-
మార్కెటింగ్ మేనేజర్ గా మారుతున్న దేవదేవుడు
-
రియల్ ఎస్టేట్ వెంచర్లలో టీటీడీ దేవాలయమా? హవ్వ!
-
వెంకటేశ్వరుడు రియల్ ఎస్టేట్ అంబాసిడరా?
-
చెన్నైలో వెంకన్న ఆలయం కోసం చక్రం తిప్పుతున్న ఓ రియల్టర్
-
ఆ కంపెనీకి తిరుమలలో ఇప్పటికే ఒక ప్రైవేట్ గెస్ట్‌హౌస్
-
తమ వెంచర్ మధ్యలో టీటీడీ గుడి నిర్మించాలట
-
ఆ కంపెనీని అనుమతిస్తే తామరతంపరగా మరిన్ని కంపెనీలు
-
సర్కారుపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు
-
సీఎం చంద్రబాబును తప్పు దోవపట్టిస్తున్న అధికారులు
-
వైఎస్ హయాంలో ముంబయిలో ఇలాగే డిఎఫ్‌ఎల్ ప్రతిపాదన
-
రాబర్ట్‌వధేరా చెప్పినా తిప్పికొట్టిన నాటి టీటీడీ పాలకమండలి
-
మహారాష్ట్ర సర్కారు ఇచ్చిన షిప్పింగ్ కార్పొరేషన్ భూమిలోనే దేవాలయ నిర్మాణం
-
ఇప్పటికే చెన్నైలో టీటీడీకి జయలలిత ఇచ్చిన ఆరెకరాల భూమి
-
టీ నగర్‌లో మరో రెండెకరాల్లో ఆలయం
-
మళ్లీ అక్కడే ఇంకో ఆలయం అవసరమా?
-
చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు జీ స్వ్కేర్ ప్రతిపాదన
-
విబేధిస్తున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు?
-
కూటమి సర్కారుకు అప్రతిష్ఠ ఖాయమంటున్న భక్తులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
వ్యాపార ప్రచారానికి కాదేదీ అనర్హం. దేవుళ్లు సైతం అన్నది.. అప్పట్లో ‘భగవంతుడికి భక్తుడి అనుసంధానమైనది అంబికా దర్బార్ అగరబత్తి’ అన్న మీడియా ప్రమోషన్‌తోనే మొదలయింది. అది తర్వాత కొత్త పుంతలు తొక్కి, నేరుగా భగవంతుడినే బిజినెస్ అంబాసిడర్‌గా మార్చే మాయదారి కాలం వచ్చేసింది. ఇందులో నిర్మాత రియల్టర్లయితే, దర్శక పాత్ర పాలకులది. నటుడు మాత్రం భగవంతుడే. టికెట్ కొనేది ఎప్పటికీ ప్రేక్షకుడే. ఇదీ ఇప్పటి నయా ఆధ్మాతిక దందా.
భారీ వెంచరు వేసే రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఈమధ్య కాలంలో చావు తెలివి తేటలు ప్రదర్శిస్తున్నాయి. వందో, రెండు వందల ఎకరాలో కారుచౌకగా కొనడం.. దాని మధ్యలో వెంకటేశ్వరుడి ఆలయమో, షిర్డిసాయి దే వాలయమో కట్టడం ఒక టెక్నిక్కుగా మారింది. ఆ దేవాలయానికి సమపంలోనే ఒక వృద్ధాశ్రమం, మరో ప్రకృతి ఆశ్రమం నిర్మించడటం అదనపు ఆకర్షణ.
ఇక అక్కడి నుంచే అసలు దందా మొదలవుతుంది. ఆ వెంచర్‌లోనే భారీ విల్లాలు, హోటళ్లు, ఆయుర్వేద వైద్యశాలలు వంటివి వెలుస్తాయి. వీటన్నింటిని అందమైన బ్రోచర్లలో ఆకర్షణీయమైన రంగులతో మార్కెట్‌లోకి వదులుతారు. మామూలుగా అయితే.. పట్టణం, నగరానికి 10, 15 కిలోమీటర్లు దూరం ఉండే ఇలాంటి ప్రాంతానికి, అంత ఓపిక చేసుకుని ఎవరూ వెళ్లరు. అన్ని లక్షలు వెచ్చించి కొనుగోలు చేయరు. కానీ అక్కడ అతి పెద్ద ఆలయం ఉండటం అనేది, కొనుగోలు దారులకు వల వేసే అతిపెద్ద మార్కెట్ జిమ్మిక్కు.
అక్కడ భూమి కొనుగోలు చేస్తే, తక్కువకాలంలోనే వాటి ధరలకు రెక్కలొస్తాయన్న ఆశ దానికి కారణం. ఎందుకంటే దేవాలయానికి వచ్చే వేలామిమంది భక్తులతో, అక్కడ వ్యాపార సంస్థలు వెలుస్తాయి. ఫలితంగా సహజంగానే ఆ ప్రాంతంలో భూమి విలువ పెరుగుతుంది. పక్కనే విల్లాలు, హోటళ్లు కూడా ఉండటం వల్ల.. సహజంగా భూమి విలువ తక్కువ కాలంలోనే పెరిగి, తమ పెట్టుబడి పదింతలవుతుంది. ఇదీ సగటు ప్రజల ఆలోచనా విధానం. అదే రియల్టర్లకు పెట్టుబడి.
ఈ ఆశ, ఆలోచనే రియల్ ఎస్టేట్ కంపెనీల వ్యాపారానికి శ్రీరామరక్ష . అంటే వెంకటేశ్వరస్వామి, షిర్డిసాయి దేవాలయాలు నిర్మిస్తేనే వ్యాపారం ఇంత దివ్యంగా ఉంటే.. ఇక ఏకంగా టీటీడీనే అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మిస్తే వ్యాపారం ఇంకెంత దివ్యంగా ఉంటుంది? ఇప్పుడు రాజకీయ పలుకుబడి ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ యజమానులు ఈ మార్గేన్నే ఎంచుకుంటున్నారు. టీటీడీపై ఒత్తిడి చేసి తమ వెంచర్లలో వెంకన్న గుడి నిర్మించుకోవడటం, దానిని చూపించి భూమిని ఎక్కువ ధరకు అమ్ముకోవడం అనే మహాద్భుత ఆలోచన ఇప్పుడు దేవుడిని మార్కెటింగ్ మేనేజర్‌గా మార్చేసేందుకు కారణమవుతోంది.
అది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం. ముంబయి శివారు ప్రాంతంలో డిఎల్‌ఎఫ్ అనే కంపెనీకి, వేల ఎకరాల భూములున్నాయి. దేశంలోని అతి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటయిన ఈ మోతుబరి కంపెనీకి,.. అప్పటి యుపీఏ సర్కారు చైర్‌పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వధేరా సన్నిహితుడు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ ఈ కంపెనీకి భూములుండటం విశేషం. తర్వాత దానిపై పెద్ద దుమారం కూడా రేగిన విషయం తెలిసిందే.
అలాంటి డిఎల్‌ఎఫ్ కంపెనీకి, ముంబయిలో ఉన్న తమ రియల్ ఎస్టేట్ వెంచర్ మధ్యలో.. టీటీడీ ఆలయం నిర్మించాలన్న కోరిక పుట్టింది. ఆ భూముల మధ్యలో టీటీడీ ఆలయం ఉంటే.. తమ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలవుతుందన్నది సదరు కంపెనీ అసలు వ్యాపార వ్యూహం. దానితో వైఎస్ ద్వారా ప్రతిపాదనలు పంపటం, దానిని ఆయన టీటీడీ పాలవర్గానికి పంపించడం చకచకా జరిగిపోయింది.
సీఎం నుంచి టీటీడీకే ప్రతిపాదన వచ్చింది కాబట్టి, ఇక పాలకవర్గం ఆమోదమే తరువాయని, భక్తకోటితో పాటు డీఎల్‌ఎఫ్ కంపెనీ కూడా ఆశించింది. స్వయంగా సోనియమ్మ ముద్దుల అల్లుడు రాబర్ట్ వధేరా, సీఎం వైఎస్ చెప్పిన తర్వాత.. ఇక కానిది ఏముందన్నది వారి ధీమాకు అసలు కారణం. అయితే బోర్డులో కథ అడ్డం తిరిగింది.
