సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు గవర్నర్ కు ఆహ్వానం

– చిన్నజీయర్ స్వామి తరుపున స్వాగతించిన తలశిల, చెవిరెడ్డి భక్తబృందం

తెలుగు నేల పులకించేలా విశ్వనగరం హైదరాబాద్‌ సిగలో రూపుదిద్దుకున్న సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనా మహోత్సవాలకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆహ్వానం పలికారు. త్రిదండి చిన జీయర్‌ స్వామి సత్‌ సంకల్పం ఫలితంగా సాకారమయ్యే ఈ మహోత్సవ ఘట్టానికి విచ్చేయాలని శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురాం, చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితర భక్త బృందం సభ్యులు గౌరవ గవర్నర్ ను స్వాగతించారు.

శుక్రవారం విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన వీరు, ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఈ బృహత్క్యార్యం జరగనుందని వివరించారు. సమత, మమత, ఆధ్మాత్మికతల మేళవింపుగా విశ్వమానవాళి శ్రేయస్సు ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారని చెవిరెడ్డి గవర్నర్ కు వివరించారు. 200 ఎకరాల సువిశాల స్థలంలో 216 అడుగుల భగవద్రామానుజ పంచలోహ మహా విగ్రహాం రూపుదిద్దుకుందన్నారు. విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా సహస్రకుండాత్మక లక్ష్మీ నారాయణ యాగం నిర్వహిస్తున్నారని, 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగం చేస్తారని చెవిరెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు.

మరోవైపు చిన జియ్యర్ స్వామి చరవాణిలో గవర్నర్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో స్వయంగా వచ్చి ఆహ్వానించ లేకపోతున్నానని, తప్పని సరిగా కార్యక్రమానికి రావాలని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply