రైతులకు చేసిన మోసాన్ని కప్పిపెట్టేందుకు ఫుల్ పేజ్ ప్రకటనలు

– మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఫుల్ పేజ్ ప్రకటనలు గుప్పిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలపాటు యంత్రీకరణను పడుకోబెట్టారు. 3,800 ట్రాక్టర్లు ఇచ్చానని ఫుల్ పేజ్ ప్రకటనలిచ్చుకోవడం హాస్యాస్పదం. నిన్న సీఎం జగన్ యంత్ర సేవ పేరుతో రైతులను మళ్లీ వంచించారు. గతంలో రైతులకు ఇచ్చిన ట్రాక్టర్లనే వెనక్కి తెప్పించి బారులు తీర్చి బటన్ నొక్కడం రైతులను మోసం చేయడమే. 2 సంవత్సరాల క్రితం ఇచ్చినవి కూడా ఇప్పటి టార్గెట్ లో పెట్టారని రైతు లు తమ బాధను వ్యక్తం చేశారు. తాము దూర ప్రాంతాల నుంచి ట్రాక్టర్లను రోడ్లపైకి తీసుకు రావాల్సి వచ్చిందని బాధను వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో యాంత్రీకరణ పథకంకింద చిన్న ట్రాక్టర్ నుంచి పెద్ద ట్రాక్టర్ వరకు స్పేయర్, టార్పాలిన్ పట్ట నుంచి రోటివేటర్, కల్టివేటర్ వరకు రైతులకు ఇచ్చేవారం.

తెలుగుదేశం హయాంలో రైతు రథం పథకం కింద 2017-18 ఆర్థిక సంవత్సరంలో 12,736 టార్గెట్ పెట్టుకొని రైతులకు 12,208 ట్రాక్టర్లను పంపిణీ చేశాం. ఇందుకుగాను సబ్సిడీ కింద రూ.20 2 కోట్ల 16 లక్షలు ఖర్చు చేశాం. ఆ పథకంలోనే 2018-19లో మరో 11 వేల ట్రాక్టర్లు పంపిణీ చేశాం. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా, నేను మంత్రిగా ఉన్న రెండు సంవత్సరాల్లో 23 వేల రైతు రథాలు పంపిణీ చేశాం. 2017-18 సంవత్సరంలో రైతు రథం పథకం కాకుండా యాంత్రీకరణ పథకంలో స్మామ్ (smam) ద్వారా రూ.476 కోట్లు మంజూరు చేశాం. రూ.428 కోట్లు ఖర్చు చేశాం. 2018-19లో మెకనైజేషన్ అనే యాంత్రీకరణ కింద మరో రూ.280 కోట్లు ఖర్చు చేశాం. దీని ద్వారా ఈ ఒక్క సంవత్సరంలో 35,650 మందికి యంత్ర పరికరాలు అందజేశాం. చంద్రబాబునాయుడు హయాంలో ఇటు స్మామ్ smam యాంత్రీకరణ పథకం మరియు ఎస్డీఎఫ్ నుంచి రైతు రథం పథకానికి కలిపి సంవత్సరానికి సగటున రూ. 600 కోట్లు ఖర్చు పెట్టాం. మేము మా హయాంలో ఒక్క సంత్సరంలో మేం యాంత్రీకరణ పథకానికి ఖర్చు చేసిన మొత్తం మీరు 5 సంవత్సరాల్లో చేసి చూపండి. యాంత్రీకరణ పథకంలో నాలుగు సంవత్సరాల తరువాత రూ.175 కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు.

అన్న వచ్చాడు- క్రాప్ హాలిడే తెచ్చాడు :
రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు క్రాప్ హాలిడేకు సిద్ధపడ్డారు. ఇదంతా జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం. పంటలు పండించాలంటే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా వరకు పంటలకు నీరు ఇస్తామన్నా రైతులు కుర్రోమొర్రో మాకొద్దు అంటున్నారు. ఒక్క నెల్లూరు జిల్లాలో వంద టీఎంసీలు నీరు ఉన్నా రెండో పంటకు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో వాణి వినిపిద్దామని మీ ఉప ముఖ్యమంత్రి అనుకుంటున్నా శాసనసభలో వినిపించుకునే నాధుడు లేడని స్వయంగా ఆయనే పేర్కొనడం బాధాకరం. రైతుల సమస్యలపై జగన్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఇదేనా?

