– సీఎంకు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖ
ఏపీలో పరిశ్రమలకు శరాఘాతంగా మారిన పవర్ హాలిడేను ఎత్తేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఆ మేర కు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ.
గౌరవనీయులు
శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గార్కి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
అమరావతి
విషయం:- పరిశ్రమలు, ఉపాధి కల్పనా రంగాలని సంక్షోభంలోకి నెట్టే పవర్ హాలిడేని ఎత్తేయాలి.
అయ్యా!
పవర్‌లో వున్న మీరు పవర్ హాలీడే ప్రకటించడం చాలా సులువే. కానీ ఆ ప్రకటన చేసే ముందు కనీసం ఒక్క క్షణం రాష్ట్ర పరిస్థితి ఆలోచించారా? మొన్నటి వరకు కరోనా కష్టాలతో నష్టాల్లో నడిచిన పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కాస్త గాడినపడి పుంజుకుంటున్న సమయంలో పవర్ హాలిడే పాటించాలంటూ మీరిచ్చిన ఆదేశాలతో అన్నిరంగాలు సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయి. మీరు ప్రతిపక్షనేతగా వున్నపుడు కనీసం కరెంటు చార్జీలు ఒక్కసారి కూడా పెంచని టిడిపి ప్రభుత్వంపై.. ఎంతెంత బిల్లులు వేస్తారంటూ అవాస్తవాలు ప్రచారం చేశారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలోనే 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చారు.
5 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏనాడు కరెంట్ కోతలు లేవు. కానీ మీరు ముఖ్యమంత్రి అయ్యాక విద్యుత్ రంగాన్ని నాశనం చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు. మీరు సీఎంగా బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. కానీ ఈ 3 ఏళ్ల పాలన విధ్వంస విధానాలతో విద్యుత్ రంగం కోలుకోలేని విధంగా దెబ్బతింది. మీ అవగాహనారాహిత్యం, అనుభవలేమితో విద్యుత్ కొరత ఏర్పడి ఏకంగా పరిశ్రమలకు పవర్‌హాలీడే ప్రకటించే వరకూ దారి తీసింది. దీనివల్ల రోజుకు ఉత్పత్తి మూడో వంతుకు తగ్గించుకోవాల్సి దుస్థితి నెలకొంది.
పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేయడం ద్వారా నెలవారీ అద్దెలు, చెల్లించాల్సిన వాయిదాలు, అప్పులకు వడ్డీలు కట్టలేక యాజమాన్యాలు విలవిల్లాడుతున్నాయి. పరిశ్రమల్లో ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఓ వైపు కరెంటు కోతలు, మరోవైపు ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఏపీలో అధికంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వల్ల జనరేటర్లు నడపలేక కుటీర, చిన్న పరిశ్రమల నుంచీ పెద్ద పరిశ్రమల వరకూ అన్నీ మూత దిశగా సాగుతున్నాయి.
మీ ప్రభుత్వం ఏర్పడిన నుంచీ పారిశ్రామిక రంగానికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేకపోవడంతో కొత్తగా ఒక్క పరిశ్రమ రాకపోగా వైసీపీ నేతల వేధింపులు, జే ట్యాక్స్ ఇప్పుడు ఈ పవర్ హాలీడేతో ఉన్న పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకి తరలిపోతున్నాయి. మరి కొన్ని పరిశ్రమలు రాయితీలు లేకపోవటం, పెరిగిన విద్యుత్ చార్జీలు, పన్నులు బాదుడుతో ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. విద్యుత్ కోతలతో గ్రానైట్, ఆక్వా, పౌల్ట్రీ, వస్త్ర, ఆహార పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి.
మీరు ప్రకటించిన పవర్ హాలిడే వల్ల అన్నిరంగాలకీ చెందిన 10 లక్షల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఏటా వేసవికాలంలో విద్యుత్‌కి అధిక డిమాండ్ వుంటుందనే కనీస ఆలోచన లేకుండా విద్యుత్ ఉత్పత్తి – డిమాండ్‌పై అంచనాలు కూడా వేయకుండా..కోతలు మొదలయ్యాక కరెంటు కొంటామంటూ ప్రకటనలివ్వటం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగానే ఉంది. రాష్ట్ర అభివృద్ధి-ప్రజల ఉపాధి అవకాశాలు – ఆదాయం వంటి అంశాలపై లెక్కలేనితనం వల్లే అన్ని రంగాలూ కుదేలయ్యాయి.
వారంలో ఉన్న సెలవుకి తోడు మీరు ప్రకటించిన పవర్ హాలీడ్, కరెంట్ కోతలతో ఉపాధి కోల్పోయి కార్మికులు రోడ్డునపడుతున్నారు. పరిశ్రమలకు ఉత్పత్తి సామర్థ్యం, ఆర్డర్లున్నా పవర్ హాలీడేతో పూర్తిగా చేతులెత్తేసి ఆర్డర్ వదులుకుంటూ ఉసూరుమంటున్నాయి. పవర్ హాలీడే, కరెంటు కోతలతో ఉత్పత్తులు ఆగిపోవటం వల్ల రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ఆదాయం కోల్పోవడమే కాక లక్షలాది మంది కార్మికుల జీవప్రమాణాలు పూర్తిగా దిగజారిపోయే ప్రమాదం పొంచి ఉంది.
ఇప్పటికైనా ఉన్నతాధికారులతో సమీక్షించి పవర్ హాలీడేని ఎత్తేసే మార్గం ఆలోచించండి. వాణిజ్య, పరిశ్రమల వినియోగదారుల నెత్తిన పెను భారాన్ని మోపుతూ ఎనర్జీ డ్యూటీ ని 6 పైసల నుండి రూపాయికి పెంచి సుమారుగా రూ.3 వేల కోట్లు దోచుకునే నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోని కొన ఊపిరితో వున్న పరిశ్రమలని కాపాడండి.
నారా లోకేష్
(టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి)