Suryaa.co.in

Political News

నలభై ఐదేళ్ల..వికసిత ‘కమలం’!

  • రెండు నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలకూ విస్తరణ
  • ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా ఆవర్భావం
  • సిద్ధాంతబలమే దన్నుగా ఎదిగిన బీజేపీ
  • వాజపేయి-అద్వానీ, మోదీ-షా ద్వయం హిట్
  • పార్టీ కంటే దేశం ముఖ్యం.. ఇదే బిజెపి నినాదం
  • 45 వ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
  • 17 ఏళ్ల అధికారం …. ప్రధానమంత్రులుగా అటల్ బిహారీ వాజ్ పేయి , మోదీ
  • 15 రాష్ట్రాల్లో అధికారపీఠం
  • దక్షిణ భారత్ పైనే గురి
  • దేశమే దేహంగా సాగుతున్న ‘కమల’ ప్రస్థానం

ఇంతితంతై వటుడింతయై మరియు దానింతై నభోవీధిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాడాంత సంవర్ధియై

దేశమే దేహంగా సాగుతున్న పార్టీ అది. దాని తొలి అడుగు రెండుతో ఆరంభమయింది. హిందుత్వ నినాదమే కాదు. దేశంలో పేదల కష్టాలు తీర్చేందుకు నిరంతర పోరాటాలు. అరెస్టులు, జైళ్లు, నిందలూ, నిర్భంధాలు. అలా వేసిన ఆ రెండు అడుగులు.. అలా అలా.. ఇంతితయి వటుడింతయి.. అన్నట్లు. దేశాన్ని సుదీర్ఘ కాలం శాసించి, శ్వాసించిన కాంగ్రెస్ పార్టీకి ముచ్చటగా మూడు రాష్ట్రాలే మిగిల్చి.. దిగ్విజయంగా సాగుతున్న నలభై ఐదేళ్ల ‘కమల’ ప్రస్థానం ఇది.

( ముక్కంటి కంబాల )

వ్యక్తి కంటే సంఘం ముఖ్యం. సంఘం కంటే దేశమే ముందు అనే నినాదం తో భారతదేశ రాజకీయాల్లో పుట్టింది భారతీయ జనతా పార్టీ . 1980 ఏప్రియల్ 6 న మొదలైన బీజేపీ ఎన్నో ఆటుపోట్లు, ఒడుదుడుకులు ఎదుర్కుంది. ఎందరో మహానుభావుల మదిలో నుండి పుట్టిన సిధ్దాంతాలు. లక్ష్య సాధనకు ఎన్నో ఉద్యమాలు …అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మన్ననలే శ్రీ రామ రక్ష. రెండు పార్లమెంటు సీట్లతో మొదలైన ప్రస్థానం. ఆరుసార్లు దేశాన్ని పాలించారు. 15 రాష్ట్రాల్లో అధికార పీఠమెక్కి వికసిస్తోంది కమలం. భారతీయ జనతా పార్టీ 45 ఏళ్ల నాంది ప్రస్తావన, సాధించిన ఘనత పై ప్రత్యేక కథనం .

భారత దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నాలుగున్నర దశాబ్దాలైంది. నలుగురైదుగురితో మొదలైన పార్టీ.. నేడు కోట్లాది మంది సభ్యులను సొంతం చేసుకుని దేశంలో అధికారాన్ని దక్కించుకోగలిగింది. అధికారమనేది సులభంగా రాలేదు. ఎంతోమంది నాయకుల త్యాగాలు వారి ఆలోచనలు , సిధ్దాంతాలు , భావజాలాలు, పఠిత్వమైన నాయకత్వం , క్రమశిక్షణ , సామాజిక చైతన్యం, జాతీయ భావం వలనే ప్రజల విశ్వాసం పొందేందుకు దోహదపడ్డాయి.

బిజెపి పార్టీ ఆవిర్భావాన్ని పరిశీలిస్తే నేటి భారతీయ జనతా పార్టీలో నాటి జనసంఘ్ మూలాలనుండి ఉద్భవించింది. 1951 అక్టోబర్ 21 న డిల్లీలోని రఘోమల్ బాలికల హైస్కూల్ లో డాక్టర్ శ్యామా ప్రసాద్ జనసంఘ్ ను ఏర్పాటు చేసారు… స్వాతంత్ర ఉద్యమ చరిత్ర కలిగి దేశంలో ఏకచక్రాధిపత్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనసంఘ్ అడుగులు పడ్డాయి. 1952 లోజరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మూడు సీట్లు సాధించిన జనసంఘ్ క్రమేనా బలాన్ని పెంచుకుంటూ బలపడింది.

1975,77 ఎమర్జన్సీ పాలన తర్వాత జనతా పార్టీలో జన సంఘ్ విలీనం అయింది. జనతాపార్టీ కార్యనిర్వాహక మండలి సభ్యులు పార్టీ మరియు ఆర్ ఎస్ ఎస్ ద్వంద సభ్యులు గా ఉండకూడదని నిషేదించింది. దీంతో జనసంఘ్ వర్గం జనతా పార్టీను వీడి 1980 ఏప్రియల్ 6 న కొత్త రాజకీయపార్టీగా ఏర్పడింది..అదే భారతీయ జనతా పార్టీ ..అటల్ బిహారీ వాజపేయ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగారు.

భారతీయ జనతా పార్టీ లో కొందరి పేర్లు చిరస్మరనీయం. అటల్ బిహారీ వాజ్ పేయి , ఎల్ కె అద్వానీ, పండిట్ దీనదయాళ్ తొలి తరం వారైతే పార్టీ అధ్యక్షులుగా చేసిన అనేక మంది తో పాటు నేటి ప్రధాని నరేంద్రమోది వరకు బీజేపీ బలోపేతంలో బలమైన పాత్ర పోషించారు. బిజెపి లో వాజ్ పేయ్ శకం, మోది శకం అనవచ్చు.

1980 లో మొదలైన భారతీయజనతా పార్టీ ప్రస్తానాన్ని పరిశీలిస్తే రెండు దశాబ్దాల రాజకీయాలు మరవలేనివి… గోద్రా, బాబ్రీ లాంటి ఘటనలు బిజెపిని ఇబ్బందులు కు గురిచేశాయి. అయినా క్రమిశిక్షణ సిధ్దాంతాలు కలిగిన వాజ్ పేయ్ , అద్వానీ లాంటి నేతలు బలమైన నాయకత్వాన్ని ఇచ్చాయి. 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2 స్థానాలు దక్కించుకుని బిజెపి తన వాణిని పార్లమెంట్ లో వినిపించేందుకు అడుగుపెట్టింది… అధ్వానీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 1989 లో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా 85 స్థానాలను బిజెపి కి వచ్చాయి.

మురళీ మనోహర్ జోషి అధ్యక్షతన 1991 లోజరిగిన ఎన్నికల్లో మరింత పెరిగి 120 సీట్లు సాధించగలిగారు. 1995 తర్వాత ఉత్తర భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, బీహార్ ఒరిస్సా, గోవా, గుజరాత్ , మహారాష్ట్రలలో బిజెపి తన ప్రస్థానాలను ప్రారంభించి రాజకీయం మొదలు పెట్టింది. దీంతో 1996 లో జరిగిన దేశ ఎన్నికల్లో 161 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. అప్పుడే అటల్ బిహారీ వాజ్ పేయ్ 16 రోజుల పాటు తొలి సారి ప్రధానమంత్రిగా వ్యవహారించారు.

మెజార్టీ లేకపోవడంతో నేషనల్ ,యునైటెడ్ ప్రంట్ కూటమి మెజార్టీ ఉండటంతో నాడు చంద్రశేఖర్ , ఐ కె గుజ్రాల్ , దేవెగౌడలు ప్రధానులుగా వ్యవహరించారు.. 1998 మధ్యంతర ఎన్నికల్లోనూ టిడిపి, ఏఐడిఎంకె మద్దతుతో 182 స్థానాలు సాధించి వాజ్ పేయ్ రెండవసారి ప్రధాని అయ్యారు. ఏఐడిఎంకె మద్దతు ఉపసంహారించడంతో 1999 లో జరిగిన ఎన్నికల్లో బిజెపి వరుసగా విజయం సాధించి, 183 స్థానాలు పొందగా ఎన్ డి ఏ కూటమి కి 303 స్థానాలు దక్కాయి. దీంతో అటల్ బిహారీ వాజ్ పేయి పూర్తికాలం ప్రధానిగా వ్యవహరించి 2004 మే 22 వరకు బీజేపీ పాలన ను దేశానికి అందించారు. 2004,2019 లో యూపిఏ కూటమి అధికారం చేజిక్కించుకోవడంతో బిజెపి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది.

వాజ్ పేయి భారత ప్రధానిగా దేశం లో 6 సంవత్సరాల 80 రోజుల సుపరిపాలన సాగింది. బిజెపి ప్రభుత్వంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చింది. కొన్ని నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకత చూరగొనడంతో పదేళ్లు 2004 నుండి 2014 వరకు అధికారం కోల్పోవాల్సి వచ్చింది. మోదీ రంగ ప్రవేశంతో మళ్లీ మార్పు మొదలైంది.

వాజ్ పేయి శకం తర్వాత బీజేపీ బలమైన నూతన నాయకత్వానికి పట్టం కట్టారు.. ఆ క్రమంలోనే గుజరాత్ కు మూడు సార్లు సీఎంగా చేసిన నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్దిగా ప్రకటించి 2014 లో రంగంలోకి దించి సక్సెస్ అయ్యారు… 2014 లో 282 సీట్లు సాధించి 31 శాతం ఓట్లు పొందింది బిజెపి ..కూటమి సభ్యులతో కలసి 336 సీట్లు ఉండటంతో మోడీ ప్రధాని అయ్యారు.

బేటి పడావో..బేఠి బచావో, సబ్ కా సాత్ .సబ్ కా వికాస్ , లాంటి నినాదాలతో అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తూ పాలన సాగించారు. పస్ట్ టైమ్ మోది పాలన అద్బుతంగా ఉండటంతో రెండవసారి 2019 లోనూ పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చారు భారత ప్రజలు.. 303 స్థానాలను గెలిచి రికార్డు సాధించింది మోది ప్రభుత్వం… రెండవ సారి మోది ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్ ఆర్ సి, సిఏఏ, త్రిపుల్ తలాక్ లాంటి బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మహిళా బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇక 2024 లో ఎన్ డి ఏ కూటమి కలసి ముచ్చటగా మూడవసారి బరిలోకిదిగా 240 స్థానాలను గెలుచుకుంది బిజెపి. కూటమి మద్దతుతో 3.0 పేరిట మోది మూడవ సారి ప్రధానమంత్రి అయ్యారు. విజన్ 2047 వికసిత్ భారత్ తో పాలన సాగిస్తున్నారు. నరేంద్రమోది వరుస విజయాలతో యాట్రిక్ సాధించి 11 ఏళ్లు కాలాన్ని పూర్తి చేశారు. 2029 వరకు మోది ప్రధాని గా ఉంటే 15 ఏళ్ల ప్రధానిగా రికార్డు సాధించనున్నారు.

భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తెలుగు రాష్ట్రాల నాయకులు విశేష కృషి చేశారు. వెంకయ్యనాయుడు, బంగారు లక్ష్మణ్ లు దేశరాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు.. బిజెపి లో ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్యనేతగా చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ బలోపేతం లో ఆయన పాత్ర మరువలేనిది. ఎంఎల్ఏ గా, ఎంపిగా కేంద్రమంత్రిగా , బిజెపి జాతీయ అధ్యక్షునిగా సేవలు అందించి అభివృద్దికి బాటలు వేసారు..ఉపరాష్ట్రపతిగా పనిచేసి ప్రత్యేక గుర్తింపు సాధించారు.

బిజెపి అనగానే ఉత్తర భారతదేశంలో మాత్రమే ఉందనుకునే వారు.. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనూ విడిపోయిన తెలంగాణా, నవ్యాంధ్రలోనూ బిజెపి బలహీన పడలేదు .. అవకాశం అందిపుచ్చుకుని బలపడింది. చట్ట సభల్లోనూ అవకాశాలు పొంది పార్టీ ప్రతిష్టను ఇనుమడింపచేసారు.

45 ఏళ్ల భారతీయ జనతా పార్టీకి రధసారధులుగా ఇప్పటి వరకు 11మంది జాతీయ అధ్యక్షులుగా సారధ్యం వహించారు. బిజెపిలో పార్టీ ప్రెసిడెంట్ అంటే సుప్రీం. మూడేళ్ల పదవీకాలం ఉండే పార్టీ అధ్యక్షపదవి కొంతమందికి రెండు సార్లు దక్కగా కొందరికి ఒక్కసారి మాత్రమే చాన్సు దక్కింది. తొలినాటి అధ్యక్షులు వాజ్ పేయ్ అయితే ప్రస్తుత అధ్యక్షులు గా జెపి నడ్డా ఉన్నారు.

