అప్పుల వేటలో “ఇదేం ఖర్మ…. రాష్ట్రానికి” అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు

-వెనుకబడిన చత్తీస్ ఘడ్, ఝార్ఖండ్ రాష్ట్రాలకన్నా ఏపీ ఆర్ధికపరిస్థితి హీనం
-ఈశాన్య, కరువు రాష్ట్రాల సరసన ఏపీని నిలిపిన జగన్ రెడ్డి
-బుర్రకథలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న మంత్రి బుగ్గన
-ఈ ఏడాది మొదటి ