ప్రజా సంక్షేమం పట్ల దమ్మున్న నేత జగన్: స్పీకర్ తమ్మినేని సవాల్

-చంద్రబాబు బెదిరించి, భయపెట్టి పాలించాడు, జగన్ పేదల ఆకలి తీరుస్తూ, కన్నీరు తుడుస్తూ పాలిస్తున్నారు – మంత్రి ధర్మాన
-రూ. 750 కోట్లతో శుద్ధజల ప్రాజెక్టు చేపట్టి ఉద్దానం ప్రజల కష్టాలను జగన్ తీర్చారు – ఎమ్మెల్యే రెడ్డి శాంతి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ సామాజిక సాధికార యాత్ర జై జగన్.. జై జై జగన్ నినాదాల హర్షాతిరేకాల హోరులో ఉత్సాహంగా సాగింది. బస్సుయాత్రలో వచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రజలు అడగుడుగునా నీరాజనాలు పలకగా, పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించి, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నేతలు ముచ్చటించారు.

అనంతరం పాతపట్నం జంక్షన్ లో జరిగిన బహిరంగ సభకు స్పీకర్ తమ్మినేని సీతారామ్, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జి వై వీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్, గొర్లె కిరణ్, కళావతి, కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎంపీ కిల్లి కృపారాణితో పాటుగా పలువురు నేతలు హాజరయ్యారు.

సంక్షేమ పథకాల అమలులో పైసా అవినీతి జరిగినట్లు రుజువు చేస్తే స్పీకర్ పదవికి రాజీనామా చేస్తా, ప్రజా సంక్షేమం పట్ల దమ్మున్న నేత జగన్ – స్పీకర్ తమ్మినేని సవాల్
పాతపట్నం కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ, బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముెఖ్యమంత్రి జగన్ పరిపాలన సాగిస్తూ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ఝికి పాటుపడుతున్నారని వెల్లడించారు. సంపద, అధికారం, విద్య, వైద్యం,వ్యవసాయం అందరికీ సమానంగా అందాలన్నది రాజ్యాంగలక్ష్యం కాగా, పెత్తందార్లు పేదలకు వాటిని అందివ్వకుండా తొక్కిపెట్టి అరాచక పాలన సాగించేవారని, కానీ గత నాలుగున్నరేళ్ల కాలంలో జగన్ అట్టడుగు వర్గాల సాధికారతకు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.

సమాజంలో మార్పు రావాలని, అన్ని వర్గాల్లోనూ, అన్ని స్థాయిల్లోనూ మార్పు తీసుకురావాలన్నదే తన లక్ష్యమని జగన్ ప్రమాణ స్వీకారం నాడే ఉద్ఘాటించారన్నారు. పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవితం అందించేందుకు ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించి జగన్ మందడుగు వేస్తున్నారని, గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలదే రాజ్యంగా ఉండేదని గుర్తు చేసారు. అర్హతే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలను జగన్ అందిస్తున్నారని వివరించారు. జగన్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల దమ్ముతో పని చేస్తోందని, లోపాలుంటే టీడీపీ నేతలు చూపాలని సవాల్ చేసారు.

సంక్షేమ పథకాల అమల్లో పైసా లంచం తీసుకున్నట్లు రుజువు చేస్తే నా పదవికి ఈ వేదిక మీదే రాజీనామా చేస్తానని సీతారామ్ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. పేదలకు సంపదలో భాగస్వామ్యం కల్పించి జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చారని కొనియాడారు. చరిత్ర ఉన్నంత కాలంలో జగన్ ను మరిచి పోరాదని, తప్పు చేస్తే దేవుడు కూడా క్షమించడని హితవు పలికారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నిక కావాల్సిన చారిత్రక కర్తవ్యం గా ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కోరారు.

చంద్రబాబు బెదిరించి, భయపెట్టి పాలించాడు, జగన్ పేదల ఆకలి తీరుస్తూ, కన్నీరు తుడుస్తూ పాలిస్తున్నారు – మంత్రి ధర్మాన
రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దుర్మార్గులను పెట్టి ప్రజలను బెదిరించి, భయపెట్టి రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగించేవాడని, వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా, పేదరికం మాత్రమే చూసి సంక్షేమం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరేనని వెల్లడించారు. రూ. 2 లక్షల 40 వేల కోట్లు మేరకు సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ అందజేసారని, దీని కోసం ఏ ఒక్కరైనా ఎవరికైనా ఒక్క పైసా లంచం ఇచ్చారా అని ధర్మాన ప్రజలను ప్రశ్నించారు.

ఆకలి చూసి, కన్నీరు తుడవడమే సీఎం జగన్ కు తెలుసునని, చంద్రబాబులా రాజకీయాలు చేసి లబ్ధిదారుల ఎంపిక ఏనాడూ చేయలేదని, ఆత్మగౌరవంతో పథకాలు తీసుకునేలా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. పేదలకు గూడు, నీడ కల్పించాలన్న లక్ష్యంతో రూ. 12,800 కోట్లతో భూమి కొనుగోలు చేసి 32 లక్షల ఇళ్లు నిర్మాణం చేయడానికి ముఖ్యమంత్రిగా జగన్ సంకల్పించారన్నారు.

చంద్రబాబు గతంలో హామీలు ఇచ్చి అమలు చేయకుండా, ఇప్పుడు రాజమండ్రికి వచ్చి వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే జగన్ కంటే ఎక్కువ సంక్షేమం అందిస్తానని చెబుతున్నాడని ఎద్దేవా చేసారు. అధికారం ఇచ్చినపుడు నమ్మిన వారిని బాబు వంచించాడని, ఇప్పుడు అధికారం ఇమ్మని అడగడానికి బాబుకు ఏ అర్హత ఉందని ధర్మాన ధ్వజమెత్తారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాలనాపరమైన శాశ్వత సంస్కరణలను వైయస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టి పారదర్శకతను తీసుకువచ్చారన్నారు. నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో జగన్ తీసుకువస్తున్న మార్పులు కేవలం ఓట్ల కోసం మాత్రం కాదని, ప్రజల జీవన స్థితుగతులు మార్చడానికేనని ధర్మాన ఉద్ఘాటించారు.

చంద్రబాబు హయాంలో ఎరువుల బ్లాక్ మార్కెట్, విత్తనాల కోసం రైతుల క్యూల్లో కొట్లాట వంటి ఘటనలు జరిగేవని, జగన్ పాలనలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, రుణాలను మంజూరు చేసి ఆదుకుంటున్నారని వివరించారు. పర్ క్యాపిటా, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం గతంలో అట్టడుగు స్థానాల్లో ఉండగా, జగన్ ముఖ్యమంత్రి కాగానే దేశంలోనే అద్భుతంగా రాణించి ముందు వరుసలోకి వచ్చాయని వివరించారు. రోడ్లు ఎక్కడైతే అధ్వాన్నంగా ఉన్నాయో, వాటి స్థానంలో కొత్త రోడ్లను త్వరలోనే నిర్మాణం చేస్తామని ప్రకటించారు.

రూ. 750 కోట్లతో శుద్ధజల ప్రాజెక్టు చేపట్టి ఉద్దానం ప్రజల కష్టాలను జగన్ తీర్చారు – ఎమ్మెల్యే రెడ్డి శాంతి
పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిరాశ, నిస్పృహతో పాతపట్నం వాసులు కుమిలిపోయారని, జగన్ సీఎం కాగానే దీర్ఖకాలికంగా పెండింగ్ సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి బాటలు వేసారని కొనియాడారు. ప్రజలు నాడు టీడీపీకి అధికారమిస్తే అభివృద్ధి చేయకుండా దోచుకో…. దాచుకో రీతిలో అవినీతికి పాల్పడ్డారన్నారు. పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 1800 కోట్లు మంజూరు చేసారని వివరించారు

పాలకొండ ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ ఆశయాల సాధన లక్ష్యంగా సమానత్వంతో పాటుగా ఆర్థికంగా, సామాజికంగా సాధికారతను అందించేలా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ ఎంతో పట్టుదలతో ఉన్నారని, అందుకే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్నారని వివరించారు. గిరిజనులకు పోడు భూముల హక్కులిచ్చి గిరిజనుల బిడ్డగా నిలిచారని కొనియాడారు. గతంలో జగన్ ను గిరిజన ప్రాంతాలన్నీ ఆదరించాయని, వచ్చే ఎన్నికల్లో కూడా వైయస్సార్ సీపీని గెలిపించి ఈ ప్రాంతాల్లో జగన్ కు ఎవరూ సాటి లేరని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.

రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ, సమసమాజ స్థాపన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైందని, రాజ్యాంగ బద్దమైన పాలనను అందిస్తూ గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని వివరించారు. అనేక దుష్టశక్తులు మాయ మాటలతో ప్రజల ముందుకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారని, ప్రజలంతా గుర్తించి ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply