Suryaa.co.in

Editorial

‘జగన్నాధ’ రథచక్రాల కింద కమ్మ,కాపు నేతలు

  • వైసీపీ కమ్మ, కాపులను ఇరికించిన జగన్

  • దళిత నాయకులదీ అదే విషాదం

  • బాబు,లోకేష్, టీడీపీని వైసీపీ కమ్మనేతలతో తిట్టించిన వైసీపీ నాయకత్వం

  • పవన్, కన్నాపై వైసీపీ కాపు నేతలతో తిట్టించిన జగన్

  • మేఘా, షిర్డి సాయి వంటి రెడ్డి కంపెనీలకు మాత్రం వేల కోట్ల కాంట్రాక్టులు

  • రెడ్లకు సలహాదారు, సబ్ కాంట్రాక్టు పనులు

  • టీడీపీ-జనసేనపై దాడిలో రెడ్లను మినహాయించిన జగన్ తెలివి

  • విపక్షంలో అందుకు ఫలితం అనుభవిస్తున్న వైసీపీ కమ్మ, కాపు, దళిత నేతలు

  • ఇప్పుడు కమ్మ నేత వంశీ అరెస్టు, తలశిల, దేవినేని అవినాష్‌పై కేసులు

  • కాపు నేత పేర్ని నాని కుటుంబంపై కేసులు, చిక్కుల్లో అంబటి రాంబాబు

  • దళిత నేత నందిగం సురేష్ జైలుపాలు

  • జగన్ జైలుకు వెళ్లి పరామర్శల రాజకీయం

  • సోషల్‌మీడియాలో కులసంఘాల విమర్శల వర్షం

  • నేడు వంశీని పరామర్శించేందుకు జైలుకు వెళ్లనున్న జగన్

( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘వివిధ కేసులపై అరెస్టయి విజయవాడ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కమ్మ నాయకుడు వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సిద్ధమవుతున్నారు’’
– ఇదీ తాజాగా మీడియా, సోషల్‌మీడియాలో వచ్చిన ప్రకటన.

బాగానే ఉంది. చూసిన వారికి జగన్నాయకుడికి తన పార్టీ నాయకుడంతే ఎంత అభిమానం? ముఖ్యంగా కమ్మవారిపై ఎంత మమకారం? కమ్మ వారిని జగన్ వేధించారని జగనన్నపై అనవసరంగా దుష్ట్రచారం చేశారు. కానీ ఇప్పుడు చూడండి. వంశీని చూసేందుకు జైలుకు వెళుతున్నారు. ఆయన భార్యకు ఫోన్ చేసి నేనున్నా భయపడవద్దని ధైర్యం చెప్పిన జగన్ కమ్మ వ్యతిరేకి ఎలా అవుతారు? కమ్మవారిపై ఎంత అభిమానం లేకపోతే జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లి వంశీని పరామర్శిస్తారు? అన్న సందేహం ఆ దశ్యాలు చూడబోయే వారికి రాక తప్పదు. అసలు అలాంటి భావన కల్పించి, కమ్మ వర్గానికి చేరువయేందుకే జగనన్న జైలుకు వెళుతున్నారా? అన్నది మరికొందరి అనుమానం.

ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కులరాజకీయాలను విజయవంతంగా అమలు చేసిన జగన్ వ్యూహానికి, ఇప్పుడు అదే కులాలకు చెందిన నేతలు ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ-జనసేనకు చెందిన కమ్మ-కాపునేతలను.. వైసీపీలోని అదే కమ్మ-కాపు నేతలతో తిట్టించిన ఫలితం, ఇప్పుడు వైసీపీలోని కమ్మ-కాపు-దళిత నేతలు అనుభవంచాల్సిన దుస్థితి. కమ్మ నేతల్లో వంశీ, కొడాలి.. తలశిల రఘురాం, దేవినేని అవినాష్.. కాపుల్లో పేర్ని నాని, అంబటి రాంబాబు.. దళితులలో నందిగం సురేష్ , బీసీల్లో జోగి రమేష్ ఎక్సెట్రా.

మరి రెడ్లేమయ్యారు? ఏమయ్యారంటే.. మేఘా కృష్ణారెడ్డి, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వరరెడ్డికి వేలకోట్ల కాంట్రాక్టులు ధారాదత్తం చేశారు. అవసరం ఉన్నా, లేకపోయినా అన్ని కాంట్రాక్టులు-టెండర్లు వారికే పువ్వుల్లో పెట్టి అప్పగించారు. ఇసుక, లిక్కరు దందాను రెడ్లకే అప్పగించారు. లెక్కలేనంతమంది కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చారు. సలహాదారు పోస్టులిచ్చారు. డబ్బులొచ్చే స్థానాలన్నింటిలోనూ ‘రెడ్డి’కార్పెట్ వేశారు.

సరే.. కూటమి జమానాలోనూ అదే మేఘా, అదే షిర్డిసాయి కంపెనీలు మీసం మెలేసి మరీ చక్రం తిప్పుతున్నాయి. వాటికి జగన్ జమానాలో చేయి అందించి కాంట్రాక్టులు కట్టబెట్టించిన డీల్‌మేకర్ అయిన ‘పెద్దాఫీసరు’కు, సీనియర్లను కూడా కాదని, సర్కారులో ‘ఎత్తైన పీట’ కూడా వేశారనుకోండి. అదే వేరే ముచ్చట. మరిక్కడ బలయిపోయింది ఎవరు? ఎవరంటే..వైసీపీ లోని కమ్మ,కాపు, బీసీ, దళిత నేతలు. అంతేగా.. అంతేగా?! కమ్మ నేత వంశీతో జగన్మోహన్‌రెడ్డి ములాఖత్ నేపథ్యంలో.. సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న హాట్ టాపిక్ ఇది. దీనిపై కుల సంఘాలు పెడుతున్న పోస్టులే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

విజయవాడ జైలులో ఉన్న వల్లభనేని వంశీ అనే కమ్మ వైసీపీ నేతను.. జగన్ పరామర్శించే ముందురోజుల నాటి ముచ్చట ఇది. జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, విభజించి పాలించే సూత్రాన్ని కులాలపై ప్రయోగించి సక్సెస్ అయ్యారు. టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్, వారి కుటుంబసభ్యులను తిట్టేందుకు జగన్ తన పార్టీలోని అదే కమ్మ నేతలను ప్రయోగించారు.

వ ల్లభనేని వంశీ, కొడాలి నాని, వసంత కృష్ణప్రసాద్, ఎంపి సత్యనారాయణ, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌లతో టీడీపీ అధినేత కుటుంబాన్ని తిట్టించారు. వీరిలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాత్రం మిగిలిన వారిలా అనాగరికంగా కాకుండా, రాజకీయ విమర్శలు చేశారు. అయితే ఆయన మాజీ మంత్రి దేవినేని ఉమాపై మాత్రం నిప్పులు కురిపించారు. సీన్ కట్ చేస్తే, ఎన్నికల ముందు అదే వసంత టీడీపీలో చేరడం, దేవినేనికి ఎసరు పెట్టి ఆయనకు రావలసిన టికెట్ తీసుకుని గెలవడం జరిగిపోయింది.

వల్లభనేని వంశీ, కొడాలి నాని అయితే బాబు కుటుంబాన్ని దారుణంగా తిట్టిపోశారు. టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని నాని-వంశీ గళమెత్తారు. నిండుసభలో వారు బాబు భార్య భువనేశ్వరిని విమర్శించడంతో, బాబు మనస్తాపానికి గురయ్యారు. తాను మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని భీషణ ప్రతిజ్ఞ చేసి సభ నుంచి నిష్క్రమించారు.

తర్వాత రోజు పార్టీ ఆఫీసులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంలో.. బాబు భావోద్వేగానికి గురయి, ఏడ్చేశారు. ఇన్నేళ్ల బాబు రాజకీయ జీవితం చూసిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఆయన తొలిసారి ఆవిధంగా కన్నీళ్లు పెట్టుకోవడం షాక్‌కు గురిచేసింది. అంటే వైసీపీలోని కమ్మ నేతలతో జగన్, ఏ స్థాయిలో చంద్రబాబును తిట్టించారో స్పష్టమవుతుంది.

