Suryaa.co.in

Political News

రాజ్యాధికారం-బి.సి ల సమగ్రాభివృద్ధి

దేశంలో ప్రతి దానికి లెక్క ఉంటుంది. మనుషులకు లెక్క ఉంటుంది. లెక్క లేకుంటే, లెక్కలోకి రాకుంటే ఉన్నా లేనట్లే. ప్రతిదీ లెక్కతోనే మాట్లాడుకుంటారు. చిన్న విషయం నుండి పెద్ద దేశ, రాష్ట్రాల బడ్జెట్ వరకు అన్ని లెక్క ప్రకారమే ఉంటాయి. దేశంలో పశు పక్షాదులెన్ని, పులులు, సింహాలెన్ని అనే లెక్క కూడ తీస్తారు. అలాంటిది బి.సి ల లెక్క ఎందుకు తీయడం లేదు?

స్వాతంత్రం ముందు 1931 లో బ్రిటిష్ రాజ్యంలో చివరి బి.సి జనగణన జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటినా నేటికి బి.సి జనగణన చేయడం లేదు. గత నాలుగు దశాబ్దాలుగా ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ దేశ పాలకులు బి.సి. జనగణన చేయడం లేదు. అసలు బి.సి జనాభా ఎంతో తెలియకుండా బి.సి ల సమగ్రాభివృద్ధి కోసం ఎలా ప్రణాళికలు రూపొందిస్తారు? బడ్జెట్ ఎలా కేటాయిస్తారు?

బి.సి ల సమగ్రాభివృద్ధి జరగాలాంటే బి.సి ల జనాభా దామాషా ప్రకారం సకల సామాజిక రంగాల్లో వారి వాటా వారికి కేటాయించాలి. జనాభా దామాషా అంటే బి.సి జనాభా ఎంతో తేల్చాలి. బి.సి జనగణన చేయాలని, చట్టసభల్లో ఒ.బి.సి లకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, క్రిమిలేయర్ విధానాన్ని తొలిగించాలని, విద్య, ఉద్యోగాల్లో ఓ.బి.సి లకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని దేశ వ్యాప్తంగా ఆయా రాష్టాల్లో జరుగుతున్న ఉద్యమాలు దేశ రాజధాని ఢిల్లీ చేరుకొని మార్చి 21 నుండి 23 వరకు ఢిల్లీలో ధర్నా, ముఖ్యమైన నాయకులను కలిసి వినతిపత్రాలు ఇవ్వనున్న సందర్బంగా బి.సి ల బతుకు చిత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం.

నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో వేల సంవత్సరాలుగా అణచివేయబడి వెనక్కి నెట్టివేయబడిన (బి.సి) ప్రజలు దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడు పదులు దాటినా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా బి.సి ల అభివృద్ధి, రాజ్యాదికారం గురించి ఆందోళనలు జరిగినా పెద్దగా ఫలితాలు సాధించలేకపోయాయి. మహాత్మ జ్యోతిరావు పూలే మొదలుకొని పెరియార్ రామసామి, నారాయణ గురు, సాహుమహారాజ్, అంబేడ్కర్, బి.పి. మండల్, కాన్షీరాం లాంటి వాళ్ళు ఎందరో మహానుభావుల త్యాగపూరిత ఉద్యమాలతో వెనకబడిన తరగతి (బి.సి) ప్రజలు కొన్ని హక్కులు, రిజర్వేషన్లు సాధించికున్నప్పటికి సమగ్రాభివృద్ధి మాత్రం సాధ్యం కాలేదు.

అంబేడ్కర్ కృషి వల్ల ఎస్.సి, ఎస్.టి లకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో రాజ్యాంగ పరమైన రిజర్వేషన్లు కల్పించడంతో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుండి దేశాన్ని పాలిస్తున్న ఆధిపత్య వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో రానిస్తూ మరింత వృద్దిలోకి వచ్చారు. ఎస్.సి, ఎస్.టి ల కున్న రాజ్యాంగపరమైన హక్కులు, ఆధిపత్య వర్గాలకున్న రాజ్యాధికారం లేకపోవడం వల్లనే బి.సి లు అభివృద్ధికి నోచుకోవడంలేదు.

ఈ దేశ సహజ పట్టాదారులైన బి.సి లు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాకముందే దేశ ప్రజలకు కావాల్సిన ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి నాగరిక సమాజానికి కావాల్సిన వస్తువులను అందించడంలో ఎంతో జ్ఞానాన్ని, చొరవను చూపారు. అలాంటి శాస్త్రవేత్తలు నేడు ఉత్పత్తి, సేవా కులాలై మానవాళి మనుగడకు కృషి చేస్తూ, సర్వ సమస్యలతో బతుకులీడుస్తూ స్వాభిమానం లేకుండా జీవించడం అత్యంత బాధాకరం. ప్రజాస్వామ్యంలో సర్వరోగ నివారిణి, సర్వ సమస్యలకు పరిష్కారం చూపేది రాజ్యాధికారం.

ఆ రాజ్యాధికారం దిశగా పయనించే క్రమంలో ఆధిపత్య వర్గాల పార్టీలల్లో బి.సి లు రెండవ, మూడవ శ్రేణి నాయకులుగా, నికార్సయిన నమ్మిన బంట్లుగా కొనసాగుతూ బి.సి ఓట్లన్ని గంపగుత్తగా ఆధిపత్య దోపిడీ పార్టీలకు వేయించి గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారే తప్ప తమకు రాజ్యాధికారం అవసరమని బి.సి సమాజం ఆలోచించలేకపోతుంది.

అనాదిగా భూమిని నమ్ముకొని సమాజానికి ఆహారోత్పత్తులు అందిస్తున్న రైతన్నలు నేడు భూమిని అమ్ముకొని పట్టణాలకు వలస బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. తరతరాలుగా సహజ వ్యవసాయం చేస్తున్న బి.సి లు మార్కెట్ మాయాజాలంలో పడి వాణిజ్య పంటలతో మందులు అతిగా వాడి భూమినంతటిని నాశనం చేసుకున్నారు.

రైతులకు విత్తనాలు అందించే కంపెనీలు మొదలుకొని పురుగు మందులు, ఎరువుల కంపెనీలతో పాటు పంటను కొనుగోలు చేసే వ్యాపారులు సైతం కోట్లకు పడగలెత్తుతుంటే రైతులు మాత్రం అప్పుల ఊబిలో చిక్కి విలవిలలాడుతున్నారు. అప్పులు తీర్చేందుకు కుటుంబాలను విడిచి వలసలు పోయేవారు కొందరైతే తీర్చలేక ఆత్మగౌరవం చంపుకోలేక మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలు, సహకార సంఘాల బలోపేతం ద్వారా రైతులను రక్షించాల్సిన పాలకులు నిర్లక్ష్యం వహించడం వల్లనే వ్యవసాయాన్ని నమ్ముకున్న బిసిలు అధోగతి పాలవుతున్నారు.

ఆధునిక పారిశ్రామిక విధానం వల్ల బి.సి లకు జీవనాధారమైన సాంప్రదాయిక వృత్తులు విధ్వంసమై బి.సి లు వలసల బాట పట్టారు. మారుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి, మానవాళి అవసరాలకు తగినట్లుగా బి.సి వృత్తులను ఆధునీకరించడం, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడంలో 75 ఏండ్ల స్వాతంత్ర పాలనలో పాలకుల కృషి శూన్యమే. సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన మార్పులను గమనించిన ఆధిపత్య కులాల వాళ్లు బి.సి కులాల వృత్తులను, ఉత్పత్తులను లాక్కున్నారు.

మెషినరీ (మిల్లు) తో చేనేత రంగాన్ని కొల్లగొట్టారు. యాదవుల పాడి పరిశ్రమను రెడ్లు, మార్వాడీలు, ఇతర అగ్రవర్ణాలవర్ణాల వారు అక్రమించుకున్నారు. ఐరన్ హార్డ్ వేర్ రంగంలో వచ్చిన టెక్నాలజీతో రెడీమేడ్ ఫర్నీచర్, జ్యూలరి షాపులతో, స్టీల్ పాత్రల షాపులతో విశ్వకర్మలు ఉపాధి కోల్పోయి ఉరి పెట్టుకొని చనిపోతున్నారు. ప్లాస్టిక్ తో కుమ్మరుల వృత్తి, బ్యాండ్ బాక్స్ లతో చాకలి వృత్తి, బ్యూటీ పార్లర్లతో మంగలి ఉపాధి మాయమవుతుంది.

వస్త్ర రంగంలో రెడీమేడ్ రావడంతో చేనేతలతో పాటు మేర కులస్తుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రెడీమేడ్ పరుపులు, ప్లాస్టిక్ చాపలు, డి.జె సౌండ్స్, రిలయన్స్ మాల్ లు, ఇటుకల రంగంలో వచ్చిన మార్పులు దూదేకుల/నూరుబాష కులస్తులను అధోగతిపాలు చేసాయి. వేల ఏండ్లుగా తాళ్ళుపేనే వారుగా, నవారు నేసే వారుగా, టైలర్లుగా, పండ్లు అమ్మేవారుగా, బట్టల అద్దకంలో, బ్యాండ్ మేళంలో పనిచేసే వారుగా, చాపలు అల్లే వృత్తిలో, బండలు కొట్టే వృత్తిలో, పాములు ఆడించే గారడి వారుగా, రోడ్లపై సర్కస్ చేసే వారుగా, అత్తరు అమ్మే వారుగా, దూది ఏకే వాళ్లుగా జీవనం కొనసాగిస్తున్న దూదేకుల, నూరుబాషా, పింజారి, లద్ధాఫ్, మెహతర్, ఫకీర్, అత్తరు, కాశోల్లు, గారడోళ్ల లాంటి ఎన్నో చిన్న చిన్న ఒంటరి కులాల వారు బహుళజాతి కంపెనీల ఉత్పత్తులు, ఆధిపత్య కులాల వారి వ్యాపారాలతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడి వారి ఉనికి కోల్పోవాల్సిన దుస్థితిలో ఉన్నారు.

వ్యవసాయ రంగం క్రమంగా నష్టాల్లోకి వెళ్లడంతో తరతరాలుగా భూమిపై ఆధారపడి జీవించిన బి.సి లు నేడు విద్య వైపు చూస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులే కాకుండా అసంఘటిత రంగంలో పనిచేసే బి.సి లు కూడా తమ పిల్లల భవిష్యత్ కోసం పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆకాంక్షతో ఆస్తులు, భూములు అమ్మి అప్పుల పాలవుతున్నారు. ప్రైవేటు రంగంలో విద్య నాణ్యమైందనే ప్రచారానికి తోడు వృత్తి విద్యను అందించే కాలేజీలన్నీ అగ్రవర్ణాల చేతిలోనే ఉండటంతో మెజారిటీ బిసిల్లో విధ్యాకాంక్ష పెరగడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది.

విద్యా రంగంలో ప్రైవేటీకరణను ప్రోత్సహించడమే కాకుండా ఉన్నత విద్యను అందించే ప్రైవేట్ యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేయడంతో ఆ యూనివర్సిటీల్లో మహనీయుల త్యాగాల ఫలితంగా వచ్చిన రిజర్వేషన్లకు తావులేదని చెప్పి బి.సి ప్రజలను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారు. సరైన పౌష్టికాహారం అందక, పట్టణాల్లో పెరుగుతున్న కాలుష్యంతో రకరకాల రోగాల బారిన పడుతున్న బి.సి లు ప్రభుత్వ వైద్యం చేయించుకోలేక, ప్రైవేటు హస్పిటల్స్ లో బిల్లులు కట్టలేరు అన్నట్టుగా తయారైన పరిస్థితిలో రోగాలను నయం చేసుకోవడానికి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఉన్నది కాస్త ఊడ్చి పెడుతున్నారు.

“గోల్డ్ మెడల్ కొట్టినోడ గోడకు దిగ్గొట్టినోడ” అన్నట్లు పి.జి. లు పి.హెచ్.డి లు చదివినా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు దొరక్క లక్షలల్లో నిరుద్యోగులు పెరుగుతున్నారు. బి.సి లు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలతో చాలీ చాలని జీతాలతో జీవితాలను గడువుతున్నారు. చదువుకున్న యువత విద్యా సంస్థలను ఏర్పాటు చేసి, మద్యతరగతి వ్యాపారాలు పెట్టి ఎందరో నష్టపోతున్నారు. బీమండి, సూరత్, బొంబాయి లాంటి నగరాలకు వలసలు పోతున్నారు. అప్పులు చేసి దుబాయి లాంటి దూరదేశాలకు వెళ్లి దుర్బర బతుకులీడుస్తున్నారు.

ప్రైవేట్ ఫైనాన్స్ లల్లో రుణాలు తీసుకొని ఆటోలు, కార్లు, వివిధ రకాల వాహనాలు తీసుకొని నష్టాలతో అప్పుల పాలవుతున్నారు. నిరుద్యోగంతో చాలా మంది యువకులు బార్డర్ పోలీసులుగా, ఆర్మీలో, స్పెషల్ పోలీసులుగా వెళ్లి కుటుంబాలకు దూరంగా జీవిస్తున్నారు. దేశ రక్షణ కోసం బార్డర్ లోనే కాకుండా నిత్యం బి.సి లను దోపిడీ చేసే అగ్రవర్ణ పాలకులకు బాడీ గార్డులుగా కూడా బి.సి లు పనిచేస్తున్నారు.

గ్రామీణాభివృద్ధి మరిచిన పాలకులు ఉద్దేశపూర్వకంగానే పట్టణాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారు. ఈ అభివృద్ది యజ్ఞంలోనూ బిసిలే సమిధలవుతున్నారు. ఇండస్ట్రీయల్ కారిడార్లు, రింగ్ రోడ్లు, రీజినల్ రింగ్ రోడ్లు, సెజ్ లు, బహుళ అంతస్థుల నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణం, ఓపెన్ కాస్ట్ మైనింగ్, రోడ్ల విస్తరణ సందర్భాల్లో కొద్దో గొప్పో భూములున్న బి.సి లు తమ భూములు కోల్పోతున్నారు. ఆధిపత్య వర్గాల వారు ముందస్తుగా చౌకగా బి.సి. ల భూములను కొని బి.సి లను రోడ్డున పడేస్తున్నారు.

వ్యవసాయ రంగంలో పురుషులతో సమానంగా పనిచేసే మహిళలతో పాటు కుల వృత్తులల్లో, చేతి వృత్తులల్లో, బీడీ కార్మికులుగా, బిస్కట్ కంపెనీలల్లో పనిచేసే మహిళల స్థితి చాలా దారుణంగా ఉంటుంది. వ్యవస్థలో సామాజిక మార్పులెన్ని వచ్చినా చాకిరి కులాల స్థితి మారడం లేదు.

ఒకప్పుడు మంత్రసాని పని చేసిన వర్గం నేడు ఆసుపత్రుల్లో నర్సులుగా, ఊరునాటి బట్టలు ఉతికిన బి.సి మహిళలు నేడు ఇంటింటికి వెళ్లి అదే చాకిరి చేయాల్సిన దుస్థితి కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదాయం కోసం విచ్చలవిడి మద్యం అమ్మకాల ద్వారా నానాటికి పెరిగుతున్న మద్యం మరణాల వల్ల కూడా బి.సి మహిళలు అధోగతి పాలవుతున్నారు.

హరిత విప్లవం ద్వారా అభివృద్ధి చెందిన కమ్మలు, పారిశ్రామిక విప్లవం ద్వారా అభివృద్ధి చెందిన రెడ్లు, తెలంగాణ ఉద్యమం ద్వారా అభివృద్ధి చెందిన వెలమలు రాజ్యాధికారంలో కీలకంగా రానిస్తూ బి.సి లను తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఎదగకుండా అణచివేస్తుండగా ఉత్తర భారతదేశంలో బ్రాహ్మణీయ, బనియాలు ఆధినుండి బి.సి లను రాజకీయంగా ఎదగకుండా కుట్రలు పన్నుతున్నారు.

ఆధిపత్య కులాల వారు రాజకీయంగా ఎదగడమే కాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని విద్యా, వైద్యాన్ని వ్యాపారం చేసి గనుల రంగాల్లో కోట్లు గడిస్తూ బి.సి ల ఓట్లను కొని అక్రమంగా అధికారంలోకి వస్తున్నారు. అధికారం, అవినీతి విడదీయరానివిగా మారి కోట్ల రూపాయలతో నడుస్తున్న దళారి పెట్టుబడి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో స్వతంత్ర రాజకీయాలను అందులో బి.సి ల రాజకీయాలను నిర్మితం చేసి రాజ్యాధికారం లోకి రావడం అంత సులువైన విషయం కాదు. సర్వరోగ నివారిని రాజ్యాధికారం అనుకున్నప్పుడు బి.సి లు ఆ రాజ్యాధికారం కోసం కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగాలి.

బి.సి జనాభాలో సాగమైన మహిళలను రాజకీయాలవైపు తీసుకురానంత కాలం విముక్తి సాధ్యం కాదని, ఒక్కరు చేస్తే ఇల్లు ఎలా గడవదో సగమైన బి.సి మహిళలు రాజకీయాలకు దూరంగా ఉండి పోరాటంలో కలిసిరాకుంటే రాజ్యాధికారం అందని ద్రాక్షనే అవుతుందని బోధించాలి. వేల ఏండ్లుగా బ్రాహ్మణీయ కట్టుబాట్లతో మానసిక బానిసత్వంతో అణచివేతకు గురైన బి.సి లు చైతన్యం చెందుతున్న తరుణంలో పాలకులు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణతో దోపిడి రూపాలు మార్చి దోచుకుంటున్న తీరును ప్రశ్నించకుండా ఉండడానికి బి.సి లను నిత్యం చాకిరిలో తీరిక లేకుండా చేయడమే కాకుండా మద్యతరగతి మహిళలను టి.వి. సీరియళ్లకు, రియాల్టీ షో లకు బానిసలయ్యే విధంగా గుడులకు, తీర్థ యాత్రలకు వెళ్ళే విధంగా చేస్తున్న కుటిల రాజకీయాలను మహిళలు గమనించాలి.

తరతరాలుగా పాలనకు అలవాటుపడిన ఆదిఅత్య వర్గాలు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రాకుండా చూసుకోవడం కోసం సమాజంలో మంద బలమున్న బి.సి కులాల వారిని మచ్చిక చేసుకోవడమే కాకుండా జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ప్రజా కళాకారులకు జీతాలు, కుల సంఘాలకు కుల భవనాలు, పండుగలకు వస్త్ర పంపిణీ, పెన్షన్లు తదితర పథకాలతో సమాజంలోని ప్రభావిత శక్తులను లోబరుచుకొని మెజారిటీ సమాజాన్ని దోపిడి చేసే పాలకవర్గ కుటలత్వాని బి.సి సమాజం గమనించాలి. సన్న బియ్యం కాదు – సమాన విద్య కావాలని, సంక్షేమ పథకాలు కాదు – సమానత్వం కావాలని, సకల సామాజిక రంగాల్లో మేమెంతమందిమొ మాకంత వాటా కావాలని ఉద్యమించాల్సిన అవసరాన్ని బి.సి సమాజం గుర్తించాలి.

బి.సి ప్రజలను అన్ని రకాల మత్తులో ఉంచి పాలిస్తున్న పాలకులను బ్రిటిష్ కాలంలోనే గమనించిన బహుజన ఉద్యమ మహానుభావుడు ‘పెరియార్’ ‘ఈ రాజ్యం నశించాలి’ అని వ్రాసి ప్రజలను చైతన్యం చేసారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా మనకు స్వాతంత్రం రాలేదని, దేశ ప్రజలకు వెండి సంకెళ్లు పోయి బంగారు సంకెళ్లు పడ్డాయని పెరియార్ అన్న మాటలు నేటికి సత్యంగానే కనపడుతున్నాయి.

వంద కులాలుగా, వంద వర్గాలుగా విడిపోయి జీవిస్తున్న బి.సి ప్రజలు బతుకుదెరువు కోసం వంద ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పదుల సంఖ్యలో సంఘాలు పెట్టి 10 పార్టీలలో పనిచేస్తూ విడిపోయిన బి.సి ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి రాజ్యాధికారం చేపట్టడం బి.సి నాయకత్వానికి, సంఘాలకు కత్తిమీద సాము లాంటిది.

బి.సి ప్రజలందరూ రక్త బంధువులేలనని, బి.సి లంతా ఒక జాతి ప్రజలని, అందరి సమస్యలు ఒకటేనని నిరంతర ప్రచారంతో పాటు బి.సి ల దైనందిన సమస్యలలో బి.సి నాయకత్వం బాగమై రాజ్యాధికారంతోనే సమగ్రాభివృద్ధికి సాధ్యమని బోధించి సమీకరించిన నాడు తప్పక విజయం సాధించవచ్చును. బి.సి లు కష్టపడి చదివి జిల్లా, రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినా, సైంటిస్టులైన, జ్ఞాన సంపన్నులైనా ఆధిపత్య కార్పొరేట్ శక్తుల క్రింద అతి తక్కువ జీతంతో పని చేయాల్సిందేనని, బి.సి ల జ్ఞానం దోపిడీ పాలకులకు ఉపయోగపడడం పోవాలంటే రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుందని భోధించాలి.

ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన జరిగి నిరుద్యోగ సమస్య పోవాలన్న, ప్రైవేటీకరణతో దోపిడీ పోవాలన్నా, అభివృద్ధి పేరుతో బి.సి ల భూములను లాక్కోకుండా ఉండాలన్నా రాజ్యాధికారం ఎంతటి అవసరమో బి.సి సమాజం గమనించాలి.

తెలుగు ప్రజల ఆత్మగౌరవం అంటే తెలుగు దేశాన్ని, రైతుల ఆత్మగౌరవం అంటే కాంగ్రేస్ పార్టీని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అంటే టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడంలో కీలకపాత్ర వహించిన బి.సి లు నేడు అన్ని రకాల దోపిడికి, వంచనకు గురవుతున్నారు. అన్ని రకాల ఆత్మగౌరవ ఉద్యమాల్లో కీలకపాత్ర వహించిన బి.సి లు నేడు బిసి ల ఆత్మగౌరవం కోసం, బహుజన రాజ్యాధికారం కోసం ఐక్యం కావాల్సిన చారిత్రక సందర్భాన్ని గుర్తించి ముందుకు సాగాలి.

బహుజనులకు రాజ్యాధికారం నినాదంతో ఉత్తరప్రదేశ్, బీహార్ లలో బహుజనుల రాజ్యం ఏర్పడింది. పెరియార్ ఉద్యమ వారసత్వంగా ఆనాడు కరుణానిధి నేడు స్టాలిన్ తమిళనాడులో రాజ్యాధికారం చేపట్టి బహుజన ప్రజల సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. బిసి సమాజం నుండి ఎదిగిన బిసి నాయకులు, మేధావులు, విద్యావంతులు, విద్యా, ఉద్యోగాలతో మాత్రమే అభివృద్ది జరగదని గుర్తించాలి.

రాజ్యాధికారంతోనే సమగ్రాభివృద్ది జరుగుతుందని బి.సి ప్రజలను సామాజికంగా, రాజకీయంగా చైతన్య పరచి బి.సి లను ఐక్యం చేయాలి. ఆయా రాష్ట్రాల్లో విడివిడిగా జరుగుతున్న బిసి ఉద్యమాలు ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటిగా ఏర్పడి దేశవ్యాప్త బిసి ఉద్యమ నిర్మాణానికి జరిగే కృషిలో ప్రతి బిసి భాగస్వామ్యం కావాలి.(జనగణన చేయాలని, చట్టసభల్లో బి.సి లకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఆల్ ఇండియా బి.సి ఉద్యమ జాక్ ఏర్పాట్లు సందర్బంగా)
ఢిల్లీ జంతర్ మంతర్ నుండి…

– సాయిని నరేందర్
బి.సి స్టడీ ఫోరం
వ్యవస్థాపక చైర్మన్
9701916091

LEAVE A RESPONSE