– మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు
రాష్ట్రంలోని వాల్మీకి/ బోయలను ఎస్టీల్లో చేర్చే అంశాన్ని అధ్యయనం చేయడానికి కొత్తగా ఏకసభ్య కమిషన్ నియామకం ద్వారా జగన్ రెడ్డి ప్రభుత్వం బోయలకు తీరని అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని బింటోఒరియా, వాల్మీకి/బోయలపై అధ్యయనానికి రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శామ్యూల్ ఆనందకుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తూ, జగన్ సర్కారు ఉత్తర్వులు విడుదల చేయడాన్ని బుధవారం ఒక ప్రకటనలో ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వాల్మీకి,బోయల చిరకాల వాంఛ నెరవేరేలా చూడాల్సిన సీఎం రాజకీయ కుట్రతో సమస్యను మరింత జటిలం చేస్తున్నారన్నారు. బోయల స్థితిగతులు తెలుసుకోవడానికి కొత్తగా కమిషన్ అవసరం లేదన్నారు. దీనివల్ల సమస్య పరిష్కారం కాకపోగా ‘రెడ్డోచ్చే మళ్ళీ మొదలెట్టు’ చందంగా సమస్య తిరిగి మొదటికొస్తుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీతో ఈ విషయంపై శాస్త్రీయంగా అధ్యయనం చేయించి అసెంబ్లీ తీర్మానం తరువాత కేంద్రానికి పంపిందన్నారు.
మూడున్నరేళ్లలో ఎప్పుడూ కేంద్రం వద్ద వాల్మీకి, బోయల ఎస్టీ అంశాన్ని కనీసం ప్రస్తావన కూడా చేయని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏకపక్షంగా ఇప్పుడు ఏకసభ్య కమీషన్ నియమించడంపై కాలవ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన సమయంలో ఇలా కమిషన్ ను నియమించడం రాష్ట్రంలో ఉన్న లక్షలాది వాల్మీకి/ బోయల భవిష్యత్తుకు మరణ శాసనం రాయడమేనని మండిపడ్డారు.
దీనివల్ల బోయజాతికి జగన్ తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. తక్షణమే ఈ జి.ఓ ను ఉపసంహరించుకొని, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్పించడానికి కృషి చేయకపోతే వాల్మీకుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని కాలవ హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది వాల్మీకి/ బోయల గొంతు కొస్తే చూస్తూ ఊరుకోమని, ఎలాగైనా తమ హక్కుల్ని సాధించుకుంటామన్నారు.