ఒక బీసీ మహిళను గౌరవించే విధానం ఇదేనా?

Spread the love

సంక్షేమ కార్యక్రమాలకు గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే, జగన్మోహన్ రెడ్డి సర్కార్ అదనంగా ఖర్చు చేసిందేమీ లేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. గత మూడేళ్లలో 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం … సంక్షేమ పథకాల అమలు కోసం చేస్తున్న ఖర్చు, గత ప్రభుత్వ హయాంలో చేసిన ఖర్చును ఆయన పోల్చి విశ్లేషించారు. వైఎస్సార్ రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 3840 కోట్ల రూపాయలు కేటాయించిందని పేర్కొన్నారు. గతంలో ఎవరి పేరు పెట్టకుండా అన్నదాత సుఖీభవ పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారన్నారు. జగనన్న విద్యా దీవెన పథకానికి 500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని రఘురామ కృష్ణంరాజు వివరించారు.

గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ కింద నేరుగా కాలేజీల యాజమాన్యాలకే ప్రభుత్వం డబ్బు చెల్లించే దని, 500 కోట్లు చెల్లించడంలో ఆలస్యమైనా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇచ్చేవన్నారు. కానీ ప్రస్తుతం నేరుగా తల్లిదండ్రులకు ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను జమ చేస్తుండడంతో , కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయన్నారు. జగనన్న విద్య వసతి ఈ పథకానికి 2,223 కోట్ల రూపాయలను కేటాయించగా, కేవలం 1.88 వేలకోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. నాలుగు విడత లకుగాను, రెండు విడత లను హాంఫట్ చేశారని ఎద్దేవా చేశారు. వసతి దీవెన పూర్తి చెల్లింపులు చేయాలని కాలేజీ యాజమాన్యాలు పట్టుబడుతున్నాయని అని చెప్పారు. వై ఎస్ ఆర్ , పిఎం ఫసల్ బీమా యోజన అనే పథకం, ఇది పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి పేరు మార్పని ఎద్దేవా చేశారు. ఈ పథకం ద్వారా కొత్తగా 247 కోట్ల రూపాయలు ఇచ్చారని అనుకుందామని వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాపు నేస్తం పథకం… ఈ పథకానికి 500 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించారని పేర్కొన్న రఘురామ, గతంలో ఈ పథకం ద్వారా కాపు విద్యార్థులకు ఎంతో మేలు జరిగిందని, ఈ పథకానికి నిధుల కోత విధించారన్నారు. వాహన మిత్ర పథకానికి కొత్తగా విధులు కేటాయించినప్పటికీ, రోడ్డు సక్రమంగా లేకపోవడంతో వారికి అదనపు ఖర్చు తప్పడం లేదన్నారు.

మత్స్యకార భరోసా 120 కోట్లనీ, గతంలోనూ అంతే ఉన్నదని, కొత్తగా ఇచ్చింది ఏమీ లేదన్నారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీకి గత ప్రభుత్వంలో 40, 50 కోట్లు ఖర్చు చేయగా, ప్రస్తుతం అంతే చేస్తున్నారని, అయితే బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ఈ మొత్తాన్ని అందజేస్తున్నారన్నారు. జగనన్న లా నేస్తం ద్వారా 16 కోట్లు కొత్తగా ఇచ్చారని చెప్పుకొచ్చారు. వైయస్సార్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయడానికి ప్రతియేటా ఆరు వేల 400 కోట్ల రూపాయలు చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించిందని, నాలుగేళ్లలో 25 వేల 500 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని అన్నారు. అయితే రెండేళ్లపాటు 6,400 చొప్పున ఇచ్చారన్నారు. ఈ పథకం , అప్పు చేసిన వారికి ఉపయోగపడుతుందని, జాగ్రత్తగా, పొదుపుగా ఉండే వారికి ఈ పథకం వల్ల ప్రయోజనం శూన్యమని అన్నారు. గత ప్రభుత్వం డాక్రా మహిళల కోసం 22 వేల కోట్ల రూపాయల సహాయం చేసిందని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు.. ఒక ప్రభుత్వం చెప్పుకోలేదు కానీ, డ్వాక్రా మహిళలకురెండు విడతలుగా 22 వేల కోట్లు చెల్లించార ని , అప్పు చేసిన మహిళలకు, అప్పు చేయని వారికి కూడా చెల్లించార ని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కంటే, మా ప్రభుత్వం అదనంగా చెల్లించింది, అప్పు చేసిన వారి కోసం రెండు వేల కోట్లు అని ఆయన అన్నారు. ఒకవేళ రేపు ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడితే, ఎంతవరకు చెల్లిస్తారన్నది ప్రశ్నార్ధకమేనని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

వైయస్సార్ చేయూత పథకం గురించి మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో ఒకోక్క బీసీ , ఎస్సీ కార్పొరేషన్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి చేతి పనిముట్లను అందించే వారిని గుర్తు చేశారు. ప్రతి ఏడాది నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించేవారన్న ఆయన, ఇప్పుడు మా పథకాలన్నీ ఎత్తివేసి మహిళా చేయూత అంటూ 45 ఏళ్లు నిండిన వారికి పనిముట్లు ఇవ్వకుండా, వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించకుండా, ఏడాదికి 16 నుంచి 18 వేలు ఇస్తామని చెప్పారన్నారు. దీని వల్ల ప్రయోజనం ఏమిటి అన్నది తర్వాత చర్చిద్దామని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అమ్మ ఒడి అనే పథకాన్ని కొత్తగా పెట్టారని, తొలుత ఇద్దరు పిల్లలు ఉన్న వారికి సహాయం చేస్తామని చెప్పారని పేర్కొన్నారు. ఆ తర్వాత మాట మార్చి కేవలం ఒక పిల్లవాడు ఉన్నవారికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు చెప్పుకొచ్చారని గుర్తు చేశారు. ఈ పథకం కింద 6,500 కోట్ల రూపాయలను సక్సెస్ ఫుల్ గా ఎగ్గొట్ట గలిగారని విమర్శించారు.

రాష్ట్రంలో రెండు లక్షల మంది విద్యార్థులను అమ్మ ఒడి పథకం ఎగ్గొట్ట డానికి ఫెయిల్ చేశారని ఆరోపించారు.. సంక్షేమ పథకాల కోసం ఏడాదికి ఎనిమిది వేల 700 కోట్లు ఖర్చు చేశారని, గత మూడేళ్లుగా 18 వేల కోట్లు ఖర్చు చేశారని అనుకుంటే, పాత అప్పులతో కలుపుకొని టిడిపి ప్రభుత్వ హయాంలో మూడు లక్షల కోట్ల అప్పులు చేయగా, ఈ మూడేళ్లలోనే మా ప్రభుత్వం ఐదులక్షల కోట్ల అప్పు చేసి, 8 లక్షల కోట్ల రూపాయలకు అప్పుల ను చేర్చిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. అప్పు చేసిన మొత్తం డబ్బు ఏమైందని సి ఏ జి వాళ్లు అడిగినా కూడా వివరాలు చెప్పడం లేదన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ చేయడం వెనుక మద్యం ఆదాయం పెంచుకోవడానిలేనని స్పష్టమవుతోందన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ, పర్సనల్ ఆదాయాన్ని పెంచుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడీ ఆడుతున్న వికృత క్రీడ ఇది అని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం 35 వేల కోట్ల రూపాయల మద్యం ఆదాయాన్ని పొందుతూ, ఎన్ని మార్లు కోట్లు చెప్పినా కూడా డిజిటల్ కరెన్సీ ని ప్రవేశపెట్టడం లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఐ ఏ ఎస్ చదవడానికి ఎవరైనా ముందుకు వస్తే వారికి అకాడమిక్ ఖర్చుల నిమిత్తం లక్షన్నర రూపాయలు ప్రభుత్వం సహాయం చేసేదని, ప్రస్తుతం అటువంటి సహాయ మేది అందజేయడం లేదన్నారు. గతంలో పేదింటి ఆడపిల్లలు పెళ్లిళ్లకు సహాయం చేసే వారిని, మా ప్రభుత్వం లో పేర్లు పెట్టడం తప్ప సహాయం చేసింది లేదన్నారు. పీజీ విద్యార్థులు చదువు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 60 శాతం నిధులను కూడా, అమ్మ ఒడి పథకం అమలు ద్వారా రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని అని విమర్శించారు. ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఎస్సీ ఎస్టీ బిసి, మైనారిటీల ఆశయాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూకటివేళ్లతో పెకలించిందని రఘురామకృష్ణంరాజు విరుచుకుపడ్డారు.

ఒక బీసీ మహిళను గౌరవించే విధానం ఇదేనా?
బీసీ నాయకుడిగా తన తరంలో సర్దార్ గౌతు లచ్చన్న ను మించిన మహా నాయకుడు ఎవరు లేరని, ఆయన మనవరాలు గౌతు శిరీష ను ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసిందన్న కారణంగా కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందనీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఒక మహిళ అని చూడకుండా ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు కు పిలిపించడం హాస్యాస్పదంగా ఉందని విరుచుకుపడ్డారు. విశాఖలో లో సి ఐ డి కార్యాలయం లేదా అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. విశాఖ కార్యాలయంలో ఒక సి ఐ, డి.ఎస్.పి విచారిస్తే సరిపోయే దానికి, గుంటూరు కేంద్ర కార్యాలయం కు పిలిపిం చాల్సిన అవసరం ఏమొచ్చిందని అని నిలదీశారు. తన పై ఏమి కేసు నమోదు చేశారో తెలియనివ్వకుండా, ఎఫ్ ఐ ఆర్ కాఫీ కూడా అందజేయ కుండ విచారించడం ఏమిటో అర్థం కాలేదన్నారు. ఒక కేసు విచారణ లో భాగంగా సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతంలోనే విచారించాలన్న ఆయన , రేపు కోర్టును ఆశ్రయించి, న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని, ఆ విచారణ ప్రక్రియను మొత్తం వీడియో రికార్డింగ్ చేయాలనీ కోరాలని అన్నారు. అయినా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే కేసు నమోదు చేయడం ఏమిటని, సిబిసిఐడి వాళ్లే ఫేక్ రిపోర్టులు తయారు చేసి, ఎవరైతే ఫార్వర్డ్ చేస్తారో వారిపై కేసులు నమోదు చేస్తున్నారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. జడ్జీలను చంపుతా మన వాళ్ళను తమ పార్టీ కార్యదర్శులు వెనకేసుకు రాగా, కేవలం ఒక మెసేజ్ ను ఫార్వర్డ్ చేసిన పాపానికి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం ఒక మహిళా నాయకురాలు పిలిపించుకుని విచారించడం సిగ్గుచేటన్నారు. ఇక అనంతపురం జిల్లా హిందూపూర్ లో రెండు రూపాయలకే పట్టెడు అన్నం పెడుతున్న వారిపై కేసు నమోదు చేయడం తమ ప్రభుత్వం వికృత చర్యలకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. కేసు నమోదు చేసిన ఇస్మాయిల్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నం తినే ప్రతి వారు ఈ చర్యలను ఖండించాలని కోరారు.

10 ఉత్తీర్ణత శాతం తగ్గడం ఎవరి తప్పు
పదవ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత శాతం తగ్గడం ఎవరి తప్పని, దీనికి ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి బాధ్యత వహిస్తారు అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. మున్సిపల్ పాఠశాలల ఆటస్థలాలు అమ్ముకోవడానికి, పాఠశాలల విలీన ప్రక్రియ కు శ్రీకారం చుట్టారన్న ఆయన, సరిపోను ఉపాధ్యాయ సిబ్బంది లేకుండానే ఇంగ్లీష్ మీడియం బోధన ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఇంగ్లీష్ మీడియం బోధన లేనట్టు, జగన్మోహన్ రెడ్డి హయాంలోని ప్రారంభమైనట్లు గా ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో 94 శాతంగా ఉన్న పదవ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు నేడు పథకం కారణంగా 65 శాతానికి చేరిందని, ఉత్తీర్ణతా శాతం పడగొట్టడం ఒక్క జగన్మోహన్ రెడ్డి కే సాధ్యమని ఎద్దేవా చేశారు.

హవ్వ ఒకపక్క ప్రకృతి విధ్వంసం… మరొక పక్క ప్రకృతి పై ప్రేమా? ఇదెక్కడి చోద్యం…
ఒక పక్క రుషికొండ విధ్వంసం చేస్తూనే, మరొక పక్క జగనన్న హరిత నగరాల పథకం ప్రవేశ పెట్టడం హాస్యాస్పదంగా ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రిషికొండ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఈ సందర్భంగా ఆయన చదివి వినిపించారు. గతంలో నిర్మాణాలు ఉన్నచోట, మైదాన ప్రాంతంలోని నిర్మాణాలను చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే సుప్రీం కోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణం రాజు కు, కేసు వేయించిన చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగిలిందని సాక్షి దినపత్రికలో రాశారని, ఇప్పుడు తీర్పు కాపీ చూసిన తరువాత అయినా తమ కథనాలను మార్చుకుంటారే మో చూద్దామన్నారు. రిషికొండ ను సందర్శించడానికి వెళ్ళిన స్థానిక ప్రకృతి ప్రేమికుడు సత్యనారాయణ మూర్తి ని అడ్డుకోవడం పరిశీలిస్తే, రిషికొండ పై ప్రకృతి విధ్వంసం ఈ మేరకు జరిగిందో ఇట్టే అర్థమవుతుంది అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, నమ్ముకున్న అధికారికి పోస్టింగ్
రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి , తనను నమ్ముకున్న అధికారికి యధాస్థానంలో పోస్టింగ్ ఇప్పించడంలో ముఖ్యమంత్రి సక్సెస్ అయ్యారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రధానమంత్రి తో భేటీ సందర్భంగా, ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరకుండా, తనను నమ్ముకున్న అధికారి పదవీకాలం మరికొంత కాలం పొడగించాలని కోరడం చూస్తే ఆయన ఉదార స్వభావాన్ని చూసి తనకు అభినందించాలని అనిపిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే తనకు తనని నమ్ముకున్న వారికి న్యాయం చేయడమే ముఖ్యం అనిపించినట్లు గా కనిపిస్తోందన్నారు.

Leave a Reply