ముంబయి శివారు ప్రాంతంలో డీఎల్ ఎఫ్ కంపెనీకి చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్ల మధ్యలో.. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం ససేమిరా కుదరదని, బోర్డులో సభ్యుడయిన డాక్టర్ ఓ.వి.రమణ మొండికేశారు. అసలు మహారాష్ట్ర ప్రభుత్వమే షిప్పింగ్ యార్డుకు చెందిన 5 ఎకరాల భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు, ప్రైవేటు వ్యక్తుల భూముల్లో గుడి నిర్మించడం ఎందుకని అడ్డం తిరిగారు.
టీటీడీ అక్కడ గుడి నిర్మిస్తే డీఎల్‌ఎఫ్ కంపెనీ భూముల రేట్లు పెరిగేందుకు ఉపయోగపడుతుందని, ఇది దేవుడిని మార్కెట్ చేసుకునేందుకు, బోర్డు అంగీకరించడమే అవుతుందని రమణ వాదించారు. దానిని మిగిలిన సభ్యులు కూడా బలపరచడంతో.. డీఎల్‌ఎఫ్ వెంచర్ల మధ్యలో టీటీడీ ఆలయం నిర్మించాలన్న ప్రతిపాదనకు, పురిట్లోనే ఫుల్‌స్టాప్ పడింది. అప్పట్లో దానిని అడ్డుకున్న డాక్టర్ ఓవి రమణ.. మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జనతాదళ్‌కు జాతీయ కోశాధికారిగా ఉన్నారు.
సీన్‌కట్ చేస్తే.. చెన్నై శివారు ప్రాంతాల్లోని జీ స్వ్కేర్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి తమ భూముల్లో టీటీడీ ఆలయం నిర్మించుకోవాలన్న చిన్న ముచ్చట వేసింది. కోరిక నెరవేర్చుకునేందుకు ఆగమేఘాలపై రంగంలోకి దిగిన సదరు కంపెనీ పెద్దలు.. ఏపీలోని అధికారులను కలసి, తమ మనసులో మాట బయటపెట్టారు. అక్కడ టీటీడీ దేవాలయం నిర్మిస్తే బాగుంటుందని, అందుకయ్యే ఖర్చులన్నీ తామే భరిస్తామని.. ఆలయ నిర్మాణం తర్వాత దాని నిర్వహణ భాధ్యతను టీ టీడీకే అప్పగిస్తామని ప్రతిపాదించారు.
ఆ ప్రతిపాదనకు మహాముచ్చట పడ్డ అధికారులు, తమదైన శైలిలో పావులు కదిపారు. ఫలానా కంపెనీ ఆసామీ తమ భూముల్లో, సొంత ఖర్చుతో ఆలయం నిర్మిస్తామంటున్నారని, దానిని ఆమోదించడం వల్ల ప్రభుత్వానికి నయాపైసా ఖర్చు ఉండకపోగా, టీటీడీకి పెద్ద ఆస్తి-ఆదాయం జమిలిగా కలసి వస్తాయని.. ముఖ్యమంత్రికి ‘ఆర్ధిక-కమ్ ఆధ్మాత్మిక’ కోణంలో వివరించారట.
దానితో ప్రభుత్వంపై ఆర్ధిక భారం లేకపోగా, పక్క రాష్ట్రంలో టీటీడీ ఆలయం నిర్మించినట్టు ఉంటుందన్న ఆలోచనతో, సీఎం దానిని అంగీకరించారట. అయితే ఆలయం గురించి ఇన్ని స్కెచ్‌లు వేసి చూపిన అధికారులు, సదరు కంపెనీ వ్యాపారంతోపాటు.. టీటీడీ ఆలయం నిర్మించడం వల్ల దానికి కలిగే మేళ్లను గురించి మాత్రం ప్రస్తావించలేదట.
