– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ : విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థనా..? లేక మోడీ బినామీ కంపెనీనా..? ఎంత ఉత్పత్తికి అంతే వేతనం ఏంటి? ఉత్పత్తి లేదని నింద కార్మికుల మీద మోపుతారా? అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె ఏమన్నారంటే… ఏకంగా బహిరంగ సర్క్యులర్ ఇస్తారా? దేశంలో భారతీయ కార్మిక చట్టమే ఉందా లేక మోడీ లేబర్ చట్టం అమల్లో ఉందా? ఆంధ్రుల హక్కుతో ఇదేం చెలగాటం? ఇది కేంద్ర ప్రభుత్వ కండ కావరానికి, నియంత మోడీ వికృత చేష్టలకు నిదర్శనం.
స్టీల్ ప్లాంట్ ను అమ్మే కుట్రలో భాగమే ఇదంతా. 30వేల మంది కార్మికులను 18వేలకు కుదించారు. స్టీల్ ఉత్పత్తికి కావాల్సిన ముడిసరుకులు తగ్గించారు. 45 రోజుల పాటు సరిపడా నిల్వ ఉండాల్సిన రా మెటీరియల్ 5 రోజులకు మించి పెట్టడం లేదు. ఐరన్ ఓర్ అందక నెలకు వారం రోజులు ఉత్పత్తి ఆపుతున్నారు. బ్యాంకుల నుంచి వర్కింగ్ క్యాపిటల్ ఆపేశారు. స్పేర్ పార్ట్స్ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు.
స్టీల్ ప్లాంట్ రవాణాకు కావలసిన రైల్వే వ్యాగన్లు ఇవ్వకుండా అడ్డుకట్ట వేశారు. అయినా మీరు వేసిన ముళ్ళకంచె దాటుకుంటూ, ఏడాది నుంచి సగమే జీతం తీసుకుంటూ, రోజుకు 16 వేల టన్నులు ఉత్పత్తి తీస్తూ..
5.8 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి చేస్తున్నారంటే ఇది కార్మికుల శ్రమ కాకపోతే మరేంటి ? తప్పులన్నీ యాజమాన్యం దగ్గర పెట్టుకొని కార్మికుల మీద నిందలు మోపడం ఏంటి ? వారి జీతాలను కోస్తామని చెప్పడం ఏంటి?
అరకొర సదుపాయాలతో బలవంతపు టార్గెట్లు పెట్టడం ఏంటి? 7.3 మిలియన్ సామర్థ్యంలో 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గడానికి ప్రభుత్వ చర్యలే కారణం. స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నష్టాలను కార్మికుల మీద రుద్దడం సబబు కాదు. ఎంతటి ఉత్పత్తినైనా సాధించి పెట్టేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారు. ఇచ్చిన సర్క్యులర్ తక్షణం వెనక్కు తీసుకోవాలి. 7.3 మిలియన్ టన్నుల పూర్తి స్థాయి ఉత్పత్తికి కావాల్సిన రా మెటీరియల్ అందించాలి. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.
ఈ విషయంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు చేసే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. స్టీల్ ప్లాంట్ కార్మికులపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరం. కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వెనక్కు తీసుకొని కార్మికులకు క్షమాపణ చెప్పాలి. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును వైట్ ఎలిఫెంట్ గా పోల్చడం, కార్మికులకు ఊరికే జీతాలు ఇస్తున్నట్లు మాట్లాడటం బాధాకరం. మాటలు కాదు.. చంద్రబాబుకి దమ్ముంటే కార్మికుల పెండింగ్ జీతాలు ఇప్పించండి. ప్రైవేటీకరణ లేదని ప్రధానితో బహిరంగ ప్రకటన చేయించండి. మోడీతో కొట్లాడి స్టీల్ ప్లాంట్ ను సైల్లో విలీనం చేయించండి. ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి