Suryaa.co.in

Andhra Pradesh

డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కి మ‌హిళ‌ల‌ను వాడుకోవ‌డం సిగ్గుచేటు

– టీడీపీ మ‌హిళా కార్య‌క‌ర్త‌ల‌తో సాక్షి కార్యాల‌యాల మీద దాడులు
– వైయ‌స్సార్సీపీ మ‌హిళా అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి ఆగ్రహం

తాడేప‌ల్లి: కూటమి ప్రభుత్వం తన డైవర్షన్ పాలిటిక్స్‌ కోసం మహిళలను పావులుగా వాడుకోవడం అత్యంత దారుణమని వైయ‌స్సార్సీపీ మ‌హిళా అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సాక్షి మీడియాపై మహిళలను ఉసికొల్పి దాడులు చేయించే దిగజారుడు రాజకీయాలకు సీఎం చంద్రబాబే పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేయాలనే దుర్మార్గమైన పాలనలో భాగంగానే మహిళలను ముందు పెట్టి కుటిల రాజకీయానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ ఎక్క‌డికెళ్లినా ప్ర‌జ‌లు వేలాదిగా త‌ర‌లివ‌చ్చి ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇది చూసి చంద్ర‌బాబు, లోకేష్ ఓర్వ‌లేక మ‌హిళ‌ల‌ను అడ్డం పెట్టుకుని డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కి తెగబడ్డారు. వారి దిగ‌జారుడు రాజ‌కీయాలకు మ‌హిళ‌ల‌ను పావులుగా వాడుకుంటున్నారు.

మ‌హిళ‌ల నిర‌స‌న పేరిట సాక్షి కార్యాల‌యాల‌ను టార్గెట్ చేసుకుని గ‌డిచిన మూడు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అరాచ‌కాల‌కు టీడీపీ కుట్ర చేసింది. మ‌హిళ‌ల‌ను ఆర్థికంగా ఆదుకోవ‌డం, ర‌క్ష‌ణ కల్పించ‌డం వంటివి చేయ‌క‌పోగా వారిని అడ్డం పెట్టుకుని కుట్ర రాజ‌కీయాలు చేయ‌డం దారుణం. ఏలూరులో సాక్షి కార్యాల‌యం మీద దాడికి టీడీపీ కుట్ర చేసింది. ముందుగా మ‌హిళా కార్య‌క‌ర్త‌ల‌ను పంపించి, వారి వెనుక టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పంపించి దాడులు చేయించింది. తిరిగి ఆ నెపం వైయ‌స్సార్సీపీ మీద‌కు నెట్టాల‌ని చూస్తున్నారు.

సాక్షి టీవీ డిబేట్‌లో జ‌ర్న‌లిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన మాట‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేయ‌డం సిగ్గుచేటు. చంద్ర‌బాబులా మ‌హిళ‌ల గురించి ఏనాడైనా వైయ‌స్ జ‌గ‌న్ చుల‌క‌న‌గా మాట్లాడ‌టం జ‌రిగిందా? కోడ‌లు మ‌గ‌బిడ్డ‌ను కంటానంటే అత్త వ‌ద్దంటుందా అని మ‌హిళ‌ల పుట్టుకనే అవ‌మానించేలా మాట్లాడిందే చంద్ర‌బాబు. దానికి చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి.

వైయ‌స్ జ‌గ‌న్ సీఎంగా ఉన్న ఐదేళ్లూ మ‌హిళ‌ల‌కు అమ్మ ఒడి, చేయూత‌, ఆస‌రా వంటి ప‌థ‌కాల‌తో అండ‌గా నిలిస్తే, చంద్ర‌బాబు త‌న కుట్ర రాజ‌కీయాల‌కు మ‌హిళ‌ల‌ను వాడుకుంటున్నాడు. ఈ ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు క‌నీస ర‌క్ష‌ణ కూడా లేదు. డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌తో ఎంతోకాలం ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌లేరు. ఇలాంటి కుట్ర‌లు, వ‌క్రీక‌ర‌ణ‌లు ఎంతోకాలం సాగ‌వ‌ని గుర్తుంచుకోవాలి.

కూట‌మి మోస‌పు హామీలు న‌మ్మి మోస‌పోయామ‌ని ఇప్ప‌టికే మ‌హిళ‌లు ఆందోళ‌నగా ఉన్నారు. పాల‌నా వైఫ‌ల్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఏడాది కాలంలోనే రూ.1.58 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసిన కూట‌మి ప్ర‌భుత్వం సూప‌ర్ సిక్స్‌లో ఒక్క ప‌థ‌కాన్ని కూడా పూర్తిగా అమ‌లు చేయ‌లేక‌పోయింది. మా ఐదేళ్ల పాల‌న‌లో చేసిన అప్పుల్లో 44 శాతం అప్పులు ఏడాదిలోనే చంద్ర‌బాబు చేసేశాడు. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేని దుస్థితిలోకి కూట‌మి ప్ర‌భుత్వం దిగ‌జారిపోయింది. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు త‌న కుట్ర రాజ‌కీయాల‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE