– ఇప్పటివరకూ ఎన్‌ఐఏ కోర్టుకు హాజరుకాని జగన్
– కోడికత్తి శీను ఒక్కరే హాజరు
– ఇప్పటికి 20 వాయిదాలకు జగన్ డుమ్మా
– సీఎంగా ఉన్నప్పుడు సెక్యూరిటీ సమస్యలన్న సాకు
– ఇప్పుడు జైళ్లకు వెళ్లి నేతలను పరామర్శిస్తున్న వైచిత్రి
– అయినా పట్టించుకోని ఎన్‌ఏఐ కోర్టు
– సాక్షి కోర్టుకు హాజరుకానవసరం లేదా?
– మరి కోడికత్తి శీనును ఎన్నాళ్లు కోర్టుకు తిప్పుతారు?
– సీబీఐ కేసులోనూ కోర్టుకు హాజరుకాని జగన్
– మినహాయింపుతో కోర్టుకు డుమ్మా కొడుతున్న వైనం
– ఈ వెసులుబాటు కోర్టులు సామాన్యులకూ ఇస్తాయా?
– జగన్‌కే ప్రత్యేకమా అంటున్న సామాన్యుడు
– మాజీ ప్రధాని పివి కంటే జగన్ గొప్పవాడా?
– తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
– జగన్ కోర్టు మినహాయింపుల ప్రత్యేకత ఏమిటి?
( మార్తి సుబ్రహ్మణ్యం)
కోర్టులు గొప్పవా? వ్యక్తులు గొప్పవారా? అంటే కచ్చితంగా కోర్టులే గొప్పవి.
మరి కోర్టులు గొప్పవా? జగన్ గొప్పవాడా? అంటే నిస్సందేహంగా జగనే గొప్పవాడు.
అదేంటి? వ్యక్తుల కంటే కోర్టులే గొప్పవయినప్పుడు.. జగన్ అనే వ్యక్తి ఎలా గొప్పవాడవుతాడనే కదా మీ సందేహం?
యస్. జగన్ ఒక వ్యక్తి కాదు. ఒక శక్తి. ఒక వ్యవస్థ. అందుకే కోర్టుల కంటే జగనే మహాగొప్ప. అందుకు గత పదేళ్ల నుంచి కోర్టుల్లో కనిపిస్తున్న దృశ్యాలు.. వినిపిస్తున్న తీర్పులు.. ఇస్తున్న మినహాయింపులే సజీవ సాక్ష్యాలు. సీబీఐ కేసు విచారణకు మినహాయింపు.. ఎన్‌ఐఏ కేసులో కోర్టుకు రాకుండా మినహాయింపు.. ఇలా ఒకటేమిటి? జగనన్నకు అన్నీ మినహాయింపులే. మరి ఈ వెసులుబాటు ఏ పుల్లారావుకో, సుబ్బారావుకో ఉంటుందా? అంటే.. ఉండదు. ఎందుకంటే కోర్టులు కఠినంగా ఉంటాయి కాబట్టి! ఇది నిఖార్సయిన నిజం!!
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలులో ఉన్నప్పుడు కోర్టు ఆదేశాలతో బెయిల్‌పై బయటకొచ్చారు. సాక్షులను ప్రభావితం చేయకూడదని, ఎవరినీ బెదిరించకూడదని, అలా చేస్తే బెయిల్ రద్దవుతుందని సహజంగా ఉండే నిబంధనపై జగన్ కూడా సంతకం చేశారు. అంటే ప్రస్తుతం ఆయన బెయిల్‌పైనే ఉన్నట్లు లెక్క. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినా, తర్వాత గెలిచి సీఎం అయ్యారు. ఆ సందర్భంలో ప్రతి శుక్రవారం జరుగుతున్న సీబీఐ కోర్టుకు.. ఆయన సహ నిందితులయిన అధికారులు, ప్రజాప్రతినిధులు క్రమం తప్పకుండా హాజరుతున్నారు.
కానీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మాత్రం ఏళ్ల తరబడి హాజరుకావడం లేదు. తాను సీఎంగా ఉన్నందున, ప్రతి వారం కోర్టుకు హాజరవుతే సెక్యూరిటీ సమస్యలు వస్తాయని.. దానితోపాటు బోలెడు ప్రజాధనం వృధా అవుతుందన్న ‘అద్భుత వాదన’ను కోర్టువారు పెద్ద మనసుతో మన్నించి.. సరే నీకు మినహాయింపు ఇస్తున్నాం. నీ బదులు నీ న్యాయవాది హాజరుకావాలని అదే విశాల హృదయంతో వెసులుబాటు కల్పించారు. బహుశా కోరు కూడా.. అంతలావు ముఖ్యమంత్రిని కోర్టుకు పిలిపించడం ఏం బాగుంటుందని ఫీలయిందో ఏమో?!
అంతవరకూ బాగానే ఉంది. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నందున కోర్టుకు వస్తే సెక్యూరిటీ సమస్యలు వస్తాయన్న అదే జగన్.. గత ఎనిమిది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రిగా మారారు. అంటే ఆయన పార్టీ ఓడిపోయిందన్న మాట! ఆ ప్రకారంగా మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కానట్టే కదా? అలాంటప్పుడు దయగల కోర్టు ప్రభువులు.. ‘జగనబ్బాయ్.. అప్పుడంటే నువ్వు సీఎంవి కాబట్టి నీ వాదనలు ఆలకించి మినహాయింపు ఇచ్చాం. ఇప్పుడు నువ్వు ఉత్తి పులివెందుల ఎమ్మెల్యేవి మాత్రమే. ప్రతిపక్ష నేతవి కూడా కాదు. కాబట్టి అర్జెంటుగా వచ్చే శుక్రవారం నుంచి నీ సహనిందితులతోపాటు కోర్టు బోనులో నిలబడాల్సిందే’నని కదా ఆదేశించాల్సింది? సహజంగా పామరులు కూడా కోర్టు నుంచి అలాంటి తీర్పే ఆశిస్తారు కదా?
మరి ఇప్పటివరకూ సీబీఐ కోర్టు వారు అలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదు? సరే.. జగనంటే తాను ఇంకా ముఖ్యమంత్రిని అన్న భావనతోనే ఉంటారు. జనం తనను ఓడించి తప్పు చేశారనుకుంటారు. ఈవీఎంలు మాయ చేసి తనను ఓడించినా తనకు 40 శాతం ఓట్లు వచ్చినందున, ఇంకా తానే సీఎంనని మానసికంగా భావిస్తుండవచ్చు. అందులో తప్పులేదు. ఎవరి ప్రపంచంలో వారు బతుకుతుంటారు.
కానీ సీబీఐ కోర్టు అలా అనుకోకూడదు. అనుకోదు కదా? అన్నది బుద్ధిజీవుల వ్యాఖ్య. పైగా సుప్రీంకోర్టు కూడా జగన్ సహా, ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఏడాదిలోగా తెమల్చమని తీర్పు కూడా ఇచ్చిందాయె? మరి జగన్‌కు ఇచ్చిన కోర్టు విచారణ హాజరు మినహాయింపును రద్దు చేయడానికి సీబీఐ కోర్టుకు ఉన్న అడ్డంకి- మొహమాటం ఏమిటో అర్ధం కావడం లేదని, అటు నల్లకోటు వేసుకున్న న్యాయనిపుణులూ తెల్లబోతున్నారు.
ఇక సీబీఐ కోర్టు హాజరును పక్కనపెడితే.. కోడికత్తి కేసు విచారిస్తున్న, ఎన్‌ఐఏ కోర్టులోకి అడుగుపెడదాం. జగనన్న విపక్ష నేతగా ఉన్నప్పుడు.. ఎన్నికల సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టులో ఆయనపై శీను అనే యువకుడు కోడికత్తితో దాడి చేసి, గాయపరిచారు. గాయమంటే.. ఎయిర్‌పోర్టులో ఉన్న ఫస్ట్‌ఎయిడ్ బాక్స్, సమీపంలో ఏ ఆర్‌ఎంపీ డాక్టర్ దగ్గరకు వెళ్లినా కట్టుకట్టేంత గాయమన్నమాట!
అయినా సరే.. జగనన్న వైజాగ్ ఆసుపత్రికి కాకుండా విమానమెక్కి, హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. సహజంగా రక్తంతో ఉన్న మనిషిని విమానంలోకి అనుమతించరు. అది నిబంధనకు విరుద్ధుం. సరే. అప్పట్లో వైసీపీ-బీజేపీ భాయ్ భాయ్ కాబట్టి ఆ నిబంధన అడ్డువచ్చి ఉండదు. పోనీ హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి జగన్ దగ్గరకు వెళ్లిన పోలీసులకు, ఆయనేమైనా వాంగ్మూలం ఇచ్చారా అంటే అదీ లేదు. ‘‘నేను మీ ఏపీ పోలీసులను నమ్మనే నమ్మను. మీకు స్టేట్‌మెంట్ ఇచ్చేదిలేది పొమ్మని’’ ఏపీ పోలీసులను వెళ్లగొట్టారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్.. అదే పోలీసు సేవలను అడ్డగోలుగా వాడుకున్నారు. అది వేరే విషయం.
జగనన్నపై కోడికత్తితో దాడి చే సిన శీను అనే యువకుడిని.. చావచితక్కొట్టి బొక్కలో వేసిన పోలీసులు, అతగాడిని జైలుకు పంపించారు. దీనిని విచారణకు స్వీకరించిన ఎన్‌ఐఏ పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. చివరాఖరకు కోడి కత్తి శీను కేసులో పసలేదని, ఇందులో కుట్ర, హత్యకోణం లేదని తేల్చేశారు. కొన్నేళ్ల తర్వాత ఇచ్చిన ఈ నివేదికతో, ముద్దాయిగా ఉన్న కోడికత్తి శీనును ఏమైనా వెంటనే విడుదల చేశారా అంటా అదీ లేదు. పాపం అతగాడు బెయిల్ కోసమే ఏళ్లపాటు చకోరపక్షిలా వేచిచూడాల్సి వచ్చింది.
ఎందుకంటే బాధితుడు జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇవ్వలేదు కాబట్టి. గతంలో సీబీఐ కోర్టుకు రావాలని ఆదేశిస్తే.. ఎక్కడో ఉన్న హైదరాబాద్‌కు రావాలంటే.. సెక్యూరిటీ సమస్య- ప్రజాధనం వృధా అని సాకులు చెప్పిన జగనన్న, తాడేపల్లికి సమీపంలోనే ఉన్న ఎన్‌ఐఏ కోర్టుకూ రాకపోవడమే వింత. ‘‘మీరు అంతగా నన్ను చూడాలనుకుంటే కోర్టు అధికారిని ఇంటికి పంపించి.. నా సాక్ష్యాన్ని నమోదు చేసుకో’’మని, జగనన్న ఎన్‌ఐఏ కోర్టుకే బంపర్ ఆఫర్ ఇచ్చారు. న్యాయవ్యవస్థలో ఇలాంటి బంపర్ ఆఫర్లు ఉంటాయని, అప్పటికి చాలామంది లాయర్లకూ తెలిసి ఉండకపోవచ్చు!
అది ఇంకా కోర్టులో నలుగుతూనే ఉంది తప్ప, జగనన్న బెజవాడలోనే ఉన్న ఎన్‌ఐఏ కోర్టుకు మాత్రం రాకుండా ముఖం చాటేస్తూనే ఉన్నారు. జగన్ వచ్చి సాక్ష్యం చెబితే తప్ప, కోడికత్తి శీనుకు మోక్షం ఉండదు. కానీ జగన్ రారు. ఆ కేసు తేలదు. దానిపై దయగల కోర్టు వారు కూడా ఏమీ తేల్చరు. జగన్ సాక్షిగా హాజరుకావడం లేదు కాబట్టి ఈ కేసు కొట్టివే స్తున్నామని తీర్పు ఇవ్వదు.
అయినప్పటికీ, సీబీఐ కోర్టు మాదిరిగానే ఎన్‌ఏఐ కోర్టు కూడా జగనన్నపై పెద్దమనసు చూపడం, న్యాయస్థానాల విశాల హృదయానికి నిలువెత్తు నిదర్శనం. మరి ఎవరన్నారు.. కోర్టులు చాలా కఠినంగా వ్యవహరిస్తాయని?.. ఇంత ఉదారత చూపిస్తుంటే!
సరే.. బెజవాడలోనే ఉన్న ఎన్‌ఐఏ కోర్టుకు వెళ్లని జగనన్న.. పక్కన ముప్పావుగంట ప్రయాణం చేస్తే వచ్చే గుంటూరు జైలుకు, ఐదు నిమిషాల్లో చేరగలిగే బెజవాడలోని గాంధీనగర్ జైలుకు మాత్రం బాగానే వెళుతున్నారు. బెజవాడలోని ఎన్‌ఐఏ కోర్టుకు వెళితే వచ్చే లా అండ్ ఆర్డర్ సమస్య.. గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్‌ను, బెజవాడ జైల్లో ఉన్న వంశీని పరామర్శించేందుకు మాత్రం ఉండదా?
అన్నది బుద్ధిజీవుల సందేహం. అయినా ఒక దళితుడైన కోడి కత్తి శీనును, అమానవీయంగా ఏళ్ల తరబడి జైల్లో ఉంచి.. అదే దళితులపై దాడి కేసులో అరెస్టయిన వంశీని పరామర్శించడం ఏమిటో జగనన్నకే తెలియాలి. మరి జగనన్న దళితులను సమర్ధిస్తున్నట్లా? వ్యతిరేకిస్తున్నట్లా?
అసలు కోర్టు హాజరు విషయంలో సామాన్యులకు, వీఐపీల వివక్ష ఎందుకు? చట్టం అందరికీ సమానమైనప్పటికీ, ఒకరికే చుట్టంగా మార్చడం ఏమిటి? అంటే వైద్యులు పర్సు చూసి వైద్యం చేసినట్లు.. కోర్టులు వ్యక్తుల స్థాయిని బట్టి వ్యవహరిస్తాయా అన్నది మేధావుల ప్రశ్న.
పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో యూరియా స్కామ్‌లో కోర్టు విచారణకు హాజరయ్యారు. మరి సీఎంలే ఇన్ని వెసులుబాట్లు తీసుకుంటే ప్రధాని ఇంకెన్ని వెసులుబాట్లు వాడుకోవాలి? కానీ తానొక ప్రధానమంత్రినన్న భావన పక్కనపెట్టి, చట్టాన్ని గౌరవించి కోర్టుకు హాజరయ్యారు. మరి పివి ంటే జగన్ గొప్పవారా? అందాకా ఎందుకు? తాజాగా ఎన్నికల కేసుకు సంబంధించి ప్రజాప్రతినిధుల కోర్టుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఎలాంటి భేషజం లేకుండా హాజరయ్యారు. అంతేగానీ ఆయన కూడా జగన్ మాదిరిగా..నేను కోర్టుకు హాజరయితే సెక్యూరిటీ సమస్యలు వస్తాయని తప్పించుకోలేదు. కోర్టుకు ప్రజాప్రతినిధులే విలువ ఇవ్వనప్పుడు సామాన్యుల నుంచి గౌరవం ఎలా ఆశిస్తారన్నది బుద్ధిజీవుల ప్రశ్న. ఇప్పుడు చెప్పండి బ్రో.. కోర్టుల కంటే జగన్ గొప్పవాడా? కాదా?!