Suryaa.co.in

Andhra Pradesh

టిటిడి అగ్ని ప్రమాదంపై విచారణ చేయాలి

  • టీటీడీలో 2000 కోట్ల రూ/- ల భక్తుల సొమ్ము చేతులు మారింది… దాన్ని కప్పిపుచ్చేందుకే అగ్ని ప్రమాదం..
  • జగన్ అవినీతిని బయటపడకుండా అధికారులే కాపాడుతున్నారా…??
  • గత ప్రభుత్వంలో జరగని ప్రభుత్వ ఫైల్స్ దగ్ధం, తరచుగా అగ్ని ప్రమాదాలు చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు జరుగుతున్నాయి…

అమరావతి: 18.8.24 ఆదివారం బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ… కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సంబంధించిన కార్యనిర్వాహక కార్యాలయంలో అగ్ని ప్రమాదాన్ని సృష్టించి గతంలో చైర్మన్గా పనిచేసిన వై వి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి చేసిన 2000 కోట్ల రూపాయల భక్తుల సొమ్ము అవినీతి బాగోతం బయటకు రాకుండా ఉండేందుకోసం అగ్ని ప్రమాదాన్ని సృష్టించారని, ప్రభుత్వ శాఖల్లో ప్రజాధనాన్ని కాజేయటమే కాకుండా చివరాఖరుకు దేవుడు సొమ్మును కూడా కాజేసే దుశ్చర్యకు జగన్ ప్రభుత్వం వైసీపీ నాయకులు దిగజారి అగ్ని ప్రమాదం సృష్టించారని, శ్రీవాణి, ఎల్ వన్, వీఐపీ బ్రేక్ తదితర దర్శనాలు మరియు ఇంజనీరింగ్,ఆహార కాంట్రాక్టులు తదితర అంశాల్లో అనేక అవినీతి జరిగిందని, ఈ డబ్బంతా భక్తుల సొమ్మని, దీనిపైన తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, దోషులు ఎంతటి వారైనా, అధికారులు ఉన్నా సరే చట్ట ప్రకారం శిక్షించాలని శ్రీధర్ కోరారు.

గత ఐదేళ్లలో జగన్ పాలనలో ఏ ఒక్క కార్యాలయంలో కూడా ఒక్క ఫైలు ఎందుకు తగలబడలేదు, ఒక్క అగ్నిప్రమాదం కూడా ఎక్కడా జరగలేదు. ఎన్నికల అయిన తర్వాత నుండి రాష్ట్రంలో వివిధ శాఖల అధికారులు జగన్ చేసిన అవినీతిని, రూల్స్ కు విరుద్ధంగా చేసినా అరాచకాలను కప్పిపుచ్చేందుకు జగన్ను కాపాడేందుకు కోసం అధికారులు తీవ్ర తాపత్రయం పడుతున్నారని దాన్లో భాగంగానే ఎన్నికల కౌంటింగ్ జరగక ముందే రాష్ట్ర సిఐడి కార్యాలయంలో ఫైల్స్ ను, హెరిటేజ్ సంస్థ కాగితాలను తగలబెట్టారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో గుడివాడలో ఫైల్స్ దగ్ధం చేయటం, ఆ తర్వాత పుంగనూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సృష్టించటం, ఆ తర్వాత నిన్న తిరుమలలో టీటీడీ కార్యాలయంలో ఫైల్స్ తగలబెట్టడం ఇలా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వైయస్ జగన్ ను,అప్పటి మంత్రులు, శాసనసభ్యులను రక్షించడం కోసం ఉన్నత స్థాయి అధికారులే స్వయంగా జగన్ నేతృత్వంలో ఈ అగ్ని ప్రమాదాలకు, దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, ఇప్పటివరకు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్న అధికారులపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంతో, మిగిలిన ప్రాంతాల్లో అధికారులకు కూటమి ప్రభుత్వం అంటే అలుసుగా మారిందని శ్రీధర్ తెలియజేశారు.

ఇటువంటి తప్పుడు పనులు చేసే అధికారులను, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఫైల్స్ మాయం చేస్తున్న ఈ అధికారులను తక్షణమే చంద్రబాబు ప్రభుత్వం చట్టరీత్యా కేసులు పెట్టి చర్యలు చేపట్టాలని లేకపోతే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, ప్రజాధనం దుర్వినియోగం తదితర అంశాలు బయటకు వచ్చే అవకాశం లేదని అమరావతిలోని రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్ లో కూడా ఇదే పద్ధతిని అధికారులు అవలంబించే ఆస్కారం కూడా ఉన్నదని శ్రీధర్ భయాందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పట్ల కొంతమంది అధికారులు భయము, భక్తీ లేకుండా ప్రవర్తిస్తున్నారని ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా వీరిపై ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, పుంగనూరు అంశంలో చంద్రబాబు డిజిపిని స్వయంగా హెలికాప్టర్ ఇచ్చి పంపడమే దీనికి నిదర్శనమని చెప్పారు.

రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన అనేక కార్యలయాల్లో ఇదేవిధంగా ఫైల్స్ తగ్గాలపెట్టే సంస్కృతిని జగన్ ఈ ప్రభుత్వంలో ప్రవేశపెట్టారని దానివల్లనే ఈ ఫైల్స్ తగలబెట్టడం, ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాలు సృష్టించటం తదితర అరాచకాలను జగన్ డైరెక్షన్ ప్రకారం కొంతమంది అధికారులు నడుచుకుంటున్నారని, వారి పట్ల కూటమి ప్రభుత్వం ఉదాసీనత వైఖరి లేకుండా చర్యలు తీసుకొని, ప్రభుత్వ శాఖల్లో వివిధ జిల్లాల్లో ఉన్న కార్యాలయాల్లో ఫైల్స్ ని భద్రపరిచే విధంగా విజిలెన్స్ కమిటీలు వేసి తక్షణమే చర్యలు చేపట్టాలని శ్రీధర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వంగవీటి చైతన్య, ఎండపల్లి శబరి, వడ్డమాను ప్రసాదు, ఫణి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE