Suryaa.co.in

Editorial

విజయసాయికి జగన్ ఝలక్

– విజయసాయిని వాడుకుని వదిలేసిన జగన్
– బాబాయ్‌కే పార్లమెంటరీ పార్టీ పెత్తనం
– మూడు పదవులకూ ‘రెడ్డి’ కార్పెట్
– మాటలు బీసీ,దళితులవి చేతలేమో రెడ్లకు
– బయటపడ్డ జగన్ ‘సామాజిక న్యాయం’
( మార్తి సుబ్రహ్మణ్యం)

సామాజిక న్యాయం.. రాజకీయాల్లో ఇదో కుల అస్త్రం. కుల నినాదం. అప్పట్లో ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి అయితే, దీనినే ట్యాగ్‌లైన్‌గా పెట్టుకున్నారు. సామాజిక న్యాయం అంటే.. సమాజంలో వెనుకబడి ఎవరూ పట్టించుకోని వర్గాలకు న్యాయం చేయడం అనేది రాజకీయ అర్ధం. అయితే గత ఐదేళ్లలో ఏపీ సీఎంగా చేసిన జగన్మోహన్‌రెడ్డి చేసిన ‘సామాజిక న్యాయం’, దేశంలో మరే నాయకుడూ చేసి ఉండకపోవచ్చు. అదెలాగో చూద్దాం.

జగన్ సీఎంగా ఉన్నప్పుడు సామాజిక న్యాయం పేరిట కొన్ని వందలమంది ఎస్సీ, బీసీలకు పదవులిచ్చారు. కానీ వారికి అవన్నీ కంటితుడుపే. కుర్చీ లేని పదవులు. ఆఫీసు లేని కుర్చీలు. బల్లలు లేని కుర్చీలు. కానీ తన సామాజికవర్గ న్యాయాన్ని మాత్రం జగన్‌రెడ్డి ‘నిఖార్సుగా, చాలా స్ట్రిక్టుగా’ అమలు చేశారు. మంత్రివర్గంలో కీలక శాఖలన్నీ రెడ్లకే ఇచ్చి గౌరవించారు. కీలకమైన కార్పొరేషన్లు మొత్తం రెడ్లకే కట్టబెట్టి వారిని మెప్పించారు.

సీఎంఓలో మిగిలిన సామాజికవర్గ అధికారులను నియమించినా, ఇం‘ధనం’ నింపే పదవిని మాత్రం రెడ్డిగారికే ఇచ్చారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి ఆర్డీఓల వరకూ రెడ్డిసారే మాట్లాడేవారు. ఎమ్మెల్యేలు ఎవరైనా వారిపై ఫిర్యాదు చేస్తే.. వాళ్ల సంగతి మీకెందుకు? మీకేం కావాలో చేసుకోండని చెప్పేవారు. బాగా ఆదాయం, అన్ని రూపాల్లో గిరాకీ ఉండే ప్రాంతాలకు రెడ్లనే కలెక్టర్లు, ఎస్పీలుగా నియమించారు. దండిగా ఆదాయం ఉన్న విశాఖ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లుగా ‘తన కలెక్టర్ల’నే నియమించుకున్నారట.

భారతమ్మగారు విశాఖలో ముచ్చటపడ్డ ఒక పెద్ద భవంతిని ఆమెకు కానుకగా ఇచ్చేందుకు, ఈ రెడ్డిగారు చేయని ప్రయత్నం- బెదిరింపులు లేవట. చివరాఖరకు కోట్లాదిభక్తుల గుండెల్లో కొలువుదీరిన టీటీడీలో సైతం.. చైర్మన్, ఈఓ, జేఈఓలను కూడా రెడ్లనే వేసుకున్నారు. ఐఏఎస్ ప్రమోషన్లు కూడా రెడ్లకే బహుమతిగా ఇచ్చి, ‘రెడ్డి’కార్పెట్ వే శారు. సరే ఇదంతా తెలిసిన రామాయణమే.

ఇప్పుడు జగన్ ఓడిన సేనాని. అసెంబ్లీలో ముందుసీట్లలో సీటుకు దిక్కులేని నాయకుడు. కాబట్టి ఒళ్లు దగ్గరపెట్టుకుని, గతంలో చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా జాగ్రత్త పడతారని ఎవరైనా భావిస్తారు. కానీ ఆయన జగన్‌రెడ్డి కదా? ఎలా మారతారు?! అందుకే రెడ్ల సేవను విజయవంతంగా కొనసాగించారు. అదెలాగో చూద్దాం.

15 మంది పార్లమెంటు సభ్యులున్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని నియమించారు. అంతకుముందు ఈ పదవిలో విజయసాయిరెడ్డి ఉండేవారు. ఇప్పుడాయనను కరివేపాకు మాదిరిగా తీసి పక్కనపడేశారు. ఆయనను కేవలం రాజ్యసభ నేతకు పరిమితం చేశారు. లోక్‌సభలో పార్టీ నేతగా ఏపీలో లిక్కర్ సరికొత్త లిక్కర్ ఉద్యమాన్ని తీసుకువచ్చిన మిథున్‌రెడ్డినే మళ్లీ కొసాగించారు. అంటే రాజ్యసభ-లోక్‌సభ నేతలతోపాటు.. పార్లమెంటరీ పార్టీ నేతను సైతం రెడ్లకే అప్పగించి, జగన్‌రెడ్డి తన ‘రెడ్డిప్రేమ’ను నిర్భయంగా చాటుకున్నారన్నమాట.

