సెంటు భూమి పంపిణీ పథకం చట్టబద్దమేనా?

– లబ్ధిదారులు నిజంగా అర్హులేనా?

జగన్మోహన్ రెడ్డిగారు…ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి, “అమరావతి” మాట, మీ నోట విన్నందుకు కాస్త సంతోషపడ్డాను. ఆ నోటితోనే అమరావతే మన రాజధానని, అమరావతి గడ్డపైన భారీ పోలీసు బందోబస్తు మధ్య నేడు మీరు నిర్వహించిన బహిరంగసభలో విస్పష్ట ప్రకటన చేసి ఉంటే రాష్ట్ర ప్రజలు చాలా సంతోషించే వాళ్ళు. అలాగే, రాజధాని నిర్మాణం ఏ దుస్థితిలో ఉన్నదో! రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతతో వివరించి ఉంటే సముచితంగా ఉండేదేమో కదా?

పోలీసుల నిఘా – పహారా – నిర్భందకాండ మధ్య ఒక ప్రహసనంగా మీరు ప్రారంభించిన “సెంటు భూమి పంపిణీ పథకం” చట్టబద్దమేనా? లబ్ధిదారులు నిజంగా అర్హులేనా?
సెంటు భూమి పంపిణీ ద్వారా అమరావతి సామాజిక అమరావతిగా మారబోతోందని మీరు వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని ప్రాంతం తాడికొండ ఎస్.సి. నియోజకవర్గంలోనే ఉన్నది కదా? అంటే, తాడికొండ నియోజకవర్గంలో అత్యధికులు ఎస్.సి. ప్రజలు ఉంటేనే కదా! ఎస్.సి. నియోజకవర్గంగా ఉన్నది? ఆ మాత్రం మీకు తెలియకనే వ్యాఖ్యానించారని భావించలేం కదా! అంటే, మీ వ్యాఖ్యల్లో దురుద్ధేశం తొణికిసలాడుతున్నది.

రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో ప్రస్తావించిన మాస్టర్ ప్లాన్ కు లోబడే “సెంటు భూమి పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నారా? అమరావతి రాజధాని నిర్మాణం – అభివృద్ధి ప్రణాళికను విచ్ఛిన్నం చేసే ఆలోచనతో అమలు చేస్తున్నారా?

ప్రభుత్వం రైతుల నుండి భూసేకరణ చట్టం -2013 ప్రకారం నష్ట పరిహారం చెల్లించి, పునరావాస పథకాన్ని అమలు చేసి సేకరించిందా? “రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యం” దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ సమీకరణ చట్టం -2014 మేరకు సేకరించిందా?
మీ ప్రభుత్వ కాలంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఒక్క అడుగైనా ముందుకు పడ్డాయా? విధ్వంసమే ప్రభుత్వ విధానమా?
నాలుగేళ్లుగా విద్వేషపూరితమైన, కుట్రపూరితమైన ‘రాజనీతి’ని అమలుచేస్తున్న మీరు రైతులు రాజధాని నిర్మాణానికిచ్చిన భూములను “సెంటు భూమి పథకం” పేరుతో పందారం చేసే నైతిక హక్కు ఉన్నదా?

అమరావతి రాజధాని నిర్మాణానికి 34,387 ఎకరాల భూములిచ్చిన 30,000 మంది రైతులకు – ఏపిసీఆర్డీఏ మధ్య జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఆ ఒప్పందాన్ని మీ ప్రభుత్వం ఉల్లంఘించిందా? లేదా?

రైతులిచ్చిన భూమిని ప్రభుత్వం ఏకపక్షంగా, చట్ట వ్యతిరేకంగా, న్యాయస్థానాల తీర్పులను వక్రీకరిస్తూ, పేదల “ముసుగు”లో పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంలో దురుద్ధేశంలేదని ఎలా భావించాలి?మూడున్నరేళ్ళుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న రైతుల గుండె కోత – ఆవేదన – ఆందోళన, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీకు ఏమాత్రం పట్టదా?

– టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు

Leave a Reply