ఐరాస వాటర్‌ కాన్ఫరెన్స్‌కు వీ ప్రకాష్‌కు ఆహ్వానం

* మార్చి 22-25వరకు న్యూయార్క్‌లో సదస్సు
* గ్లోబల్‌ వార్మింగ్‌, జలసంరక్షణతోపాటు పలు కీలక అంశాలపై చర్చ

తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ వీ ప్రకాశ్‌కు అరుదైన అవకాశం లభించింది. ప్రపంచ జలదినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌ వేదిక మార్చి22నుంచి 25వ తేదీవరకు నిర్వహించనున్న అంతర్జాయతీ వాటర్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు ఆహ్వానం దక్కింది. ఈ మేరకు యూఎన్‌ సెక్రటేరియెట్‌ బుధవారం సమాచారం అందజేసింది.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరిగిపోతున్న భూతాపం నేపథ్యంలో ఏర్పడుతున్న నీటి కొరత, తలెత్తుతున్న సమస్యలు, తద్వారా సామాజం, ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాలతోపాటు పలు కీలక అంశాలపై వివిధ దేశాల నుంచి హాజరయ్యే ప్రతినిధులు, నిపుణులు ఈ కాన్ఫరెన్స్‌లో చర్చించనున్నారు. పరిశోధన పత్రాలను సమర్పించనున్నారు. అదేవిధంగా ప్రపంచం వెంటనే చేపట్టాల్సిన నివారణ చర్యలను ప్రాతిపదించనున్నారు.

తెలంగాణకు గర్వకారణం..
యూఎన్‌వో ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు రాష్ట్రానికి చెందిన నీటి రంగనిపుణులు, తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ వీ ప్రకాశ్‌కు అవకాశం లభించడం తెలంగాణకు గర్వకారణం. తెలంగాణ రాష్ట్రంలో నీటి వనరుల అభివృద్ధికి 3దశాబ్దాలుగా ప్రకాశ్‌ విశేష కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గానే కాకుండా పెనుస్యూలర్‌ రివర్‌ బేసిన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా నదుల సంరక్షణకు పాటుపడుతున్నారు. గతేడాది హైదరాబాద్‌ వేదికగా నేషనల్‌ కన్వెన్షన్‌ ఆఫ్‌ రివర్‌ బేసిన్‌ నిర్వహణలో కీలకభూమిక పోషించారు. ఇదిలా ఉండగా ఐరాస సద్సుకు ప్రకాశ్‌తోపాటుగా వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రాచుర్యం పొందిన డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ కూడా హాజరుకానుండడం విశేషం.

Leave a Reply