– చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
– 3 నెలల్లో టెండర్లు పిలిచి, ఏడాదిలో నిర్మాణం పూర్తి చేస్తాం
– రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
నెల్లూరు : ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం సబబు కాదంటూ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హితవు పలికారు. నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మాట్లాడారు. నెల్లూరు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయన్నారు. అయితే దాన్ని రాజకీయం చేయటం సిగ్గుచేటని తెలిపారు. చింతా రెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
మూడు నెలల్లో టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు. పనులు ప్రారంభించిన తర్వాత ఏడాదిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. కొందరు ఈ విషయమై రాద్ధాంతం చేసేందుకు ధర్నాలు చేస్తున్నారని, ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అని ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇష్టానుసారంగా ఆరోపణలు అవాకులు చవాకులు పేలడం మంచి పద్ధతి కాదంటూ మంత్రి నారాయణ తనదైన శైలిలో హితువు పలికారు.