వేలు ఇచ్చారు. 2019-20లో ఫిబ్రవరి 21, 2020న రూ.10వేలు, 2020-21లో మార్చి 28, 2021న రూ.10వేలు, 2021-22 మార్చి 08, 2022న రూ.10వేలు మాత్రమే అందించారు. 2022-23లో ఒక్క విడతల వసతి దీవెన విడుదల చేయలేదు.
ఫీజులతో పోలిస్తే విద్యార్థులు వసతి దీవెన రూపంలో ఎక్కువగా నష్టపోయారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇతరత్రా కోర్సుల్లో సుమారు 15లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వారికి సుమారు రూ.2,500 కోట్లు వసతి దీవెన కింద చెల్లించాలి. కానీ తొలి విడత కింద సగం నగదు విడుదల చేసి, రెండో సగం ఆపేస్తున్నారు. అంటే విద్యార్థుల వసతి దీవెనలో ప్రభుత్వం ఏటా రూ.1300 కోట్లు మిగుల్చుకుంటోంది.
ప్రైవేట్, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలు నిలిపివేస్తూ జీవో నెం. 77ను విడుదల చేశారు. దీనితో 1.7 లక్షల మందిలో 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్ధులకు ఉన్నత విద్యను దూరం చేశారు. విద్యార్దుల్ని మోసం చేసిన జగన్ రెడ్డికి బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.