రాజ్యసభలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రికి విజయసాయి రెడ్డి ప్రశ్న
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: తూర్పు కనుమల్లో కోతకు గురవుతున్న అటవీ భూములపై మదింపు చేయడానికి జియో సైంటిఫిక్ మాపింగ్ జరిపించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అంటూ వైఎస్సార్సిపి సభ్యులు వి.విజయసాయి రెడ్డి గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడవులు, పర్యావరణ పరిరక్షణ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్‌ను ప్రశ్నించారు.
అటవీ భూములు కోతకు గురి కాకుండా పరిరక్షించేందుకు అటవీ శాఖ చేపడుతున్న చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వడంలేదు. అటవీ భూములు ఏమేరకు కోతకు గురవుతున్నాయో మదింపు చేసే యంత్రాంగం, ప్రణాళిక అటవీ శాఖ వద్ద లేనందున భూములు కోతకు గురి కాకుండా నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో తెలపాలని విజయసాయి రెడ్డి కోరారు.
దీనికి మంత్రి మౌఖికంగా జవాబిస్తూ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతి రెండేళ్ళకు ఒకసారి దేశంలోని అడవుల విస్తీర్ణత, అటవీ భూముల కోతపై ఫారెస్ట్ సర్వే నిర్వహిస్తూ నివేదికలను ఎప్పటికప్పుడు ప్రచురిస్తోందని అన్నారు. కాబట్టి కొత్తగా అటవీ భూముల కోతపై సర్వేలు నిర్వహించాల్సిన అవసరం లేదని అన్నారు.