సహజంగా అధికారులు సీఎంల వద్దకు ఏమైనా ప్రతిపాదన పెడితే, ముందుగా.. దానివల్ల ప్రభుత్వానికి ఆర్ధిక భారం ఉండదన్న లౌక్యనీతిని ప్రదర్శిస్తారు. పైగా దాని వల్ల ప్రభుత్వానికి, ముఖ్యంగా ఆ ముఖ్యమంత్రులకు వచ్చే మంచి పేరును ముందుపెడుతుంటారు. దానితో ప్రభుత్వంపై ఆర్ధిక భారం ఉండదన్న కోణంలో మాత్రమే ముఖ్యమంత్రులు, అధికారుల ప్రతిపాదనలను అంగీకరిస్తుంటారు. చెన్నై శివార్లలో జీ స్వ్కేర్ నిర్మించతలపెట్టిన, టీటీడీ ఆలయ కథ కూడా ఇదేనన్నది సచివాలయ వర్గాల సమాచారం.
నిజానికి తమిళనాడు రాష్ట్రం చెన్నై రాజధాని నగర శివార్లలో ఈ కంపెనీ భారీ వెంచర్లు, హౌసింగ్ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఈ కంపెనీ చెన్నై, కోయంబత్తూర్, ట్రి చీ, హోసూర్, మైసూర్, బళ్లారిలో హౌసింగ్ వెంచర్లను విజయవంతంగా నిర్మించింది. దీనికి తెలంగాణ లోని హైదరాబాద్, కర్నాటకలో కూడా మంచి మార్కెట్ ఉంది. బిఎన్‌రెడ్డి నగర్, షాద్‌నగర్ వైపు వెంచర్లు వేసింది.
60 ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో 4500 మంది కస్టమర్లను కలిగి ఉన్న ఈ సంస్థకు స్టార్ క్రికెటర్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారంటే, జీ స్క్వేర్ కంపెనీ రియల్ ఎస్టేట్ రంగంలో ఎంత లబ్ధప్రతిష్ఠురాలన్నది అర్ధమవుతూనే ఉంది. ఇప్పటిదాకా ఈ సంస్థపై ఎలాంటి ఆరోపణలు లేవు.
ఇంత పెద్ద కంపెనీ చెన్నై పోరూర్ చిరునామాతో.. తమ భూముల్లో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించుకోవాలన్న కోరిక పుట్టింది. అందులో తప్పులేదు. వందల ఎకరాల భూమి ఉన్నందున, అక్కడ తమకు నచ్చిన దేవుడి ఆలయం నిరభ్యంతరంగా నిర్మించుకోవచ్చు. పైగా దానికి ఎవరి అనుమతులు, లైసెన్సులూ అవసరం లేదు. దేశంలో ఆ లెక్కన వందల సంఖ్యలో ప్రైవేటు వ్యక్తులు షిర్డిసాయిబాబా ఆలయాలతోపాటు, ఇతర దేవుళ్ల ఆలయాలూ నిర్మించారు.
తెలంగాణలోని ముచ్చింతల్‌లో కూడా మహా సిమెంట్ యజమాని, మైహోం కంపెనీ అధిపతి రామేశ్వర్‌రావు కూడా ముచ్చింతల్‌లోని తమ భూముల్లో, సమతామూర్తి రామానుజ విగ్రహం నిర్మించి ఆలయం నిర్మించారు. దానికి దేశంలోని ప్రముఖులను పిలిచారు. రాష్ట్రపతి రామనాధ్ కోవిందు, హోంమంత్రి అమిత్‌షా సహా రాష్ట్ర, జాతీయ స్థాయి వీవీఐపీలంతా హాజరయ్యారు. సహజంగానే దానితో దాని పరిసర ప్రాంతాల్లోని భూముల రేట్లకు రెక్కలొచ్చాయి.
ఇప్పడు చెన్నై శివార్లలో జీ స్వ్కేర్ రియల్టర్స్ కూడా.. ఇదే కోణంలో అక్కడ టీటీడీ ఆలయం నిర్మింపచేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్న వ్యాఖ్యలు భక్తుల్లో వినిపిస్తున్నాయి. నిజంగా ఈ కంపెనీకి వెంకన్న స్వామిపై అంత భక్తి ప్రపత్తులుంటే.. తానే వేరే ప్రాంతంలో ఓ పది ఎకరాలు కొనుగోలు చేసి, దానిని టీటీడీకి విరాళంగా ఇచ్చి తమ ఖర్చులతో ఆలయం నిర్మించాలని కోరవచ్చు కదా? అందుకు భిన్నంగా తమ రియల్ ఎస్టేట్ వెంచర్‌లోనే ఆలయ నిర్మాణం చేయాలని ఎందుకు కోరినట్లు?
