రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8 న ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు.
మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర బి.సి.వెల్పేర్, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవితతో కలసి ఆమె సమీక్షా సమాశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరవుతున్నారన్నారు.
అధికారులు అంతా సమన్వయంతో వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే విధంగా తగు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం లో భాగంగా “లక్ పతి దీదీస్” అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు వంద మంది మహిళా ఎంట్రెప్రెన్యూర్లను ముఖ్య మంత్రి సత్కరించనున్నట్లు ఆమె తెలిపారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లక్ష మందికి పైగా మహిళలకు టైలరింగ్ లో శిక్షణ అందజేసి, కుట్టుమిషన్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి ఉద్దేశింపబడిన ఈవెంట్ మేనేజ్ మెంట్ యూనిట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో ప్రారంభిస్తారన్నారు. ఇందుకు సంబంధించిన స్టాళ్లను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలచే తయారుచేయబడే ఆహార, గృహాలంకరణ మరియు చిరు ధాన్యాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయాడానికి ఫ్లిప్కార్ట్, ఫార్మ్ వేద , మిల్లెట్ బ్యాంక్ మరియు హెర్బ్ కార్న్ వంటి సంస్థలతో ముఖ్య మంత్రి సమక్షం లో ఒప్పందం (MOU) చేసుకోనున్నట్లు ఆమె తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా వంద చేనేత మహిళా కళాకారులను గుర్తించి ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించబోతున్నట్టు తెలిపారు. చేనేత వస్త్రాలు, హస్తకళలకు సంబంధించిన స్టాళ్లను కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. పీఎం విశ్వకర్మ పథకం కింద దాదాపు 1300 మంది అర్హులైన మహిళలకు రూ.1,300 కోట్ల మేర రుణాలను అందచేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారిని ఎంపిక చేయాలని, వారికి సీఎం చేతుల మీదుగా యూనిట్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
అన్ని శాఖలకు సంబంధించి 15 స్టాళ్లను మాత్రమే ఏర్పాటు చేయాలని మంత్రి అనిత స్పష్టం చేశారు. మహిళా రక్షణకు శక్తి యాప్ రూపొందించామని , ఈ యాప్ మహిళా దినోత్సవం రోజున సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ డా.మల్లికార్జున, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ తేజ్ భరత్ తో పాటు స్త్రీ, శిశు, గిరిజన, సాంఘిక, మైనారిటీ సంక్షేమం, పోలీస్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.