కొడాలి నానితో అయితే చంద్రబాబును వయసుకూ గౌరవం ఇవ్వకుండా.. వాడు,వీడు, నీచుడు, నికృష్టుడు అనే దారుణాతిదారుణ పదాలతో తిట్టించారు. ఈ స్క్రిప్టు అంతా నాటి మీడియా సలహాదారు కృష్ణమోహన్ ఆఫీసు నుంచే వైసీపీ కమ్మనేతకు వెళ్లేది. ఒక్క కమ్మనేతలకే కాదు. కాపు, బీసీ, దళిత నేతలు సైతం ఆ స్క్రిప్టునే ఫాలో అయ్యేవారన్నది బహిరంగమే.

ప్రధానంగా మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి సైతం కమ్మ, దళిత నేతలనే ప్రయోగించడం విశేషం. కమ్మవర్గానికి చెందిన దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, దళితనేత నందిగం సురేష్ వర్గీయులతో పార్టీ ఆఫీసుపై దాడులు చేయించారు. దానిపై ఇంకా కేసులు-విచారణ కొనసాగుతోంది. అయితే దీనికి నాటి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వ్యూహరచన చేశారని టీడీపీ బహిరంగంగానే ఆరోపించింది. పోలీసు సైతం సజ్జల వద్దకు వెళ్లిన తర్వాతనే వ్యూహరచన అమలు చేశారని చెబుతున్నారు.

ఇక అప్పట్లో వైసీపీకి కంట్లో నలుసుగా ఉన్న.. కాపు వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్, నాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణపై ఇదే అస్త్రం సంధించారు. అంటే వైసీపీలోని కాపు నేతలతోనే వారిద్దరినీ తిట్టించారు. అంబటి రాంబాబు, కన్నబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాధ్, అవంతి శ్రీనివాస్‌తో వారిని తిట్టించారు. బీసీ నేత జోగి రమేష్‌తో బాబు ఇంటిపై దాడికి ఉసికొల్పారు.

అమరావతిలో చంద్రబాబు నాయుడు పర్యటనలను అడ్డుకోవడం, బాబు కాన్వాయ్‌పై రాళ్లేయడం, అమరావతి గ్రామాల్లోని టీడీపీ, జనసేనకు చెందిన కమ్మ-కాపు నేతలపై దాడులు చేయించే బాధ్యతను, దళిత ఎంపి నందిగం సురేష్‌కు అప్పగించారు. ఈ విధంగా తన ప్రత్యర్ధులు ఏ కులం వారయితే, తన పార్టీలోని అదే కులం వారితో తిట్టించడం ద్వారా, కులరాజకీయాలను తెరలేపారు.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా రెడ్డి నేతలను భాగస్వాములను చేయకపోవడం చూస్తే, జగన్ ఎంత తెలివిగా ఈ కులసూత్రం అమలు చేశారో అర్ధమవుతుంది. ఈ విషయంలో ఒక్క సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విషయంలోనే, కొద్దిగా మినహాయింపు ఇచ్చారు. సోమిరెడ్డిపై తన పార్టీకి చెందిన రెడ్డినేతలతోనే విమర్శలు చేయించారు.

తన రెడ్డి సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్లకు జగన్మోహన్‌రెడ్డి వేలకోట్ల రూపాయల లబ్థి చేకూర్చారు. మేఘా కంపెనీకి నవయుగను తప్పించి పోలవరం కట్టబెట్టారు. కాకినాడ పోర్టును కెవిని బెదిరించి, దానిని విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడికి ఇప్పించారు. తన జిల్లాకు చెందిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి వేలాదిరూపాయల కాంట్రాక్టులు దోచిపెట్టారు. షిర్డిసాయి కంపెనీ జగన్ బినామీ అని విపక్షంలో టీడీపీ ఆరోపణలు కూడా చేసింది.

అవసరం లేకపోయినా వేల సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా చేయించారు. వందల ఎకరాల భూమిని అప్పనంగా కట్టబెట్టారు. ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా వారికి మాత్రం, బిల్లులు ఆగమేఘాలపై చెల్లించారు. ఇక కీలకమైన సలహాదారుల పదవులతోపాటు, కీలక శాఖలు, ఆదాయం వచ్చే కీలక పదవులన్నీ రెడ్లకే కట్టబెట్టడం ద్వారా వారిని ఆర్ధికంగా బలోపేతం చేశారు.

అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా జగన్ జమానాలో వెలిగిన మేఘా, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలకు పెండింగ్ బిల్లులను పువ్వుల్లో పెట్టి అప్పగించారు. అక్కడితో ఆగకుండా, పులివెందుల మునిసిపాలిటీ, కడప జిల్లాలో కాంట్రాక్టులు చేసిన రెడ్ల కంపెనీలకు పెండింగ్ బిల్లులన్నీ విజయవంతంగా పూర్తి చేయడమే ఆశ్చర్యం. పార్టీ ప్రముఖులు, సీఎంఓ అధికారులు, ఆర్ధికశాఖ ప్రముఖులు, కడప జిల్లాకు చెందిన టీడీపీ-బీజేపీ ప్రముఖుల ప్రమేయం లేకుండా, కీలకమైన బిల్లులు చెల్లించడం అసాధ్యమన్నది మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమయ్యేదే.

ఇప్పుడు కూటమి అధికారం వచ్చినప్పటికీ.. షిర్డిసాయికి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవడంలో గానీ, ఆ కంపెనీ పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించకపోవడం గానీ జరగడం లేదంటే.. జగన్ నాటిన మొక్క, ఏ స్థాయిలో మహావృక్షమయిందో తెలుస్తూనే ఉందన్న వ్యాఖ్యలు అటు కూటమి నేతల్లోనూ వినిపిస్తున్నాయి. మళ్లీ మేఘాకే పోలవరం అప్పగించడంపైనా ఇలాంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. టీడీపీ విపక్షంలో ఉండగా షిర్డిసాయి, మేఘాలపై చేసిన అవినీతి ఆరోపణలు, విజిలెన్స్ విచారణ హెచ్చరికలు ఏమయ్యాయన్నది పార్టీ శ్రేణుల ప్రశ్న.

సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి జైల్లో ఉన్న తన పార్టీ కమ్మ నేత వల్లభనేని వంశీ వద్దకు పరామర్శకు వెళుతున్నారు. అంతకుముందు జైల్లో ఉన్న దళిత నేత నందిగం సురేష్‌నూ గుంటూరు జైలుకు వెళ్లి కలిసివచ్చారు. వీరిద్దరూ చంద్రబాబును, ఆయన పార్టీపై దాడులు చేసిన వారే. పార్టీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ కమ్మ నేత దేవినేని అవినాష్ కూడా ముద్దాయిగా ఉన్నారు. మరో కమ్మ నేత కొడాలి నానిపైనా కేసుల ఉచ్చు బిగిసుకుంటోంది. విశాఖ మాజీ ఎంపి సత్యనారాయణ ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్నారు. సో.. జగన్ కోసం బట్టలు చించుకున్న వైసీపీ కమ్మనేతలు కష్టాల్లో ఉన్నట్లు కనిపిస్తూనే ఉంది.

ఇక కాపు నేత పేర్ని నాని, ఆయన భార్య, కుమారుడు ఇప్పటికే గోడ;న్ స్టాకుకు సంబంధించి పీకల్లోతు కేసుల్లో ఉన్నారు. వారికి బెయిల్ రావడంతో కొంత ఊరట. మరో కాపు నేత అంబటి రాంబాబు పోలీసు ఆంక్షల మధ్య గడుపుతున్నారు. బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పటికే చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఇరుక్కోగా, ఆయన కుమారుడిపై భూముల కుంభకోణం కేసు ఉచ్చు బిగిసిన విషయం తెలిసిందే.

దీన్నిబట్టి జగన్ రెడ్డి టీడీపీపై ఉసిగొల్పిన వైసీపీ కమ్మ-కాపు-బీసీ-దళిత నేతలందరూ .. కేసులతో పోలీసుస్టేషన్లు,కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

అదే సమయంలో జగన్మోహన్‌రెడ్డి వల్ల కాంట్రాక్టులు, పదవులు పొందిన రెడ్లు మాత్రం.. చీకూచింతా లేకుండా వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. సో.. వైసీపీని ఇంకా అభిమానించే అమాయక కమ్మ-కాపు-బీసీ-దళితులు ఇప్పటికయినా కళ్లు తెరవకపోతే, వారికీ వంశీ గతి ఖాయమని సోషల్‌మీడియాలో కథనాలు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా అసలు జగన్ వ ల్లే వంశీ రాజకీయ జీవితం నాశనం అయిందని కమ్మ సంఘాలే విరుచుకు పడుతుండటం విశేషం.

LEAVE A RESPONSE