దాని వల్ల ఆ వెంచర్‌లోని భూముల ధరలకు డిమాండ్ వచ్చి, కంపెనీకి లాభాలపంట పండిస్తుంది కదా? అంటే స్వామిని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారా? వెంకన్న ఏమైన్నా వ్యాపార వస్తువా? ఆయనేమైనా రియల్ ఎస్టేట్ కంపెనీ మార్కెటింగ్ మేనేజరా?అని విరుచుకుపడుతున్నారు. అన్నట్లు.. ఈ కంపెనీ రెండేళ్ల క్రితం తిరుమలపై గెస్ట్‌హౌస్ నిర్మాణం కోసం, ఒక భూమిని 20 కోట్లతో ఆక్షన్‌లో తీసుకుందట.
ఒకవేళ ఇలాంటి ప్రతిపాదనలు టీటీడీ ఆమోదిస్తే.. భవిష్యత్తులో వివిధ రాష్టాల్లోని అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు, తమ వెంచర్లలో టీటీడీ ఆలయాలు నిర్మించాలని, అందుకు అయ్యే ఖర్చును కూడా తామే భరిస్తామని ప్రతిపాదించే ప్రమాదం లేకపోలేదని భక్తులు హెచ్చరిస్తున్నారు. ఆ రకంగా వెంకన్న స్వామిని వ్యాపార వస్తువుగా మార్చడం ద్వారా, ఆధ్యాత్మిక వ్యాపారం చేసినవారవుతారని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఈ ప్రతిపాదనను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యతిరేకిస్తున్నారని, దేవుడి ని వ్యాపార వస్తువుగా మార్చేందుకు చైర్మన్ అంగీకరించడం లేదన్న చర్చ టీటీడీ వర్గాల్లో జరుగుతోంది.
నిజానికి ఒక ప్రాంతంలో టీటీడీ ఆలయం నిర్మించాలంటే దానికి అనేక నిబంధనలు ఉంటాయి. ఆలయ నిర్మాణానికి ఆ భూమి అనుకూలంగా ఉందా? లేదా? మట్టి ఎలాంటిది? లూజ్ సాయిల్ ఉంటే అది ఆలయ నిర్మాణానికి పనికిరాదు. ఆగమాలకు అనుకూలంగా ఉందా? పరిసర ప్రాంతాల స్థితిగతులేమిటి అన్న అంశాలను పరిశీలించిన తర్వాతనే ఆలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తారని టీటీడీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఆ ప్రకారంగా, చెన్నైలో జీ స్వ్కేర్ కంపెనీ ప్రతిపాదించిన భూమి స్వరూపం ఏమిటో పరిశీలించాల్సి ఉంటుందంటున్నారు.
చెన్నైలో సొంత స్థలాలుండగా మళ్లీ ప్రైవేట్‌కి ఎందుకు?
కాగా చెన్నై నగర నడిబొడ్డున ఉన్న టీ న గర్‌లో టీటీడీకి ఇప్పటికే 2 ఎకరాల స్థలంలో గోపురం లేని ఆలయం ఉంది. పైన గెస్ట్‌హౌసులున్నాయి. ప్రతి శనివారం భక్తులు అక్కడ భారీ సంఖ్యలో వస్తారు. అది కాకుండా దివంగత మాజీ సీఎం జయలలిత, టీటీడీకి ఇచ్చిన ఆరు ఎకరాల స్థలం ఖాళీగానే ఉంది. అక్కడ భక్తుల విరాళాలతో ఆలయం నిర్మించుకునే వెసులుబాటును టీటీడీ ఎందుకు ఉపయోగించుకోవడం లేదన్నది భక్తుల ప్రశ్న.