– ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఓర్వలేకే తప్పుడు కేసు
– వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి.
తిరుపతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తోందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. తిరుపతిలో మీడియా ప్రశ్నలకు బదులిచ్చిన ఆయన, ఆ దిశలోనే తమ పార్టీ నేత, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆక్షేపించారు.
నియోజకవర్గంలో చాలా యాక్టివ్‌గా పని చేస్తూ, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కారణంగానే, ఉద్దేశపూర్వకంగానే అధికారులను దుర్భాషలాడారని ఆరోపిస్తూ, ఆయనపై తప్పుడు కేసు బనాయించారని దుయ్యబట్టారు. శ్రీకాళహస్తిలో రివర్ బే వ్యూ రిసార్ట్ నిర్మాణంలో ఎలాంటి అతిక్రమణలు జరగకపోయినా, అధికారులు అక్రమంగా కూల్చివేతకు సిద్ధం కావడంతో, మాజీ ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి అడ్డుకున్నారని, అధికారుల తీరును ప్రశ్నించారని.. దీంతో తప్పుడు కేసు నమోదు చేశారని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
ఆయనను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. శ్రీకాళహస్తిలో నది కరకట్టను గతంలో ఎవరూ పట్టించుకోలేదని, కానీ గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి, ఆలయానికి వచ్చే యాత్రికుల సౌకర్యం కోసం, కరకట్ట ఆధునికీకకరణ చేపట్టారని వెల్లడించారు.
రాష్ట్రంలో తమ పార్టీ వారిపై వేధింపుల పర్వం, ఒక్క శ్రీకాళహస్తికే పరిమితం కాలేదన్న వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తమను ప్రశ్నిస్తున్న వారందరి పట్లా కూటమి ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తోందని గుర్తు చేశారు. విపక్ష పార్టీ నాయకులపై అసత్య ఆరోపణలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్న, ఆయన ప్రజాస్వామ్యంలో ఇది సరైన విధానం కాదని స్పష్టం చేశారు.