-విద్యార్ధులకు పథకాలు మెరుగైన భవిష్యత్ కోసమా? జగన్ తప్పుడు ప్రచారానికా?
-విద్యను ప్రథమ స్థాయి నుండి అథమ స్థాయికి దిగజార్చారు
– టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు
విద్యార్ధులకు మెరుగైన విద్యను అందించి భవిష్యత్ కు బాటలు వేయడానికి మాత్రమే పథకాలు అమలు చేస్తారు. కాని జగన్ మాత్రం అబద్దపు ప్రచారం చేసుకునేందుకు, తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యకు గురి చేసేందుకే పథకాలు అమలు చేస్తున్నారు. స్కాలర్ షిప్స్ ఇవ్వమని విద్యార్ధులు, విద్యార్ధి సంఘాలు ప్రశ్నిస్తుంటే అమ్మ ఒడి ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలో సీట్లు కేటాయించి, నిధులు చెల్లించమని కోరుతుంటే దీనికి సైతం అమ్మ ఒడి అమలు జమ చేస్తున్నామంటూ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గం.
విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్ధుల బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుందని చట్టం చెబుతుంటే… జగన్ మాత్రం తాను చేసిందే చట్టం, తాను చెబుతున్నదే న్యాయమంటూ ప్రవర్తిస్తున్నారు. విద్యా హక్కు చట్టం అమలుకు అమ్మఒడి పథకాన్ని మెలిక పెట్టడంతో పేద విద్యార్ధులకు ప్రయోజనం లేకుండా పోతుంది. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలు 25 శాతం సీట్లు పేదలకు కేటాయించి ప్రభుత్వం నేరుగా పాఠశాలలకు ఫీజులు చెల్లించాలి.
అయితే అమ్మఒడి నగదును ఫీజుగా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించడం సిగ్గుచేటు. అమ్మఒడిని ఫీజుగా కట్టాల్సినప్పుడు ఆర్టీఈ కింద సీటు పొందాల్సిన అవసరం ఏమిటి? గత ఏడాది ప్రభుత్వం ఫీజులు పాఠశాలలకు చెల్లించకపోవడంతో విద్యా హక్కు చట్టం నీరుగారిపోయింది. ఇప్పటికే అమ్మ ఒడిని నాన్న బుడ్డిగా మార్చారు. 82 లక్షల మంది విద్యార్ధులకు గాను కేవలం 44 లక్షల మందికి, రూ.15వేల నుంచి 13వేలకు కుదించి 5 ఏళ్లకు బదులు 4 ఏళ్లకే అమలు చేస్తున్నారు. పేద విద్యార్ధులకు అందించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ను నిలిపివేశారు.
అప్పులు చేయడం, నిధులు దారి మళ్లించడంపై చూపిన శ్రద్ధ ఉపాధి హామీ సద్వినియోగంపై చూపించడం లేదు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగంలో దేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉండటం ప్రభుత్వ అక్రమాలకు అద్దం పడుతుంది. ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తూ గ్రామాలలో అభివృద్ధి పనులు నిలిపివేయడంతో ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున వలసలు వెళుతున్నారు. దీని ప్రభావం విద్యార్ధుల చదువుల మీద పడుతుంది.