– జూన్ 21న విశాఖ ఆర్కే బీచ్‌లో యోగా డే, హాజరుకానున్న ప్రధాని మోదీ
– సుమారు ఐదు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
– కూటమి నేతలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
వైజాగ్: ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ నగరంలో జరగటం చాలా గర్వకారణంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం ‘యోగాంధ్ర’ కార్యక్రమం ఏర్పాట్లను వైజాగ్ లో సీఎం చంద్రబాబుతో కలసి మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమ నిర్వహణను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని, దానిలో భాగంగా అధికారులకు, తమకు సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా తొలుత విశాఖలోని ఓ ప్రయివేట్ హోటల్ లో పార్లమెంట్ ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు, కూటమి పార్టీ నేతలతో చంద్రబాబు నిర్వహించిన కీలక సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, విశాఖ ఆర్కే బీచ్ వేదికగా జరగనున్న ఈ యోగా దినోత్సవ కార్యక్రమానికి సుమారు ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 607 సచివాలయాల సిబ్బంది హాజరవుతున్నారని, వారిని అధికారులు సమన్వయం చేస్తారని తెలిపారు.
రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే వారితో ముందుగా మాక్ యోగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారని తెలిపారు. ప్రధానమంత్రితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం బ్రహ్మండంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిదని, మోదీ హాజరయ్యే కార్యక్రమంలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.