టీడీపీలో కట్టుదాటుతున్న క్రమశిక్షణ?
– లక్ష్మణరేఖ దాటుతున్న తమ్ముళ్లు
– బహిరంగ బెదిరింపుల పర్వం
– జగన్ బెదిరింపుల సిలబస్ మార్చుకోని వైసీపీ మాజీలు
– ఇంకా టీడీపీ స్కూల్ పద్ధతులు పాటించని ధిక్కార పర్వం
– నియోజకవర్గాలను తండ్రి, భార్య, భర్త, కొడుకు, అన్న, పీఏల పెత్తనానికి వ దిలేసిన తీరు
– భయపడటం మానేశారా?
– కట్టడి చేయకపోతే కష్టమంటున్న పార్టీ సైనికులు
– వివాదాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతా
– ఆధారాలు లేకుండా రాస్తే తాటతీస్తా
– మీడియాకు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హెచ్చరిక
( మార్తి సుబ్రహ్మణ్యం)
క్రమశిక్షణకు తెలుగుదేశం మారుపేరు. వైసీపీ నాయకత్వానికి అది పూర్తి భిన్నం. పార్టీ ప్రముఖులు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఇతరులపై ఎన్ని దాడులు చేసినా జగనన్న లెక్క .. చంద్రన్న గమ్మున నవ్వుతూ కూర్చోరు. తన సమక్షంలోనే ప్రత్యర్ధులను బూతులతో తిడుతుంటే.. జగనన్న మాదిరిగా చిరునవ్వులు చిందించరు. జగన్ మాదిరిగా పార్టీ నేతలపై మీడియాలో వ్యతిరేక వార్తలు వచ్చినా పట్టించుకోకుండా బేఫర్వాగా ఉండరు. వారిని పిలిచి హెచ్చరిస్తారు. తీరు మార్చుకోమని మందలిస్తారు. దానికంటే ముందు.. పార్టీ సీనియర్లతో వారిని పిలిపించి వివరణ తీసుకుంటారు. ఇదీ టీడీపీ స్కూలు సిలబస్. అన్న ఎన్టీఆర్ స్థాపించిన స్కూలు మరి! ఆయన రూపొందించిన సిలబస్ అది!!
కానీ ఇప్పుడు మారుతున్న కాలంలో కొత్త సిలబస్ వచ్చింది. ఇతర పార్టీల నుంచి అవసరార్ధం వచ్చి చేరిన విద్యార్ధులు, అందులో ఎవరికి నచ్చిన పేజీలు వారు చేర్చుకుంటున్నారు. పార్టీకి ఆరోప్రాణమైన క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు. బెదిరింపులు.. సెటిల్‌మెంట్లు.. వసూళ్లు.. నియోజకవర్గాల్లో కుటుంబపాలన. చివరాఖరకు పార్టీని కూడా లెక్కచేయనంత ధిక్కారపర్వం. ఫలితంగా క్రమశిక్షణ కట్టుతప్పుతోంది. అంతిమంగా అప్రతిష్ఠపాలవుతోంది పార్టీనే. దీనికి తెరదించేది ఎప్పుడు?.. వ్యక్తుల కంటే పార్టీ గొప్పదని సంకేతాలు ఇచ్చేదెన్నడు?.. ఇవీ పసుపు సైనికుల ప్రశ్నాస్త్రాలు.
‘‘ మీడియా అంటే నాకు లెక్కలేదు. నేను అన్ని చేసి వచ్చినొన్ని.. రాసుకోండి ..ఏం రాసుకుంటారో. తప్పు చేస్తే రాయండి.. ఆధారాలు లేకుండా రాస్తే తాటతీస్తా. తనపై వివాదాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతా. కొంతమంది నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు. నా కుటుంబ పెత్తనం ఉందని అంటున్నారు. భూ అక్రమాలు చేశాను అని చెబుతున్నారు.. వీటన్నింటినీ నిరూపించాలి లేదంటే.. రైలు పట్టాలపై పడుకోబెడతా ’’ – ఇవీ.. వైసీపీలో కార్మికమంత్రిగా పనిచేసి, ఎన్నికల ముందు టీడీపీలో చేరి గుంతకల్ ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మనూరు జయరామ్ మీడియాకు జారీ చేసిన హెచ్చరికలు!
వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎమ్మెల్యేలు, మంత్రులయిన వారు ఇంకా వైసీపీ బెదిరింపుల సిలబస్ పాటిస్తున్నట్లున్నారు. వైసీపీ జమానాలో కార్మికశాఖలో కొడుకుల పెత్తనానికి తెరలేపి, కర్నూలు జిల్లాలోని తన నియోజకవర్గాన్ని పేకాట క్లబ్బుగా మార్చేశారని.. విపరీతమైన ఆరోపణలు ఎదుర్కొన్న గాలి జనార్దన్‌రెడ్డి మిత్రుడిగా పేరున్న మాజీ మంత్రి, టీడీపీ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం తన వైసీపీ సహజశైలిని, సిలబస్‌ను ఇంకా మార్చుకోలేదు.
కర్నూలు జిల్లా నుంచి గుంతకల్‌కు మారిన జయరామ్.. గతంలో వైసీపీలో ఉండగా ప్రాతినిధ్యం వహించిన ఆలూరు నియోజకవర్గంలో, గ్రామాల్లో టెంట్లు వేసి మరీ పేకాట ఆడించారంటూ అనేక కథనాలు మీడియాలో వెలువడ్డాయి. బెంగళూరు నుంచి కూడా వచ్చి పేకాట ఆడిస్తున్నారని, దానిని ఆయన కుటుంబసభ్యులే ముందుండి నడిపిస్తున్నారంటూ మీడియా కథనాలు విరుచుకుపడ్డాయి.
అప్పట్లో ఆయన గ్రామంలో పట్టుబడ్డ జూదరులు, పేకాట ముక్కల ఫొటోలు కూడా మీడియాలో వచ్చినవే. అసలు జయరాం కుటుంబసభ్యులే బెంగుళూరు నుంచి లారీల్లో మద్యం తీసుకువచ్చి అమ్ముతున్నారని, ఇసుకను తీసుకువెళ్లిన లారీల్లోనే.. మద్యం తీసుకువస్తున్నారని, నాటి టీడీపీ నేతలు మీడియా సమక్షంలోనే ఆరోపించారు. టీడీపీ నేతలపై జయరామ్ అనుచరులు దాడులు చేయిస్తున్నారంటూ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అదే జయరామ్ టీడీపీలో ఉన్నందున.. టీడీపీ స్కూలు సిలబస్ పాటిస్తున్నారేమోననుకున్నారు. అంటే రాముడు మంచిబాలుడిలా ఉంటారని భావించారు. కానీ ఆయన ఇంకా జగన్ బెదిరింపుల సిలబస్‌నే ఫాలో అవుతున్నారని తాజాగా బయటపడింది. ‘‘ నాపై రాసిన మీడియాను రైలుపట్టాలపై పడుకోబెడతా. తాటతీస్తాన’’ంటూ బెదిరించిన వీడియో ఒకటి, ఇప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా భావించే టీడీపీని సంకట పరిస్థితిలోకి నెట్టింది.
అయితే ఇది విపరీతంగా వైరల్ అయి, పార్టీకి అప్రతిష్ఠగా మారడంతో దిద్దుబాటుకు దిగడం అనివార్యంగా మారింది. ఎమ్మెల్యే జయరామ్ మీడియాను బెదిరించడంపై టీడీపీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పద్ధతి పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని, మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని టీడీపీ రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్.. ఎమ్మెల్యే జయరామ్‌కు ఫోన్ చేసి హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
నిజానికి మాజీ మంత్రి జయరామ్ నియోజకవర్గంలో కుటుంబసభ్యుల పెత్తనం ఎక్కువయిందని, అది పార్టీకి చెడ్డపేరు తెస్తోందని స్థానిక విలేకరులు, అక్కడ తొలి నుంచీ పనిచేస్తున్న టీడీపీ వారిని హెచ్చరించారట. ఆ విషయాన్ని వారు జయరామ్ చెవిని వే శారట. దానితో నేతల సమక్షంలోనే విలేకరులను పిలిపించి.. పార్టీ నేతలకు చెబుతున్నవి నా ముందు చెప్పమని, లేకపోతే రైలుపట్టాలమీద పడుకోబెడతానని బెదిరించారట. అదీ సంగతి.
అయితే ఇలాంటి కుటుంబపెత్తనాల నియోజకవర్గాలు, రాష్ట్రంలో చాలానే ఉన్నాయన్నది పార్టీ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదు. వైసీపీ నుంచి వచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులయిన కొందరు, ఎన్నికల ముందు ఎమ్మెల్యే టికెట్లు తీసుకున్న మరికొందరు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో.. భర్త, తండ్రి, తమ్ముడు, కొడుకు, భార్యల పెత్తనంతో పార్టీ బద్నామ్ అవుతోందన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గాలను కుటుంబసభ్యుల పెత్తనానికి వదలేసి.. వారంతా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలో వ్యాపారాలు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి ప్రకాశంలో కొత్తగా నియమితులైన ఒక మంత్రి నియోజకవర్గ పార్టీ వ్యవహారాన్ని పీఏకు, వ్యాపారాలు-వసూళ్లబాధ్యతను తన ఆంతరంగికుడికి అప్పగించారన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా క్వారీ రాళ్లు రవాణా చేసే లారీలు, ఇసుక, మట్టి, బియ్యం రవాణా వ్యవహారాలన్నీ సదరు ఆంతరంగికుడే చూస్తున్నారన్నది పార్టీ నేతల ఫిర్యాదు. మరో మంత్రి తన సోదరుడికి నియోజకవర్గానికి అప్పగించారన్నది మరో ఆరోపణ.
ఇక రాయలసీమలో.. వైసీపీ నుంచి ఎన్నికల ముందు పార్టీలో చేరి మంత్రి అయిన మరో ప్రముఖుడు, నియోజకవర్గాన్ని తన భార్యకు అప్పగించారన్న ఫిర్యాదులున్నాయి. ఆమెకు మంత్రి మాదిరిగానే ప్రొటోకాల్ గౌరవం ఇవ్వాలన్న వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. దానిపై స్వయంగా సీఎం సైతం రంగంలోకి దిగి, మందలించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎన్నికలకు నెలరోజుల ముందు, టీడీపీలో చేరి మంత్రి అయిన ఓ గోదావరి జిల్లా ప్రముఖుడు.. తనశాఖను బావకు, నియోజకవర్గాన్ని తండ్రికి అప్పగించారన్నది వస్తున్న ఆరోపణ. బావ తరచూ సచివాలయంలోని చాంబరుకు వచ్చి, వ్యవహారాలు చక్కదిద్దుతున్నారని సచివాలయ వర్గాల్లో సైతం చర్చ జరుగుతోంది. శాఖాపరమైబదిలీల వ్యవహారాల్లో, ఆయనే చక్రం తిప్పుతున్నారన్న ఫిర్యాదులు లేకపోలేదు.
ఎన్నికల ముందు పార్టీలో చేరి, మంత్రి అయిన ఓ ఉత్తరాంధ్ర ప్రముఖుడు.. నియోజకవర్గాన్ని తన తండ్రి, కుటుంబసభ్యులకు అప్పగించారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు మంత్రులకు ర్యాంకులు ఇస్తున్న సందర్భంలో, ఆ మంత్రి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇక ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి.. తనతోపాటు పార్టీలో చేరిన వారికి, వైసీపీ వారికి ఇసుక, మట్టి పనులు ఇప్పిస్తున్నారని. ఐఐటి పనుల కాంట్రాక్టులు కూడా, తనతో వచ్చిన వైసీపీ వారికే కట్టబెడుతున్నారన్నది టీడీపీ నేతల బహిరంగ ఫిర్యాదు. బుజ్జి అనే తన ప్రధాన అనుచరుడి ని, ఆయన విపరీతంగా ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు.
ఉత్తరాంధ్రలో ఓ సీనియర్ మంత్రికి చెందిన పేషీలో వసూళ్ల పర్వం, బహిరంగంగానే నడుస్తోందని సచివాలయ వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి. ఆ విషయంలో సదరు మంత్రి ఎవరికీ భయపడటం లేదని, ఆయన వద్ద పనిచేసే ఓ అధికారి వసూళ్ల విషయంలో నిర్బయంగా వ్యవహరిస్తుండటంపై, పార్టీ నేతలే విస్తుపోతున్నారట.