– రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, ఆగస్టు 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్ష రంగంలో స్టార్టప్ సంస్థలకు సంస్థాగత, మౌలిక సహకారంతోపాటు సాంకేతిక మార్గదర్శకత్వం కూడా అందిస్తోందని పిఎంవో శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ స్పేస్ సైన్స్, టెక్నాలజీ, అప్లికేషన్ డొమైన్లలో మొత్తం 99 స్పేస్ టెక్ స్టార్టప్ సంస్థలకు ఇస్రో ద్వారా సహకారం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహించేందుకు, వాటిని చేయిపట్టుకు నడిపించేందుకు ఇన్-స్పేస్ పేరుతో సింగిల్ విండో ఏజెన్సీని సృష్టించినట్లు మంత్రి తెలిపారు. అంతరిక్ష కార్యక్రమాల అమలులో దేశంలో ప్రధాన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ అయిన ఇస్రో ప్రతిభావంతులను ఆకర్షించి వారిని నిలుపుకునే సామర్థ్యం కలిగి ఉందని మంత్రి తెలిపారు.
అయితే వివిధ స్థాయిలలో కొన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ అవి పరిశ్రమ ప్రమాణాలతో పోల్చితే చాలా తక్కువని తెలిపారు. అనేక మంది అనుభవజ్ఞులైన యువకులు, ఇస్రోలో పదవీ విరమణ చేసిన వారిని స్పేస్ టెక్ సంస్థలు ఆకర్షించడం ద్వారా ఇస్రోపై ప్రభావం పడుతోందా అన్న ప్రశ్నకు బదులిస్తూ ఇస్రో పై ఎటువంటి ప్రభావం లేదని మంత్రి అన్నారు.