– ప్రతిపక్షం అనే మాట ఉచ్చరించే అర్హత జగన్‌కు లేదు
– 20 సూత్రాల అమలు ఛైర్మన్ లంకా దినకర్ విమర్శ
విజయవాడ: జగన్ విధ్వంసం నుండి వికసిత ఆంధ్ర – స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధన ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పన వికసిత భారత్ లో భాగస్వామ్యం కావడానికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఊతం ఇస్తుందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత, 20 సూత్రాల అమలు ఛైర్మన్ లంకా దినకర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ బడ్జెట్ 2.94 లక్షల కోట్లలో అత్యధిక కేటాయింపులు చేసిన విద్య, నైపుణ్య రంగం, వైద్య, వ్యవసాయం, ఇరిగేషన్, పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, రాష్ట్ర రహదారులు కోసం మూలధన వ్యయం రూ. 32,712 కోట్ల రూపాయిలలో సింహ భాగం ఖర్చు చెయ్యాలనే ఉద్దేశ్యంతో పాటు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు మాచింగ్ నిధుల కూర్పు, స్థానిక సంస్థల నిధులు నేరుగా పంచాయితీలకు అందేలా చేయడం విశేషమన్నారు.
అభివృద్ధికి పెద్ద పీఠ వేస్తూనే వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం దాదాపు 23% బడ్జెట్ నిధులు కేటాయింపులు చేయడమంటే, ఈ వర్గాలను స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వామ్యం చేయడమని చెప్పవచ్చు. రాష్ట్ర జీఎస్డీపీలో 40 % పైగా వాటా ఉన్న వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 43,402 కోట్లు కేటాయించడం ద్వారా రైతు సంక్షేమ ప్రభుత్వంగా కనపడుతోందని పేర్కొన్నారు. జగన్ బడ్జెట్ సమావేశాలకు మొహం చాటేయడం బాధ్యత రాహిత్యం, బాధ్యత లేని వారికి ప్రతిపక్షం అనే మాట ఆచరించే అర్హత లేదు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇప్ప్పుడు మొహం చాటేశారు.