– ఇంకా ఎన్ని సంఘాలను చీలుస్తారు? – బొప్పరాజు
అమరావతి : ఫిబ్రవరి 3న చలో విజయవాడకు లక్షలమంది తరలిరావాలని పీఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చింది. సచివాలయంలో స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం సంఘ నేతలు మీడియాతో మాట్లాడారు.
ఈ నెలకు పాతజీతం ఇవ్వాలని కోరామని బండి శ్రీనివాస్ వెల్లడించారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయటపెట్టడంతో పాటు.. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని కోరామని గుర్తు చేశారు.తమ చిన్న కోరికలు తీర్చలేని కమిటీ .. డిమాండ్లు తీరుస్తుందా? అని ప్రశ్నించారు. తాము ప్రస్తావించిన 3 డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తే చర్చలకు సిద్ధమన్నారు.
ఎన్ని సంఘాలను చీలుస్తారు: బొప్పరాజు
పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుందని బొప్పరాజు అన్నారు. చర్చలకు వెళ్లాలంటే తమ 3 కోరికలు తీర్చాలని అడిగామని.. కానీ మా లేఖకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందన లేదని స్పష్టం చేశారు.ప్రజలు, ఉద్యోగులకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఉద్యోగ సంఘాల నేతలే చర్చలకు రావడం లేదని ప్రచారం చేస్తున్నారు. సజ్జల చుట్టూ మేం అనేకసార్లు తిరిగాం. 40 పాయింట్లపై సజ్జల గంటన్నరసేపు వివరంగా చర్చించారు. మాకు జరిగిన ప్రతి అన్యాయానికి సజ్జల సాక్ష్యం కాదా? చర్చలకు కొత్త సంఘాలు కూడా రావాలని ఆహ్వానిస్తారా? ఇంకా ఎన్ని సంఘాలను చీలుస్తారు? మీ వద్దకు వచ్చిన 9 మంది ఉద్యోగ సంఘాల నేతలు కాదా?. లిఖితపూర్వక లేఖలకు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం. మా లేఖలకు ప్రభుత్వం జవాబిస్తేనే చర్చలకు వెళ్తాం” అని బొప్పరాజు, అమరావతి జేఏసీ ఉద్యోగుల అధ్యక్షుడు అన్నారు.
ట్రెజరీ ఉద్యోగులు కూడా తమలో భాగమే అన్నారు బొప్పరాజు. తమ కార్యాచరణలో భాగంగానే ట్రెజరీ ఉద్యోగుల నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ట్రెజరీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటే మమ్మల్ని రెచ్చగొట్టినట్లే అని హెచ్చరించారు. జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. సప్లిమెంటరీ బిల్లులు రూ.18 కోట్లు వెంటనే ఇవ్వాలని బొప్పరాజు డిమాండ్ చేశారు.
రాష్ట్ర పీఆర్సీనా .. కేంద్ర పీఆర్సీనా : సూర్యనారాయణ
మీరు అమలుచేసేది రాష్ట్ర పీఆర్సీనా.. కేంద్ర పీఆర్‌సీనా…? మంత్రుల కమిటీ తొలుత అయోమయం వీడాలి. ఉద్యోగులతో ప్రభుత్వం దోబూచులాట ఆడుతోంది.
కేంద్రం 104 రకాల అలవెన్సులు ఇస్తోంది.. మీరూ ఇస్తారా? చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు. రికవరీ విధానం ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలి?
పీఆర్సీ కమిటీ నివేదిక లేకుండా పే ఫిక్సేషన్ ఎలా చేస్తారు? మాకు మెచ్యూరిటీ లేదనే మాట ఉపసంహరించుకోవాలి. చర్చలు ఫలవంతం అయ్యేలా ప్రభుత్వం చొరవ చూపాలి.