Suryaa.co.in

Andhra Pradesh

తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్ దే

-మద్యాన్ని నిషేధిస్తామని హామీలిచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా?
-అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో పోటీ పడుతున్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు
-విలువలతో పనిచేస్తున్న మీడియా సంస్థల గొంతు నొక్కుతున్నయ్
-దొంగ ఓట్లతో మళ్లీ గెలిచేందుకు కుట్ర చేస్తున్న ఏపీ ప్రభుత్వం
-హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా స్పందించరా?
-టీటీడీ ఛైర్మన్ గత చరిత్ర ఏందంటే….
-ఇప్పుడున్న ఏపీలో మాదిరిగా దేశంలోనూ ఆనాడు బీజేపీని హేళన చేశారు…ఏమైంది?
-హేళన చేసిన పార్టీలే నామరూపాల్లేకుండా పోయాయి
-పాదయాత్రలను అడ్డుకుంటారా? గత పాలకులు తల్చుకుంటే మీరు పాదయాత్ర చేసేవాళ్లా?
-ప్రజాభిమున్న పవన్ కళ్యాణ్ యాత్రను అడ్డుకుంటారా?
-ఏపీలో అంతో ఇంతో ప్రజలకు మేలు జరుగుతోందంటే కేంద్రం ఇస్తున్న నిధులే కారణం
-వైఎస్సార్సీపీ కార్యకర్తలకు నా అప్పీల్…
-బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
-‘‘ఓటర్ చేతన్ మహాభియాన్’’ కార్యక్రమంలో వర్చువల్ ప్రసంగం చేసిన బండి సంజయ్
-ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డ సంజయ్
-అరాచక, అవినీతి ప్రభుత్వాన్ని నామరూపాల్లేకుండా చేయాలని పిలుపు

‘‘ఎవరైనా అభివ్రుద్ధిలో, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంలో పోటీ పడతరు. కార్పొరేట్ కాలేజీలు ర్యాంకుల కోసం ఒకటి…రెండు…మూడు అని పోటీ పడ్డట్లుగా… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మాత్రం అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో పోటీ పడి దోచుకుంటున్నాయి‘‘అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

‘‘నేను రూ.5 లక్షల కోట్ల అప్పు చేశానని తెలంగాణ సీఎం చెబుతుంటే.. నేనేం తక్కవ? 10 లక్షల కోట్ల రూపాయలకుపైగా అప్పు చేసిన. ఏటా వడ్డీల పేరుతో 50 వేల కోట్లు చెల్లిస్తున్నానని ఏపీ సీఎం చెబుతున్నరు డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలతో దోచుకుతింటున్నారు‘‘అంటూ మండిపడ్డారు.

మద్యం బాండ్ల పేరుతో తాగుబోతులను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల అప్పులు తెస్తున్న సర్కార్ ప్రపంచంలోనే లేదని, ఏపీ సర్కార్ కే ఆ ఖ్యాతి దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోందని, కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని మండిపడ్డారు.

‘‘ఓటర్ చేతన్ మహాభియాన్’’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం బండి సంజయ్ కుమార్ విజయవాడ వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఫ్లైట్ ఆలస్యం కారణంగా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని తన నివాసం నుండి వర్చువల్ ద్వారా ‘‘ఓటర్ చేతన్ మహాభియాన్’’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరిసహా పలువురు నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఓటర్ చేతన్ మహాభియాన్ ఉద్దేశాలతోపాటు ఓటరు నమోదు విషయంలో ఏపీలో జరుగుతున్న అక్రమాలపై బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు..

పురంధరేశ్వరి నాయకత్వంలో బీజేపీని ఏపీలో అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు. పురంధరేశ్వరి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆమె నాయకత్వంలో ఏపీలో బీజేపీ సత్తా చాటడం ఖాయం.

ఇప్పుడు ఏపీలో బీజేపీని హేళన చేసినట్లుగానే…. ఒకనాడు దేశంలో బీజేపీకి ఒక్క ఎంపీ కూడా లేరు? ఎట్లా అధికారంలోకి వస్తుందని హేళన చేశారు. అయినా బీజేపీ కార్యకర్తలు వెనుకాడలేదు. 2 ఎంపీలున్న పార్టీని ఈరోజు అధికారంలోకి రావడమే కాకుండా మోదీ నాయకత్వంలో రెండుసార్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినం. మూడోసారి అధికారంలోకి రాబోతున్నం. ఆనాడు బీజేపీని హేళన చేసిన పార్టీలన్నీ నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయినయ్. దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. ఏపీలో కూడా అవే పరిస్థితులు రాబోతున్నయ్. ఏపీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలున్నారు. మీరంతా పూర్తి సమయమిచ్చి, కష్టపడి పనిచేస్తే ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోంది. ప్రభుత్వంపట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. ఈసారి వైఎస్సార్ సీసీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రజల్లో భావన నెలకొంది. అయినా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమైంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉంది. అందులో భాగంగానే అనంతపురం జడ్పీ సీఈవోను సస్పెండ్ చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీరంతా అప్రమత్తంగా ఉండాలి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజలకు అంతో ఇంతో అభివ్రుద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే మోదీ ప్రభుత్వ సహకారంవల్లే. కేంద్రం ఇచ్చే నిధులతోనే అభివ్రుద్ధి జరుగుతోంది. కేంద్రమే స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు కట్టించింది. పేదలకు మంజూరైన లక్షలాది ఇండ్లకు నిధులు మంజూరు చేస్తోంది.= జాతీయ రహదారులను నిర్మిస్తోంది కేంద్రమే. గ్రామీణ సడక్ యోజన నిధులు కేంద్రానివే. స్మార్ట్ సిటీ నిధులు కేంద్రానివే. కానీ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వాటి పేర్లను మార్చి, ఫోటోలు మార్చి వాళ్ల పథకాలుగా చిత్రీకరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.

ఏపీలో జగన్ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అప్పులు, అవినీతిలో ప్రగతి మాత్రమే…. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల అప్పు చేస్తే… జగన్ ప్రభుత్వం అంతకు రెట్టింపు అంటే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. వడ్డీ రూపంలోనే ఏటా రూ.50 వేల కోట్లు చెల్లిస్తున్నారు. అయినా జీతాలిచ్చే పరిస్థితుల్లో లేరు. పారిశుధ్య కార్మికులకు వేతనాలివ్వడం లేదు. అవినీతిలో, అప్పుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నరు.

నేను రూ.5 లక్షల కోట్ల అప్పు చేశానని కేసీఆర్ చెబుతుంటే.. మేం 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశానని ఏపీ సీఎం చెబుతున్నారు. కార్పొరేట్ కాలేజీలో ర్యాంకుల కోసం పోటీ పడుతుంటే… ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అవినీతి, అప్పుల్లో మేమే నెంబర్ వన్ అంటూ పోటీ పడుతున్నయ్.

మద్యం దరఖాస్తుల ద్వారానే 2500 కోట్లకుపైగా సంపాదించానని కేసీఆర్ చెబుతుంటే… ఏకంగా మద్యం బాండ్ల పేరుతో తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గతంలో ఏదే వైఎస్సార్సీపీ గత ఎన్నికల్లో దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చింది. అందుకు భిన్నంగా మద్యం బాండ్లతో అప్పు చేసుకునే దుస్థితి.

అంతేగాకుండా గంజాయి స్మగ్లర్ల కు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారింది. దేశంలో అత్యధిక గంజాయి స్మగ్లర్లు ఏపీలోనే ఉన్నారని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. ఏపీ ఆదాయం 1 లక్షా 30 వేల కోట్లు అయితే.. అందులో 40 వేల కోట్లు కేంద్రమే ఇస్తోంది.

ఏపీలో హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నరు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్లో అడగడుగునా ఆందోళన స్రుష్టిస్తూ రాకుండా చేస్తున్నారు. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా? వెంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలి.

కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్ ఎవరండీ… ఆయన బిడ్డ పెళ్లి క్రైసవ ఆచార పద్దతిలో చేసిన మాట నిజంకాదా? నేను నాస్తికుడని ఆయన గతంలో చెప్పలేదా? ఆయన రాడికల్ కాదా? ఇంకా సిగ్గు లేకుండా తిరుమలతో అడవులున్న విషయమే తెల్వదని టీటీడీ ఛైర్మన్ చెబుతున్నడట… మరి ఆయనకు ‘‘పుష్ప’’ సినిమా చూపించాలేమో…

మనం ఎన్ని రోజులు బతికామన్నది ముఖ్యం కాదు… బతికినన్ని రోజులు హిందూ ధర్మాన్ని కాపాడేందుకు నేను ఏం చేశానని గుండెమీద చేయి వేసుకోవాలి. ధర్మం కోసం పనిచేసి సమాజం గుర్తించేలా చేయాలే తప్ప వందల వేల కోట్లు సంపాదించినంత మాత్రాన గుర్తింపు రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

బొట్టు పెట్టుకున్నంత మాత్రాన, కంకణం కట్టుకున్నంత మాత్రాన హిందువులం కాదని తెలుసుకోవాలి… హిందూ మతాన్ని అడ్డుకునే వాళ్లను, హిందూ దేవతలకు అవమానం జరుగుతున్నా, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా పట్టించుకోకపోతే హిందువులం ఎలా అవుతాం? ఇవన్నీ పైవాడు చూస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఏపీలో విచ్చలవిడిగా మతమార్పిడులు జరుగుతున్నయ్. మైనారిటీ సంతుష్టీకరణ విధానాలు అమలవుతున్నాయి. కోర్టు ధిక్కరణ కేసుల్లోనూ ఏపీ నెంబర్ వన్ గా ఉంది. దేశంలో కోర్టు ధిక్కరణ కేసులు 28 వేలకుపైగా ఉంటే… ఏపీలోనే 11 వేల 348 కేసులున్నాయంటే… ఏపీలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఖూనీ అయిందో ఒక్కసారి ఆలోచించండి.

ఏపీలో చేయని దందా లేదు. డ్రగ్స్ దందా జరుగుతోంది. ఇసుకు దందా, భూకబ్జాలు జరుగుతున్నయ్. కొండలను కూడా మాయం చేస్తున్నారు. ఒక వర్గానికే కొమ్ముకాస్తూ అరాచక పాలన కొనసాగిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని నామరూపాల్లేకుండా చేయాలి.

నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరారు. పవన్ కళ్యాణ్ ప్రజాభిమానం ఉన్న నేత. ప్రజా సమస్యలపై జనంలోకి వెళుతుంటే ఆయనను అడ్డుకోవడం దారుణం. ఆనాడు దొంగ పాదయాత్రలతో జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు నిజమైన పాదయాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్న ప్రతిపక్ష పార్టీలను అడ్డుకుంటూ పాదయాత్రలను అపే కుట్ర చేస్తున్నారు.

విలువలతో నడుస్తూ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న మీడియా సంస్థల గొంతు నొక్కే యత్నం చేస్తున్నరు. ఆ సంస్థలకు కులాన్ని, వ్యక్తులకు అంటగడుతున్నారు.రెండు రాష్ట్రాలు విడిపోయాయి. మనమధ్య మనస్పర్తల్లేవ్. అందరం బాగుండాలని అనుకుంటున్నం. కానీ ఏపీ, తెలంగాణ సీఎంలు మాత్రం దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. మళ్లీ అధికారంలోకి రావడానికి మళ్లీ ప్రాంతీయ విద్వేషాలు రగిలించేందుకు కుట్ర చేస్తున్నారు.

రెండు రాష్ట్రాల్లోని ప్రజలకు నేను విజ్ఝప్తి చేస్తున్నా… కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నరు. రాజకీయ పార్టీల నేతలను కుల సంఘాల నేతలుగా చిత్రీకరిస్తూ సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తున్నరు. దయచేసి కులాలను పక్కనపెట్టండి. 10 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వాటిని ఎలా తీరుస్తుందో ఆలోచించండి. అదే బీజేపీకి అధికారమిస్తేనే.. కేంద్ర సహకారంతో అప్పులు తీర్చడంతోపాటు రాష్ట్రాన్ని అభివ్రుద్ది చేయడం సాధ్యమవుతుందనే వాస్తవాలను గమనించాలి.

నేను వైఎస్సార్సీపీ కార్యకర్తలకు కూడా అప్పీల్ చేస్తున్నా… మీరు హిందువులుగా ఆలోచించండి. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నయ్. దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. హిందూ పండుగలను చులకనగా చూస్తున్నారు. ఒక మతానికే కొమ్ముకాస్తూ ఆ మతమే అధికారం చెలాయించాలని చూస్తున్నారు. వాటిని ఇంకెంత కాలం సహిస్తారు? జెండాలు, ఎజెండాలను పక్కనపెట్టి సంతూష్టీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం రండి…

మోదీ నాయకత్వంలో కేంద్రంతోపాటు ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ను ఏర్పాటు చేద్దాం.. తద్వారా ఏపీని శక్తివంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం. ఏపీలో బీజేపీ కార్యకర్తలు… వెంకన్న భక్తులు. శివాజీ, అంబేద్కర్, మోదీ వారసులు మీరు.. ధర్మం కోసం పనిచేసే వాళ్లు. రామరాజ్య స్థాపన కోసం పనిచేసే వాళ్లు. ఓటర్ నమోదు కార్యక్రమంతోపాటు ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని కోరుతున్నా.

LEAVE A RESPONSE