బిందు తుంపర సేద్యానికి మంగళం :
ఆంధ్రప్రదేశ్ లో బిందు తుంపర సేద్యానికి కూడా జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే మంగళంపాడారు. తుంపర సేద్యం వల్ల కలిగే లాభాలు, రైతులకు కలిగే లబ్ధి గురించి బీబీసీ అంతర్జాతీయ మీడియా తన వార్తల్లో ప్రసారం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ వ్యవసాయం చర్చలోకి వచ్చే విధంగా మార్పులు చేసిన ఘనత చంద్రబాబుదైతే. దీన్ని కూలదోయడం జగన్ రెడ్డి విధానం అని ప్రపంచం కోడై కూస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో రెండు దశాబ్దాల క్రితం ఇజ్రాయిల్ టెక్నాలజీని ఆంద్రప్రదేశ్ కు చంద్రబాబునాయుడు తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు 7లక్షల 38 వేల 659 ఎకరాల్లో బిందు తుంపర్ల సేద్యం అమలు చేశాం. జగన్ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలు బిందు తుంపర సేద్యాన్ని పడుకోబెట్టారు. టీడీపీ హయాంలో 2017-18లో రూ.12వందల కోట్లు ఖర్చు చేసి బిందు తుంపర సేద్యాన్ని దేశంలో మొదటి స్థానానికి తీసుకెళ్లాం. నేడు ఈ ప్రభుత్వం 2021-22లో 1190 కోట్లను కేటాయిస్తూ లక్షా 25 వేల ఎకరాలు టార్గెట్ పెట్టింది. 22-23లో 12 వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ఆనాటి మంత్రి కన్నబాబు శాసనసభలో ప్రకటించారు. కానీ పథకాన్ని పడుకోబెట్టారు. పథకాన్ని పూర్తిగా నిలిపేశారు. ఈ పథకానికి ఖర్చు పెట్టింది సున్న.

సూక్ష్మ పోషక పదార్థాల సరఫరా :
రాష్ట్రంలో సూక్ష్మ పోషక పదార్థాల (మైక్రో న్యూట్రియన్స్) సరఫరాను కూడా నిలిపేశారు. చంద్రబాబునాయుడు హయాంలో భూసార పరీక్షలు చేయించాం. లోపాలను గుర్తించి జింక్, జిప్సమ్, బోరాన్ లాంటి పోషక పదార్థాలను ఉచితంగా సరఫరా చేశాం. జగన్ ఈ పథకాన్ని కూడా నిలిపివేశారు. ఆ కారణంగా రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా దిగుబడులు తగ్గాయి.

జడ్పీఎన్ ఎఫ్ ప్రకృతి వ్యవసాయం :
జడ్పీఎన్ ఎఫ్ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా నిలిపేశారు.

మెగా సీడ్ పార్క్ :
చంద్రబాబునాయుడు హయాంలో అంతర్జాతీయ విత్తన సంస్థలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేందుకు మెగా సీడ్ పార్క్ కర్నూలుకు చెందిన తంగెడంచ గ్రామంలో మెగా సీడ్ పార్క్ ను మొదలుపెట్టాం. అయోవా యూనివర్శిటీ తో కలిసి వారి టెక్నాలజీ సపోర్టుతో 650 ఎకరాలు కేటాయించి 670 కోట్లతో మంజూరు చేశాం. అందులో ఫస్ట్ ఫేస్ 190 కోట్లతో బడ్జెట్ను అప్రోవల్ చేశాం. దాన్నీ నిలిపివేశారు. ఇవి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు సంబంధించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్నింటిని నిలిపివేయడం దుర్మార్గం. ధాన్యం మద్దతు ధర విషయంలో ఈ మూడు సంవత్సరాల్లో 3 వేల కోట్ల రూపాయలు ఒక్క నెల్లూరు జిల్లాలో రైతాంగం నష్టపోయింది. ధాన్యం పండించి కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం ఎంత నష్టమో అంచనా వేసుకోవాలి.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతాంగానికి స్లో పాయిజన్ ఇస్తూ కుదేలు చేశారు. వ్యవసాయ రంగం కుదేలైంది. పెట్టుబడులు పెరిగిపోయాయి. దిగుబడులు తగ్గాయి. పెట్టుబడులు బాగా పెరిగినా మద్దతు ధర లభించడంలేదు. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ లోని రైతుల్ని వంచించడం ఎంతవరకు సమంజసం?

రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు మెకనైజేషన్, ఎస్ డీ ఎఫ్, రైతు రథాలు, యాంత్రీకరణ, బిందు, తుంపర సేద్యం, డ్రిప్ ఇరిగేషన్, భూసార పరీక్షలు, ప్రకృతి వ్యవసాయం లాంటివాటికి ప్రోత్సాహం అందించాలని, అలాగే పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply