* పెనుకొండలో సీ డాప్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
* 25 రకాల చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుపై శిక్షణ
* స్థానిక అవసరాలకు తగ్గట్లు పరిశ్రమల ఏర్పాటు
* రుణాలు, సబ్సిడీలపై అవగాహన
* భారీగా తరలొచ్చిన యువత
* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
పెనుకొండ : గ్రామీణ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. యువతకు ఉద్యోగాల కల్పనతో పాటు పలువురికి ఉపాధి కల్పించేలా 25 రకాల చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంతో పాటు యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ మరియు ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ (సీ డాప్ ), సెంచూరియన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో పరిశ్రమల ఏర్పాటు-ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన సదస్సును స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత, మార్కెట్ ఆధారిత నైపుణ్య కార్యక్రమాలపై శిక్షణ అందజేస్తూ, పల్లెల్లో చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పాలని నిర్ణయించిందన్నారు.
దీనిలో భాగంగా 25 రకాల పరిశ్రమలను ఏర్పాటు చేయడంపై యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు సబ్సిడీ రుణాలు అందజేయనుందన్నారు. అదే సమయంలో వారు చేసే ఉత్పత్తులకు కూడా ప్రభుత్వమే మార్కెట్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ మరియు ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ (సీ డాప్ ), సెంచూరియన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో పరిశ్రమల ఏర్పాటు-ఉపాధి అవకాశాల కల్పనపై అవగాహనతో పాటు శిక్షణా కార్యక్రమాలను తమ ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు.
పరిశ్రమల ఏర్పాటుపై యువతలో ఉన్న అపోహాలను ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా తొలగిస్తామన్నారు. రుణ సదుపాయలు, సబ్సిడీలపైనా ఈ సదస్సులో వివరించనున్నట్లు తెలిపారు. నియోజక వర్గంలోని అయిదు మండలాల్లోనూ ఈ తరహా అవగాహనతో కూడిన శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పెనుకొండలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత తరలొచ్చిందని మంత్రి సవిత ఆనందం వ్యక్తంచేశారు.
20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతాం…
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామని మంత్రి సవిత స్పష్టంచేశారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు శ్రమిస్తూ… ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తున్నారన్నారు. ఎన్నో దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి తరలొస్తున్నాయన్నారు. పారిశ్రామికాభివృద్ధిలో పెనుకొండ నియోజక వర్గానికి ప్రథమ నిలిపేలా కృషి చేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
మహిళలకు ఎంతో మేలు
ఆయా ప్రాంతాల అవసరాలు, స్థానికంగా లభ్యమయ్యే రా మెటీరియళ్లకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుపై ఉత్సాహవంతులైన యువతకు అవగాహన కల్పించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. అవసరమనుకుంటే పంచాయతీ స్థాయిలోనూ ఇటువంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ శిక్షణా కార్యక్రమాలతో మహిళలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటు ఉంటుందని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
వ్యక్తిగతంగా, సామూహికంగా చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటులో మహిళలకు అండగా ఉంటామని మంత్రి సవిత స్పష్టంచేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో అధికారులు మాట్లాడుతూ, పరిశ్రమల ఏర్పాటు-ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీ డాప్ అధికారులు, భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు.