రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పని చేస్తోందా?

– రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పని చేస్తోందా? లేదా? అనే అనుమానం కలుగుతోంది
– టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు

రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పని చేస్తోందా? లేదా? అనే అనుమానం కలుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంనందలి ఎన్టీఆర్ భవన్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు మీ కోసం…

గతంలో ఆరోగ్య శ్రీ లో పొందిన సేవలన్నింటిని ఆపేశారు. సిఎం రిలీఫ్ ఫండ్ లేకుండా చేశారు. నేడు ప్రభుత్వం ఆరోగ్యపరంగా సహాయం చేయడంలో వెనుకబడింది. పంచాయితీ, మున్సిపాలిటీలకు 14,15 ఆర్ధిక సంఘం కింద ఇచ్చిన నిధులు రూ. 6,500 కోట్లు ప్రభుత్వం తీసుకోవటం వల్ల ఆయా ప్రాంతాలలో పారిశుధ్య లోపం స్పష్టంగా కనబడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్ళు నిలిచి ఎక్కడి మురుగు నీరు అక్కడే ఉండటంతో దోమలు విపరీతంగా చేరాయి. వర్షాలు వస్తే ఏజెన్సీ ప్రాంతాలలో అపెడమిక్స్ వస్తాయి. వాటిలో ప్రధానంగా మలేరియా, డెంగ్యూ, మరికొన్ని రకాల జ్వరాలు ఎక్కువగా ప్రబలుతుంటాయి. ముందస్తు చర్యల్లో భాగంగా వైద్యశాఖని అప్రమత్తం చేయటం, కావాల్సిన మందులను అందుబాటులో ఉంచటం చేయాలి.

గతంలో ఏజెన్సీ ప్రాంతాలలో తెలుగుదేశం ప్రభుత్వం దోమ తెరలను పంపిణీ చేసింది. నేడు విశాఖపట్నం నుంచి చిత్తూరు వరకు విపరీతంగా డెంగ్యూ వ్యాధి ప్రబలుతోంది. దాదాపు 6వేల డెంగ్యూ కేసులకు చికిత్స చేసినట్టు తెలుస్తోంది. వైద్య శాఖ తన లెక్కల్లో సుమారు 2,100 కేసులు మాత్రమే ఆసుపత్రిలో నమోదు అయినట్టు చెబుతున్నారు. డెంగ్యూ ని గుర్తించడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయాల్సిన పరీక్షలను నేడు చేయడం లేదు. సాధారణ వైరల్ జ్వరం అని చెప్పి డెంగ్యూ ఉందో లేదో నిర్ధారించడం లేదు. అనేకమంది దగ్గరలోని ఆర్.ఎంపీ, ఎం.బి.బి.యస్ డాక్టర్ల దగ్గర చికిత్స చేయించుకుంటున్నారు. ప్రభుత్వ శాఖలలో నమోదు కాని కేసులు చాలానే ఉన్నాయి.

గతంలో చంద్రబాబు నాయుడు సెప్టెంబర్, 2015లో ఏలూరులో దోమలను నిర్మూలించండి-ఆరోగ్యాన్ని కాపాడుకొండి, దోమలపై ప్రజలు దండ యాత్ర చేయాలని ప్రజలను జాగృతి పరచడానికి ఊరిగింపు కార్యక్రమం నిర్వహించారు. దీనిపై ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, కొంత మంది వైసీపీ నాయకులు హేళనగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పని లేక దోమల పై దండయాత్ర చేస్తున్నారన్నారు. ఫ్లెక్సీల ఖర్చు కూడ ప్రభుత్వానికి దండగ అని మాట్లాడారు. నేడు రాష్ట్రంలో డెంగు కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. కృష్ణా జిల్లాలో డయేరియాతో దాదాపు 6మంది చనిపోయారు. ముఖ్యమంత్రి కార్యక్రమంలో ఆశీర్వాదం తీసుకున్న ఓ అమ్మాయి డెంగ్యూతో చనిపోయింది. ముఖ్యమంత్రి ఆశీర్వాద ఫలమా, లేక పరిపాలన వైఫల్యమా అనేది తెలుసుకోవాలి.

టీడీపీ హయాంలో ఏజెన్సీ ప్రాంతాల్లో దోమతెరలు పంపిణీ చేశాం. మలేరియా ట్యాబ్లెట్లను సప్లై చేశాం. టాయిలెట్ గొట్టాలపై వలలు కట్టించాం, ఓవర్ హెడ్ ట్యాంకులకు మూతలు పెట్టించాం, చెత్తను విభజించడం, మురికి కాలువలను శుభ్రం చేయించడం జరిగింది. దోమలను అరికట్టడానికి కొన్ని రకాల కెమికల్స్ ని, బ్లీచింగ్ ని చల్లుతున్నారు. కరోనా సమయంలో బ్లీచింగ్ కి బదులు సున్నపు పొడిని చల్లించిన అవినీతి నాయకులను ప్రజలు గమనిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడును అవహేళన చేసి మాట్లాడారు నేడు వాళ్లే మదనపడుతున్నారు.

వర్షాలు, వరదలు వచ్చినప్పుడు సహజంగా నీళ్ళు నిలిచిపోతాయి. ఆ నీళ్ళు ఇంకిపోయి నేల ఎండి పోవడానికి కనీసం రెండు, మూడు నెలలు పడుతుంది. ఆ నీళ్ళల్లో దోమలు ఆవాసాలు ఏర్పరచుకుంటాయి. గోదావరి జిల్లాలో వరదలు వస్తే ముఖ్యమంత్రి తూతూమంత్రంగా పర్యటించారు. ప్రజల ఇబ్బందుల గురించి పూర్తి స్ధాయిలో తెలుసుకోలేదు. సహాయక చర్యలు చేపట్టలేదు. రోడ్లు ఊడ్చే వాళ్లకు జీతాలివ్వడానికి నిధులు లేవు. నేషనల్ మలేరియా ఎరాడికేషన్ పోగ్రాం కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధులు ఇస్తుంది. దాన్ని తెచ్చుకొని పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇందులో కొంత భాగం ఆశ వర్కర్ల పాత్ర కూడ ఉంటుంది. ఆ పని చేయించుకోవడం ప్రభుత్వానికి చేత కావడం లేదు. రాష్ట్రంలో డెంగ్యూ వంటి విష జ్వరాలతో ఎంత మంది చనిపోయారనే లెక్కలు ప్రభుత్వం దగ్గర లేవు. తాడేపల్లి ఖజానాను నింపుకోవడం తప్ప ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం లేదు.

వాళ్ళు ఇచ్చే నవరత్నాలతోనే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు సుఖంగా ఉంటారనే గుడ్డి సిద్ధాంతాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు చాల చోట్ల డబ్బు వద్దు ఆరోగ్యం, అభివృద్ధి కావాలని తిరుగుబాటు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ని పడకెక్కించారు. ఆరోగ్యశ్రీకి అర్హత ఉంటే సిఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం లేదు.

చంద్రబాబు నాయుడు హయాంలో ఐదేళ్ళలో రూ.1,530కోట్లు సిఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చారు. ఆరోగ్యశ్రీ కి గతంలో, ప్రస్తుతం ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పాలి. నేడు ఏ ఆసుపత్రిలోను ఆరోగ్యశ్రీ అమలు చేయడంలేదు. ప్రభుత్వం నిధులను ఇవ్వడం లేదు. ఒకప్పడు ఆరోగ్యశ్రీలో భాగస్వామ్యం కోసం రాజకీయ ఒత్తిడులు కూడ తెచ్చారు. ప్రజలకు ఇచ్చే కొన్ని పథకాలను తప్పుడు కారణాలు చెప్పి తీసేశారు.

ప్రత్యేక ఖాతా తీసుకుంటేనే తప్ప 14,15 సబ్ ప్లాన్ నిధులను ఇవ్వము అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వానికి డిఓ లేఖ ఇవ్వడం జరిగింది. అందులో కేంద్ర ప్రభుత్వానికి మీరు కట్టాల్సిన డబ్బులను ఇంత వరకు ఎందుకు కట్టలేదని ప్రశ్నించింది. తీసుకున్న స్కీంలను ఏ రకంగా అమలు చేశారని అడిగారు. ప్రజలకు సంబంధించి అనేక పథకాలలో 60 నుంచి 70శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. దాన్ని అమలు చేసుకొనే విధానంలో ప్రభుత్వం విఫలమైంది. నవరత్నాల గురించి తప్ప మరో సంక్షేమ పథకం గురించి మాట్లాడటంలేదు. అధికారులు కూడ ప్రస్తావించడం లేదు. ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రకృతి విపత్కర పరిస్థితులలో కేంద్రం కూడ జోక్యం చేసుకోవాలి.

మంగళగిరిలో 2,200 కోట్లు పెట్టి ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మించారు. పూర్తి స్ధాయిలో నడపడానికి నీళ్ల అవసరం ఉంది. రాష్ట్రం నీళ్లు ఇవ్వలేదని చెబితే జూలైలో జీవో ఇచ్చినా ఇంత వరకు పనులు ప్రారంభం కాలేదు. విజయవాడలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించలేకపోయారు. అటువంటిది 15 మెడికల్ కాలేజీలు కడతామని చెబుతున్నారు. ఎలా కడతారు? చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండటం లేదు. యుద్ధ ప్రాతిపదికన దోమల నిర్మూలనకు చర్యలు తీసుకోకపోతే అనేక మంది విష జ్వారాల బారిన పడి చనిపోయే పరిస్థితి ఉంది. గిరిజన ప్రాంతాల్లో దోమ తెరలు పంపిణి చేయాలి. నిధులున్న మున్సిపాలిటీలు ఫాగ్ ని చేస్తున్నాయి తప్ప మిగతా ఎక్కడా ఫాగింగ్ జరగడం లేదు. వైసీపీ ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ విధానంలో పూర్తిగా విఫలమైంది.

పోర్చుగల్ లో గర్భిణికి చికిత్స చేయడానికి పడక లేకపోవడంతో వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోవడం జరిగింది. దానికి మనస్థాపం చెందిన ఆరోగ్యశాఖ మహిళా మంత్రి రాజీనామా చేశారు. రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితులు రావాలి.

కృష్ణా జిల్లాలో డయేరియాతో చిన్న పిల్లలు చనిపోయారు. సిఎం ఆశీర్వదించిన సంజన అనే అమ్మాయి డెంగ్యూతో చనిపోయింది. గిరిజన ప్రాంతాల్లో చనిపోయిన వారి లెక్కలు ప్రభుత్వం దగ్గర లేవు. ఆరోగ్యశాఖ లెక్కలు మరో రకంగా ఉన్నాయి. వీటన్నింటి గురించి ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్రజల ప్రాణాలను కాపాడి తర్వాత సంక్షేమం గురించి మాట్లాడాలని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తెలిపారు.

Leave a Reply