నిజానికి జగన్ జైలులో ఉన్నప్పటి నుంచి అధికారంలో ఉన్నంతవరకూ.. ఆయన కోసం అవిశ్రాంతంగా పనిచేసిన విజయసాయిరెడ్డిని, కరివేపాకు కమ్ పూచికపుల్ల మాదిరిగా పక్కనపెట్టడం ఆశ్చర్యమే. జగన్ సీఎంగా ఉన్నప్పుడు-లేనప్పుడూ, ఢిల్లీలో ఆయన తరఫున లాబీయింగ్ చేసింది విజయసాయిరెడ్డేనన్నది బహిరంగం. ఆయన ఎప్పుడూ పీఎంఓ, అమిత్‌షా చాంబర్ల చూరు పట్టుకునే వేళ్లాడేవారు. అధికారం వచ్చిన తర్వాత.. సకలశాఖలమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని రంగప్రవేశం చేయించేంత వరకూ విజయసాయిదే హవా.

సజ్జల రంగప్రవేశం చేసిన తర్వాతనే విజయసాయి తిరోగమనం మొదలయింది. సజ్జలతో విజయసాయికి చెక్ పెట్టించిన జగన్.. తొలుత ఆయనను పార్టీ ఆఫీసు నుంచి లౌక్యంగా బయటకు పంపించారు. పార్టీ అనుబంధ శాఖలను కూడా ఆయన నుంచి తప్పించారు. విశాఖలో ఆయనను తప్పించి, బాబాయ్ సుబ్బారెడ్డికి అప్పగించారు. జోనల్ కోర్డినేటర్‌గా వేసిన తర్వాత.. చిన్నగా ఆయనను ఓడిపోయే నెల్లూరు ఎంపీ సీటుకు దింపి, బలిపశువును చేశారు. అప్పటికి ఆయన ఇంకా రాజ్యసభ సభ్యుడే కాబట్టి సరిపోయింది. లేకపోతే ఓడిపోయిన విజయసాయిరెడ్డి భవిష్యత్తు ఎలా ఉండేదోనన్నది ఆయన అభిమానుల ఆందోళన.

తాజాగా విజయసాయిరెడ్డికి ఉన్న కీలకమైన పార్లమెంటరీపార్టీ నేత పదవిని.. బాబాయ్ సుబ్బారెడ్డితో చెక్ పెట్టిన జగన్ నిర్ణయం వెనుక, చాలా పెద్ద కథే ఉందన్నది వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. టీడీపీ మద్దతుదారుగా, వైసీపీ ఎల్లో మీడియాగా ముద్రవేసిన ఒక పత్రిక కమ్ టీవీ చానెల్ యజమానితో, విజయసాయిరెడ్డి సత్సంబంధాలు నిర్వహించేవారట. హైదరాబాద్‌లోని ఆ పత్రిక యజమానిని గన్‌మెన్లు లేకుండా ఆటోల్లో వెళ్లి కలిసేవారట. పార్టీ ర హస్యాలు, అంతర్గత విషయాలతోపాటు సీఎంఓ సీక్రెట్లు కూడా ఆయన చెవిలో వేసేవారట.

అసలు కొన్ని నెలల క్రితం ఆ పత్రికలో సీఎంఓపై వరసగా వచ్చిన కథనాల వెనుక , ఆయన ఇచ్చిన మెటీరియలే ఉందట. అదీగాక తారకరత్నతో ఉన్న కుటుంబబంధం కారణంగా, చంద్రబాబుతో చాలారోజులు సత్సంబంధాలు నిర్వహించారన్న అనుమానం కూడా జగన్‌లో లేకపోలేదట. ఆమేరకు వేగులు కూడా విజయసాయికి వ్యతిరేకంగానే నివేదికలిచ్చారట. అందుకే అప్పట్లో ఆయనను వివిధ బాధ్యతల నుంచి తప్పించారట.

దానికితోడు ఆ మధ్య కాలంలో విజయసాయి.. తన ట్వీట్లలో చంద్రబాబును ‘గారు’ అని కూడా సంబోధించారు. నిజానికి గతంలో విజయసాయి ఎప్పుడూ చంద్రబాబును గారు అని పేర్కొనలేదు. ముసలోడు, చంద్రబాబు చౌదరి అని పేర్కొనేవారు.

మళ్లీ జగన్ బాధ్యతలు అప్పగించడంతో, చంద్రబాబుపై విమర్శలు కొనసాగించారు. ఇప్పుడు అధికారంలో లేకపోవడం, కేంద్రంలో పరిణామాలు మారుతుండటంతో.. తన వాడు కీలక స్థానంలో ఉండటమే మంచిదన్న దూరదృష్టితోనే, బాబాయ్ సుబ్బారెడ్డికి అబ్బాయ్ జగన్‌రెడ్డి పార్లమెంటరీ పార్టీ నేత బాధ్యతలు అప్పగించారట. ఆరకంగా విజయసాయిరెడ్డికి దెబ్బేశారన్నమాట.

మరి జగన్ ఇప్పటివరకూ నా ఎస్సీలు.. నా బీసీలంటూ గొంతు చించుకుని చేసిన మాటలేమయ్యాయి? లోక్‌సభ-రాజ్యసభ-పార్లమెంటరీపార్టీ నేత పదవులూ ఒక్క బీసీకి గానీ, ఒక్క ఎస్సీకి గానీ ఎందుకివ్వలేదు? బీసీ నేత బీద మస్తాన్‌రావు రాజ్యసభ నేతగా పనికిరారా? లోక్‌సభ నేతగా దళిత నేత గురుమూర్తి పనికిరారా? సామాజిక న్యాయమంటే తన సామాజికవ ర్గానికి న్యాయం చేయడమేనా? ఓడిపోయినా ఇంకా జగన్ కులపిచ్చపోలేదన్నమాట.. అంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు జగనన్నపై జజ్జనకరి జనారే అంటూ ఎక్కేస్తున్నారు.

LEAVE A RESPONSE