భారతీయ జనతా పార్టీలో అనేక అనుబంధ విభాగాలున్నాయి. జాతీయ స్థాయి నుండి డివిజన్ స్థాయి వరకు , విద్యార్ది , యువజన, మహిళా, కిసాన్ మోర్చాలతో పాటు ప్రధాన పార్టీ విభాగం అంతా కూడా ఒక ప్రణాళిక బద్దంగా క్రమపద్దతి లో నియమిస్తుంటారు.ప్రెసిడెంట్ పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. 1980లో పార్టీ స్థాపించిన తరువాత, అటల్ బిహారీ వాజ్పేయి దాని మొదటి అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఆ తర్వాత భారత ప్రధాని అయ్యాడు. 2018 ఆగస్టులో మరణించేనాటివరకు అధ్యక్ష పదవిలో కొనసాగిన ఏకైక బిజెపి అధ్యక్షుడు. 1986లో, లాల్ కృష్ణ అద్వానీ పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు.అద్వానీ మూడు సార్లు వేర్వేరు సమయంలో సుధీర్ఘ కాలం అధ్యక్షుడిగా పనిచేసారు….రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాలు కూడా రెండు పర్యాయాలు చొప్పున పనిచేశారు. 2020 నుండి జగత్ ప్రకాష్ నడ్డా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.. బిజెపి అధ్యక్షులుగా పనిచేసిన వారిలో అటల్ బిహారీ వాజపేయి,లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కుషభావ్ థాక్రే , బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి, వెంకయ్య నాయుుడు, రాజ్ నాధ్ సింగ్, నితిన్ గడ్కరి ,అమిత్ షా, జెపి నడ్డా లు బిజెపి దేశ నేషనల్ ప్రెసిడెంట్సు గా పనిచేసారు.

ఆర్ ఎస్ ఎస్ , జన సంఘ్ ఆవిర్భావం నుండి నేటి బిజెపి వరకు ఆంధ్రాలో నాయకత్వం పరిడవిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్ , నవ్యాంధ్రప్రదేశ్ లో బిజెపి కొంత మేర బీజాలు చల్లింది… చట్ట సభల్లోనూ కొంతమందికి అవకాశం దక్కడంతో పాటు కూటమి పొత్తుల వలన ప్రభుత్వంలోనూ బాగస్వామ్యులయ్యారు.. మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా అవకాశం దక్కింది.

బిజెపి కి మూలమైన ఆర్ ఎస్ ఎస్ , జన సంఘ్ పార్టీ కి ఏపి నుండి ఎంతో మంది కీలకంగా పనిచేసారు.. అట్టి వారిలో జూపూడి యజ్ఘ్ననారాయణ, గోపాలరావు ఠాగూర్ , ఎంఎల్ నరసింహారెడ్డి, అవసరాల రామారావు లాంటి వారు ఎందరో నాయకత్వ ప్రాతినిధ్యం వహించారు. అనేక స్థానిక సంస్థల్లోనూ వీరు పోటీ చేసి విజయం సాధించారు. 1980 తర్వాత బిజెపి నుండి కూటమి పొత్తులో బాగంగా బిజెపి ప్రజా ప్రతినిధులుగా పార్లమెంటు సభ్యులు, మంత్రులు, కేంద్రమంత్రులు ,ఎంఎల్ఏలు, ఎంఎల్సి గా ప్రాతినిధ్యం వహించే అవకాశం చాలామందికి దక్కింది.

వెంకయ్య నాయుడు ఉదయగిరి ఎంఎల్ఏగా 1983 లో ఎన్నికయ్యారు.. కోట శ్రీనివాస్ , కంభంపాటి హరిబాబు, ఎంఎస్ పార్థసారథి, అయ్యాజీ వేమా, ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు , ఏబీపీ పికె సత్యనారాయణ, నందిపాకు వెంకటస్వామి, గోకరాజు గంగరాజు, విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ, పైడికొండ మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ లు చట్టసభల్లో పనిచేసారు.

ఇక ప్రస్తుతం 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఎన్ డిఏ కూటమి లో భాగంగా 8 మంది బిజెపి ఎంఎల్ఏలు అయ్యారు.వారిలో సత్యకుమార్ యాదవ్ మంత్రి అయ్యారు. సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి, కామినేని శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, పివి పార్ధసారధి, ఈశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లు ఏపిలో కొనసాగుతున్నారు. పార్లమెంట్ సభ్యులు గా సీఎం రమేష్ , దగ్గుబాటి పురందరేశ్వరి, భూపతి రాజు శ్రీనివాసశర్మ ఎంపీలుగా కొనసాగుతుండగా.. శ్రీనివాస శర్మ కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు.

ఏపి శాసన మండలిలో సోము వీర్రాజు ఎంఎల్సి గా కొనసాగుతున్నారు .గతంలో మాధవ్ బిజెపి ఎంఎల్సిగా పనిచేసారు. ఇవి కాకుండా నామినేషన్ పదవులు బిజెపి వారికి దక్కుతుండటంతో ఏపిలో పార్టీ బలోపేతానికి మార్గం సుగుమమైంది.

బిజెపి లక్ష్యం దక్షిణ భారత్ మీద పెట్టింది. దేశం లో 29 రాష్ట్రాలు ఉండగా ఇప్పటికే 15 రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకుంది. గల్లీ నుండి డిల్లీ వరకు కమలం వికసించాలన్న పట్టుదలలో బాగంగా డిల్లీ పీఠమెక్కారు. ఇక సౌత్ లో స్పేస్ సొంతం చేసుకునేందుకు వ్యహాలు పన్నుతోంది.

బిజెపి దేశంలో బిజెపి ప్రత్యక్షంగా పరోక్షంగా 15 రాష్ట్రాలలో అధికారం దక్కించుకుని కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ పరిపాలన సాగిస్తుంది. మిగిలిన రాష్ట్రాల్లో బిజెపి బలపడేందుకు ఎత్తులు పైఎత్తులు వ్యూహాలు అమలు చేస్తోంది..కూటమి లో ఉంటూనే బలపడేందుకు మార్గాలు అన్వేషిస్తుంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక ల పై పట్టు సాధించాలన్నది బిజెపి లక్ష్యం గా పనిచేస్తుంది.

2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కంభంపాటి హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు లు బిజెపి రాష్ట్ర రధసారధులుగా పనిచేసారు. ప్రస్తుతం ఎన్ టి ఆర్ కుమార్తె మాజీ కేంద్రమంత్రి , రాజమండ్రి బిజెపి ఎంపి దగ్గుపాటి పురందరేశ్వరి లు బిజెపి ఏపి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.

బిజెపి ఒక వైపున బలపడుతుంటే మరో వైపున విభిన్న గ్రూపులు పార్టీ అభివృద్దికి ఆటంకంగా మారుతోంది. గ్రూపులకు అతీతంగా ఏకతాటి పైకి తీసుకురాగలిగితే బిజెపి కి ఏపిలో మంచి భవిష్యత్ ఉండనుంది.

దేశమంతా బిజెపి దూసుకెళ్తోంది. ఏపీలో కూడా కొంతమేరకు పరుగులుపెడుతున్నా కొన్ని ఆటంకాలు తప్పడం లేదు. గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి…విత్తు ముందా ..చెట్టు ముందా అన్నట్లు పార్టీ ఆవిర్భావం నుండి దశాబ్దాలుగా పనిచేస్తున్న వారు కొందరరైతే…. అవకాశాల కోసం వేర్వేరు పార్టీల నుండి వచ్చిన వారు మరికొందరు…. ఉనికి కోసం స్వలాభం కోసం వచ్చిన వారు మరికొందరు..ఎలయన్సు లో బాగంగా ముందస్తుగా సేఫ్ జోన్ బిజెపి పంచన చేరిన వారు ఇంకొందరు బిజెపిలో వివిధ విభాగాల్లో నాయకులుగా సభ్యులుగా కొనసాగుతున్నారు.

ఇవి కాకుండా సామాజిక వర్గాల వారీగా , పార్టీ అధ్యక్షుల స్వంత వారిగా ఉండేవారు లేకపోలేదు. అంటే బిజెపి లో బీజేపీ వారే కాకుండా టిడిపి, కాంగ్రెస్ , జనసేన, ఇతర పార్టీ లనుండి వచ్చినవారు ఉన్నారు. వీరందరిని సిద్దాంతులు పార్టీ లక్ష్యాలు, నియమనిబంధనలు ఆశయాలకు కట్టుబడి ఏకతాటి పైకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అప్పుడే ఏపిలో బిజెపి బలంగా ఎదగగలదు.

చూసారు కదా జన సంఘ్ నుండి మొదలై బిజెపి గా ఆవిర్భవించి 45 ఏళ్ల సుదీర్ఘకాలంలో ఎన్నో విజయాలు సాధించి, దేశమంతా విస్తరించి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు వికసింపచేసింది కమలం. మున్ముందు దేశప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చాలని కోరుకుంటూ బిజెపి 45 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

( రచయిత సీనియర్ పాత్రికేయులు)

LEAVE A RESPONSE