చింతామణి నాటకాన్ని నిషేధించడం రాజ్యాంగ విరుద్ధం

Spread the love

నైనవరం పంచాయతీ ఆఫీస్ సెంటర్లో నిరసన

విజయవాడ : చింతామణి సాంఘిక పద్య నాటకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మండలంలోని పి నైనవరం, అంబాపురం, జక్కంపూడి గ్రామాలకు చెందిన పలువురు కళాకారులు మంగళవారం నైనవరం పంచాయతీ ఆఫీస్ సెంటర్లో చింతామణి నాటకాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిషేధాన్ని ఎత్తేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సీనియర్ కళాకారుడు బండి సదాశివరావు అధ్యక్షత వహించారు. ప్రజానాట్యమండలి కృష్ణా జిల్లా (తూర్పు) కమిటీ అధ్యక్షుడు జి వి రంగారెడ్డి ముఖ్య వక్తగా పాల్గొంటూ ఈ నాటకం నిషేధంతో వందలాది కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయన్నారు. నాటకాన్ని నిషేధించడం కళాకారుల భావప్రకటనా స్వేచ్ఛపై వేటు అని గర్హించారు. నాటకంలో అభ్యంతర సన్నివేశాలున్నట్టు నాటకరంగ పెద్దలు, విద్యావేత్తలు నిర్ధారిస్తే ఆమేరకు ప్రదర్శనలో మినహాయించుకోడానికి కళాకారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంతేగాని “”ఇంట్లో ఎలుక దూరిందని ఇంటికి నిప్పు పెట్టిన చందంగా”” రాష్ట్ర ప్రభుత్వ అస్సలు నాటకాన్నే నిషేధించడం సరైనది కాదని రంగారెడ్డి దుయ్యబట్టారు.

విజయవాడ పౌరాణిక రంగస్థల కళాకారుల సమాఖ్య కార్యదర్శి అగురు త్రినాథనాయుడు ప్రసంగిస్తూ ‘చింతామణి’ నాటక నిషేధం చెల్లదంటూ హైకోర్టులో రైట్ వేశామని తెలిపారు. ప్రజానాట్యమండలి కళాకారుడు ఎం.ఆంజనేయులు తొలుత స్వాగతం పలికారు. కళాకారులు జొన్నలగడ్డ ధర్మారావు, గొడ్డళ్ళ వెంకటేశ్వరరావు, ముగడ సురేష్, పామర్తి శ్రీనివాసరావు, కాకర్ల రాములు, సీహెచ్ రాంబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చింతామణి నాటకంపై నిషేధాన్ని ఎత్తివేయాలని ముక్తకంఠంతో నినదిస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply