Suryaa.co.in

Andhra Pradesh

అసలు ప్రభుత్వం ఉందా? ప్రాణాలు పోతున్నా స్పందించరా?

– జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం స్పందించాలి
-15 మంది చనిపోతే కూడా ప్రభుత్వం కదలడం లేదు
– నంద్యాలలో విద్యార్థుల అస్వస్థతకు కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలి
-టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

అమరావతి: రాష్ట్రంలో తీవ్రమైన ఘటనల జరిగిన సమయంలో కూడా ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలు, నంద్యాలలో విద్యార్థులకు అస్వస్థతపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణంలోని వివిధ వార్డులలో గత మూడు రోజుల్లో 15 మంది మృతి చెందారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరడం గంటల వ్యవధిలో మృతి చెందడం జరిగింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి హఠాత్తుగా మృతి చెందుతుండటంతో పట్టణ వాసులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చెయ్యాలి. 15 మంది మృతికి కారణాలు ఏంటనేది స్పష్టం చేసి స్థానికంగా ఉన్న భయాందోళనలను పోగొట్టాలి.

పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం వేగంగా స్పందించడం లేదు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోంది. ఈ విషయంలో వెంటనే ప్రజలకు వాస్తవాలు వివరించాలి. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి.

నాణ్యత లేని ఆహారంతోనే అస్వస్థత:
ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం, ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అసుపత్రుల పాలవుతున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. కొద్ది రోజుల క్రితమే కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో విద్యార్థులు నాణ్యత లేని ఆహారం తీసుకోవడం వల్ల ఆసుపత్రి పాలయ్యారని గుర్తుచేశారు.

ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు కర్నూలు జిల్లా నంద్యాలలో మరో ఘటన జరిగింది. నంద్యాల పట్టణ పరిధిలోని విశ్వనగర్ కాలనీలో ప్రభుత్వ ఎలిమెంట్రీ పాఠశాల లో మధ్యాహ్నం భోజనం వికటించి 42 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురి అయ్యారు. కుళ్లిన కోడిగుడ్లు పెట్టడం వల్లనే విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని చంద్రబాబు అన్నారు.

ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉదాసీనత కారణంగా ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు.

LEAVE A RESPONSE