(సుబ్బు)
ఈమె ఇంట్లో జాగా లేకనో.. లేక ఏ అనాధనో అయినందున ఈ షాపు దగ్గర పడుకున్నారనుకుంటే కచ్చితంగా తప్పులో కాలేసినట్లే. ఈ మహిళ ఒక రైతు. భూములు, ఇల్లు, వాకిలీ ఉన్న రైతే. మరెందుకు ఇంటిని వదిలి ఈ షాపు దగ్గర కావలి కాయడం అని సందేహం రావచ్చు. ఇంతకూ ఆ షాపు ఆషామాషీది కాదు. అది ఎరువుల షాపు. వ్యవసాయం కోసం కావలసిన యూరియా, పెస్టిసైడ్స్ అక్కడే అమ్ముతుంటారు.
అయితే ఎప్పుడు వస్తుందో తెలియని యూరియా కోసం.. వచ్చిందని తెల్సిన వెంటనే దాని కొనుగోలు కోసం రైతులు ఇలా షాపుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి మళ్లీ మొదలయింది. చాంతాడంత క్యూలో నిలబడలేని ఓపికస్తులు, కుటుంబసభ్యులను వంతులుగా నిలబెట్టడం చేస్తున్నారు. మరికొందరు తమ ప్రతినిధులుగా చెప్పులను క్యూలో పెట్టి.. తమ వంతువచ్చిందని తెలిసిన వెంటనే షాపులకు వస్తున్న పరిస్థితి. ఇంకొందరు పాపం ఆ షాపులు తెరిచేంతవరకూ అక్కడే పడుకుండిపోతున్న దుస్థితి. అదిగో.. ఆ చిత్రమే.. ఈ వి‘చిత్రం’.
ఇది మెదక్‌లో యూరియా కోసం రైతన్నల అరిగోసకు నిలువెత్తు నిదర్శనం. ఒక్క మెదక్‌లోనే కాదు. తెలంగాణ అంతటా ఇదే గోస. అదేమంటే.. ఇది అన్ని రాష్ట్రాల్లోనే ఉందంటూ పాలకుల ఎదురుదాడి. పోనీ ఈ దృశ్యమేదో ఉమ్మడి రాష్ట్రంలోనిది కాదు. పాత ఫొటో అంతకంటే కాదు. అచ్చంగా తాజా దృశ్యమే పాలకుల వైఫల్యానికి స‘దృశమే’. ఇప్పుడిది సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లెక్కన రైతన్నల గోస గట్టెక్కేదెన్నడో.. ఈ యూరియా తిప్పలు తప్పేడెప్పుడో!? పాలకుల దయ.. పాలితుల ప్రాప్తం!