– ఎపిఎస్డిపిఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.ఆర్.అలపర్తి
అమరావతి: భారతదేశ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది సమరయోధులు ఎన్నో ఉద్యమాలు, మరెన్నో పోరాటాలు చేసి వారి ప్రాణాలను తృణప్రాయంగా దేశం కోసం అర్పించి మనకు స్వాత్యంత్రాన్ని తీసుకొచ్చారని ఎపిఎస్డిపిఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.ఆర్. అలపర్తి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ అండ్ పావర్టీ సొల్యూషన్స్ ప్రోగ్రామ్ (ఎపిఎస్డిపిఎస్) కార్యాలయంలో శుక్రవారం ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎపిఎస్డిపిఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.ఆర్. అలపర్తి ప్రధాన అతిథిగా హాజరై హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నడిపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మన దేశం స్వాతంత్య్రాన్ని సాధించి 78 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు. భావితరాలకు స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ పిలుపు మేరకు ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు.
‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్ – 2047’ నినాదంతో అభివృద్ధి పథంలో భారతదేశం దూసుకుపోతుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో కులం, మతం, ప్రాంతం, పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన P4 విధానం (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్) ప్రాముఖ్యతను అలపర్తి వివరించారు. ఈ జీరో పావర్టీ మిషన్ ద్వారా ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ప్రజలు కలిసి పేదరికాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి శాశ్వతంగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే 2 లక్షల మార్గదర్శులు ముందుకు వచ్చారని, రాష్ట్రంలో ఉన్న 15 లక్షల బంగారు కుటుంబాలను పేదరికం నుంచి ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మార్గదర్శకుల ద్వారా కృషి చేస్తున్నామన్నారు. ఈ మార్గదర్శులు విద్య, నైపుణ్యాలు, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, వ్యాపార అవకాశాలు, ఆర్థిక సహాయం వంటి విభిన్న రంగాల్లో బంగారు కుటుంబాలకు తోడ్పాటు అందిస్తారని ఆయన వివరించారు.
ఈ స్వాతంత్ర్య వేడుకల్లో అడ్మినిస్ట్రేటివ్ అధికారి సత్యనారాయణ రాజు, సీనియర్ సలహాదారు వెంకటేశ్వర స్వామి, డైరెక్టర్ అడ్మిన్ మోహన్ రావు, అకౌంట్స్ అధికారి శ్రీనివాసులు, పీఏటు ఈడీ కె.పీరా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎన్ఆర్ఆలు, దాతలు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు.