నూతన ఒరవడికి నాంది పలికిన ముప్పవరపు వెంకయ్యనాయుడు

– ఒకప్పటి ప్రత్యర్థి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాజనీతిజ్ఞుడు

అయం నిజః పరో వేతి గణనా లఘుచేతసామ్ ।
ఉదారచరితానాం తు వసుధైవ కుటుమ్బకమ్ ॥

సాధారణ వ్యక్తులందరికీ తమ, పర అనే బేధ భావం ఉంటుంది. కానీ ఉదారచరితులకు మాత్రం లోకమంతా తమదే అనే విశాల దృక్పథం ఉంటుంది. అటువంటి వారే విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రవచించగలరు. ప్రపంచ శాంతికి దిశానిర్దేశం చేయగలరు.

భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా తనదైన ప్రత్యేకతను చాటుకున్న ముప్పవరపు వెంకయ్యనాయుడు తరచూ చెప్పే సంస్కృత శ్లోకమిది. మాటల్లో చెప్పిన ఈ శ్లోకాన్ని అనేక సమయాల్లో చేతల్లో చూపించటం బహుశా వారికే చెల్లుతుందేమో. అందుకే ఐక్యరాజ్యసమితికి చెందిన శాంతి విశ్వవిద్యాలయం నుంచి వారు గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఆ సమయంలో కూడా ఇది నాకు వ్యక్తిగతంగా వచ్చిన గౌరవం కాదు, సనాతన కాలం నుంచి శాంతికి కట్టుబడి ఉన్న భారతదేశ సంస్కృతికి వచ్చిన గౌరవం అని చాటి చెప్పటం వారికే చెల్లింది.

ఇటీవల ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరులో పర్యటించారు. ఆ సమయంలో ఆత్మకూరు వెళ్ళి ఓ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పర్యటనలు, విగ్రహావిష్కరణలు వారికి కొత్తేమీ కాదు. అయితే ఈ సారి విగ్రహావిష్కరణకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. 26 ఏప్రిల్ 2023న వారు ఆత్మకూరు మాజీ శాసన సభ్యులు, ప్రముఖ వైద్యులు అయిన బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ ప్రత్యేకత ఏమిటన్నది తెలుసుకోవాలంటే కనీసం 38 ఏళ్లు వెనక్కు వెళ్లాలి.

అప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో యువ శాసనసభ్యుడిగా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు ముప్పవరపు వెంకయ్యనాయుడు . 1978లో ఇందిరా గాంధీ ప్రభంజనాన్ని, 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకుని మంచి మెజారిటీతో ఉదయగిరి నుంచి రెండు పర్యాయాలు విజయకేతనాన్ని ఎగరేశారు. 1985వ సంవత్సరంలో స్థానిక పరిస్థితుల కారణంగా, ఆత్మకూరు నియోజక వర్గం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ తరుఫున వారి ప్రత్యర్థి బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి. హోరాహోరిగా సాగిన ఆ పోరులో స్వల్ప మెజారిటీతో బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి విజయం సాధించారు.

ఆ సమయంలో ముప్పవరపు వెంకయ్య నాయుడు అభిమానులు రీ కౌంటింగ్ కు పట్టుబడితే, వారిని వారించి బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి విజయాన్ని అంగీకరిస్తున్నాను అంటూ వారి పరిణితి కలిగిన వ్యక్తిత్వాన్ని ఆ రోజుల్లోనే చాటి చెప్పారు. ఆ ఆతర్వాత కూడా ఆత్మకూరు ఓటమే , జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశాన్ని అందించిందని చెప్పగలిగిన అరమరికలు లేని వారి మనస్తత్వాన్ని తెలియజేసింది.

ఆ తర్వాత ముప్పవరపు వెంకయ్య నాయుడు కేంద్ర రాజకీయాల్లో పోషించిన అసమాన పాత్ర గురించి మనకు తెలిసిందే. పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తూ పార్టీ కేంద్ర అధ్యక్షుడిగా తానెంతగానో అభిమానించి, ఆదర్శంగా భావించే వాజ్ పేయి, అద్వానీల మధ్యన కూర్చుని పార్టీని ముందుకు నడిపారు. కేంద్ర మంత్రిగా అనేక ఉన్నత పదవులకు వన్నె తీసుకురావటమే గాక, భారతదేశంలో అత్యున్నత రెండో రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా అనేక నిర్ణయాలతో తమ ప్రత్యేకతను చాటుకున్నారు.

ఈ సమయంలో కూడా ఉదయగిరితో పాటు, ఆత్మకూరు ప్రజల పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. వారు కేంద్ర మంత్రిగా ఆత్మకూరు అభివృద్ధి కోసం అందించిన పలు వరాలే ఇందుకు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పులో ఏ లోపమూ ఉండదని వారి అభిప్రాయం. ఉదయగిరి ప్రజలు గెలిపించి ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో ఓ శక్తిగా వారిని ముందుకు నడిపిస్తే… ఆత్మకూరు ప్రజలు ఇచ్చిన తీర్పు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే విధంగా వారి జీవితానికి బాటలు వేసింది.

ఇతర పార్టీ నాయకుల విజయాన్ని ఒప్పుకోలేని నాయకులను ప్రజలు చూస్తున్న నేటి పరిస్థితుల్లో ఒకప్పుడు తన మీద పోటీ చేసి విజయం సాధించిన వ్యక్తి విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులు అడిగిన వెంటనే అంగీకరించి, ఆవిష్కరించిన ముప్పవరపు వెంకయ్య నాయుడు రాజనీతిజ్ఞత ఆదర్శనీయమైనది.

రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండరు అంటూ వారు తరచు చెప్పే మాటలను ఆచరణలో చూపించిన వారి దొడ్డ మనసును చూసి వారి అభిమానులే గాక, రాజకీయ విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. అవుతున్నారు. పార్టీలకు అతీతంగా ఎంతో మంది ప్రజలు, రాజకీయ నేతలు ఇంత పరిణతి కలిగిన వ్యక్తిత్వాన్ని, స్థితప్రజ్ఞతను, రాజనీతిజ్ఞతను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురౌతున్నారు.

పక్క పార్టీ నాయకుడి ముఖం కూడా చూడడానికి ఇష్టపడని నేతలున్న ఈ రోజుల్లో…, వ్యక్తిగత విమర్శలే తప్ప అభివృద్ధికి సంబంధించిన విమర్శలు కరువై పోతున్న ఈ రోజుల్లో…, హుందాతనాన్ని మరచి మంత్రులు సైతం అసభ్యకరమైన వాఖ్యలు చేస్తున్న ఈరోజుల్లో… ముప్పవరపు వెంకయ్యనాయుడు ఓ నూతన ఒరవడికి నాంది పలికారు. ఇది ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమైనది. ఒక్క సారి సంకుచిత భావాల రంగుటద్దాలను పక్కన పెట్టి, నిజమైన కళ్ళతో చూస్తే కనువిప్పును కలిగించే సంఘటన ఇది.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గారు ఎంతగానో అభిమానించే గురజాడ అప్పారావు గారి దేశభక్తి కవితలోని కొన్ని పంక్తులు గుర్తు చేయాల్సిందే.
“పూను స్పర్థను విద్యలందే
వైరములు వాణిజ్యమందే
వ్యర్థ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్”
అంటూ నాడు గురజాడ రాసి చెప్పిన అడుగుజాడను మరోసారి వెంకయ్యనాయుడు తమ అడుగుజాడల్లో చేసి చూపించారు. ఈ స్ఫూర్తిని ఈ తరం రాజకీయనాయకులు ఆదర్శంగా తీసుకోవాలి. నాయుడు గారి బాటలో రాజకీయ నాయకుల్లా గాక రాజనీతిజ్ఞులుగా పార్టీలకు సంబంధం లేని అభిమానాన్ని సంపాదించుకోవాలి.

– కుడుముల సుధాకర్, ఆత్మకూరు

Leave a Reply