Suryaa.co.in

Telangana

అంతర్‌రాష్ట్ర టీచర్ల బదిలీ సమస్యకు త్వరలో పరిష్కారం

– ఆంధ్రా నుంచి బదిలీ కోరుతున్న టీచర్లు భయపడవద్దు
– తెలంగాణ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ హామీ
– ఆంధ్రాకు బదిలీ అయిన తెలంగాణ టీచర్లతో భేటీ

హైదరాబాద్: ‘‘ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో టీచర్ ఉద్యోగాలు పొందిన తెలంగాణ మూలాలున్న వారు భయపడాల్సిన పనిలేదు. మిమ్మల్ని తెలంగాణకు బదిలీ చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఆమేరకు చర్చలు జరుగుతున్నాయి. మీ సమస్యను తెలంగాణ ప్రభుత్వం మానవతాదృక్పథంతో చూస్తోంది. త్వరలో మీ సమస్య పరిష్కారమయ్యేలా పోరాడుతున్నాం’’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, టిఎన్‌జిఓస్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ అన్నారు.

దాదాపు 25 ఏళ్ల నుంచి ఏపీలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణ టీచర్లు సోమవారం జగదీశ్వర్, ముజీబ్‌ను వారి కార్యాలయంలో కలిశారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లయినప్పటికీ, తాము ఇంకా ఏపీలోనే ఉండిపోవలసి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తమకు ఎన్‌ఓసి ఇచ్చి చాలా కాలమవుతున్నా, తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని వారి దృష్టికి తీసుకువెళ్లారు. టీచర్ల బదిలీల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఇతరుల నుంచి అభ్యంతరాలు కూడా లేవ ని వివరించారు. ఆర్ధిక భారం కూడా ఉండదన్నారు.

దీనికి స్పందించిన జగదీశ్వర్, ముజీబ్.. రాష్ట్రం విడిపోయి పదేళ్లవుతున్నందున, మీ బదిలీలకు ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఆ మేరకు తాము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరసో ఇచ్చారు. మీ సమస్యకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీలో చేర్చినందున, త్వరలోనే బదిలీలకు అవకాశం ఉండవచ్చని చెప్పారు. సేతు వేణుమాధవ్, ఇక్బాల్, కల్యాణి, జయంతి, శేషు తదితరులు వారిలో కలసిన వారిలో ఉన్నారు.

LEAVE A RESPONSE