Suryaa.co.in

Andhra Pradesh

దళితులను దగా చేసిన ఏకైక సీఎం జగన్

 – టిడిపి హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు పాతర వేసిన జగన్
– రాష్ట్ర చరిత్రలో అధిక సంఖ్యలో దళితులపై దాడులు
-దళితులకు మాజీ మంత్రి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు  ఆనంద్ బాబు బహిరంగ లేఖ

18.01.2024
దళిత సోదరులకు బహిరంగ లేఖ
నిమ్నవర్గాల అభ్యున్నతికి జీవితకాలం కృషి చేసిన మహనీయుడు డా॥ బిఆర్‌ అంబేద్కర్‌. సంవత్సరాలపాటు రాత్రింబవళ్లు శ్రమించి అనేక దేశాల సామాజిక, ఆర్థిక జీవన విధానాలు అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా చేశారు. అటువంటి రాజ్యాంగాన్ని జగన్‌ ప్రభుత్వం పక్కనపెట్టి దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని నష్టాన్ని అయిదేళ్లలో జగన్‌రెడ్డి దళితులకు చేశారు.

దళితవాడలో అన్నివిధాలా వివక్షకు గురిచేశారు. అయిదేళ్లలో దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఉన్న పథకాలను నిర్వీర్యం చేయడంతోపాటు 300 మందికి పైగా దళితులను హతమార్చి ప్రశ్నించిన వారిపై వేలాది కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. ఇటువంటి అంశాలకు మసిపూసి మారేడుకాయ చేసేందుకే విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహం పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్న విషయాన్ని ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాము.

దళితులకు నేను మేనమామ.. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ మాటలు చెప్పి దళితులను జగన్‌రెడ్డి ఏ విధంగా వంచించారో ఈ అంశాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది.

1. బాబాసాహెబ్‌ డా॥ బిఆర్‌ అంబేద్కర్‌ స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా దశాబ్దాల కాలం నుంచి ఎస్సీల కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌, స్వయం ఉపాధి, ఎస్సీ కార్పొరేషన్‌ కింద రుణాలు, అంబేద్కర్‌ విదేశీ విద్య వంటి 28కి పైగా పథకాలను రద్దు చేసి అభివృద్ధికి, సంక్షేమానికి తూట్లు పొడిచారు.

2. 5 దళిత నియోజకవర్గాల మధ్య ఏర్పాటు చేసిన ప్రజా రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి దళితుల అభివృద్ధిని విధ్వంసం చేశారు. రాజధాని పూర్తయి ఉంటే అత్యధికంగా లబ్ది పొందేది… ఉపాధి పొందేది దళితులే.

3. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు విద్యుత్‌ ఉచితంగా అందజేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే సర్వే చేయించి లబ్దిదారుల సంఖ్య సగానికి కోత కోయడంతోపాటు దళిత వాడల్లో ఉంటేనే ఉచిత విద్యుత్‌ అమలవుతోందంటూ ప్రభుత్వం అవమానించింది.

4. దళితుల అభ్యున్నతికి గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్‌ భూములు సైతం బలవంతంగా ప్రభుత్వం లాక్కొంటోంది. గత అయిదేళ్లలో 12 వేల ఎకరాల అసైన్డ్‌ భూములను లాక్కొని వేలాది దళిత కుటుంబాలను రోడ్డున పడేశారు. దళితులను బెదిరించి ఈ భూముల్లో అక్రమంగా మట్టి గ్రావెల్‌ తవ్వకాలను యధేచ్ఛగా జరుపుతున్నారు.

5. 1989 నుండి అమలులో ఉన్న ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని కూడా నిర్వీర్యం చేశారు. ఈ చట్టం కింద ఎటువంటి జాప్యం చేయకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని చెబుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వ ఉదాసీనతతో ఈ అయిదేళ్లలో దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై నేరాలు చోటు చేసుకున్నాయి.

6. దళితులకు అండగా ఉంటానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దమనకాండ చేసిన నేరస్తులకు మేనమామగా మారి వారికి అండగా నిలబడ్డారు.
` దళిత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి, డోర్‌ డెలివరీ చేసి నేనే హత్య చేశానని ఒప్పుకున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును జగన్‌ పక్కన కూర్చోబెట్టుకుని సన్మానాలు చేయించడం దళితులను అవమానించడమే.

` మాస్క్‌ అడిగినందుకు విశాఖలో డా॥ సుధాకర్‌ను, అక్రమాలను ప్రశ్నించినందుకు చిత్తూరులో డా॥ అనితారాణిని, వేధింపులపై ప్రశ్నించినందుకు చీరాలలో కిరణ్‌ను… మద్యం రేట్లపై మంత్రి పెద్దిరెడ్డిని ప్రశ్నించిన ఓంప్రతాప్‌ను… కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చినందుకు కరుణాకర్‌ను… ఇలా వందలాదిమంది ప్రాణాలను బలిగొన్నారు.

7. ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు, విద్య, ఉపాధి ప్రమాణాలు పెంచేందుకు ఏర్పాటు చేసిన సబ్‌ప్లాన్‌ను నిర్వీర్యం చేశారు. టీడీపీ హయాంలో అయిదేళ్లలో రూ.7.08 లక్షల కోట్ల బడ్జెట్‌ ఖర్చు చేస్తే అందులో రూ.37,173 కోట్లు ఖర్చు చేస్తే… వైసీపీ ఈ అయిదేళ్లలో రూ.9.40 లక్షల కోట్ల బడ్జెట్‌ ఖర్చు చేస్తే… అందులో సబ్‌ప్లాన్‌ కోసం ఖర్చు చేసింది కేవలం రూ.30,028 కోట్లు మాత్రమే. జగన్‌ ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ నిధులను దారిమళ్ళించి పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు.

8. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధికి దూరంగా దళిత వాడలున్నాయి. గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టినా దళితవాడల్లోనే మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకుని 12 వేల కి.మీ. మేర సిమెంటు రోడ్లను 2 వేలకు పైగా వాటర్‌ ట్యాంకులను నిర్మించడం జరిగింది. ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క వాటర్‌ ట్యాంక్‌ కానీ, ఒక్క అడుగు రోడ్డు కానీ వేయలేదు. రోడ్లు, డ్రెయినేజి వ్యవస్థ వంటి మైలిక ప్రాథమిక వ్యవస్థ కూడా లేక దళిత వాడలు అస్తవ్యస్తంగా మారిపోయాయి.

9. దళిత యువకులు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడే ఎస్సీ కార్పొరేషన్‌ కుటుంబాలను పూర్తిగా నిలిపివేశారు. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి ప్రభుత్వ సలహాదారులకు ఏడాదికి చెల్లించిన వేతనంలో సగం కూడా వీటికి ఖర్చు చేయలేదు.

10. మెరిట్‌ ప్రకారం, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయాల్సిన మెడికల్‌ కాలేజీ సీట్లను కూడా దళితులకు తీవ్ర అన్యాయం చేశారు. 17 మెడికల్‌ కాలేజీల ద్వారా దళిత బిడ్డలకు దక్కాల్సిన 544 మెడికల్‌ సీట్లను కూడా జగన్‌రెడ్డి అమ్ముకుని దళితులను డాక్టర్లు కాకుండా అడ్డుకున్నారు.

11. ఎయిడెడ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేయడం, విదేశీ విద్యను ఆంక్షలతో అటకెక్కించడం, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ చెల్లింపులో జాప్యం చేసి విద్యను దళితులకు దూరం చేశారు.

12. జగన్మోహన్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం కోడి`కత్తి పేరుతో శ్రీను అనే దళిత యువకుడిని అయిదేళ్లుగా బెయిల్‌ కూడా రాకుండా వేధించడం జగన్మోహన్‌రెడ్డి యొక్క పెత్తందారీ పోకడలకు నిదర్శనం. కోడి`కత్తి శ్రీను కుటుంబ సభ్యులు విజయవాడలోని అంబేద్కర్‌ విగ్రహం వద్దే దీక్షకు దిగుతున్నారంటే ప్రభుత్వ కక్షపూరిత చర్యలు ఏ విధంగా ఉన్నాయో స్పష్టమవుతోంది.

13 జిల్లాలకు సమదూరంలో ఉండి రాష్ట్రం నడిబొడ్డున ఉన్న ప్రజా రాజధాని అమరావతిలో 25 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన అంబేద్కర్‌ స్మృతివనాన్ని అర్థాంతరంగా నిలిపివేసి రాజకీయ ప్రయోజనాల కోసం హడావుడిగా విజయవాడలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జగన్‌రెడ్డి పెత్తందారుకు నిదర్శనం. దళితుల్లో జగన్‌రెడ్డిపై పెరుగుతున్న వ్యతిరేకతను దారిమళ్ళించడానికే అంబేద్కర్‌ విగ్రహం పేరుతో మరో వంచనకు జగన్‌రెడ్డి కుట్ర పన్నారు. దళితుల హక్కుల కోసం, చట్టాల కోసం, నిధుల కోసం కలిసికట్టుగా పోరాడి జగన్‌రెడ్డి బుద్ధి చెప్పాలి.

జై భీమ్‌…
(నక్కా ఆనందబాబు)
పోలిట్‌బ్యూరో సభ్యులు

LEAVE A RESPONSE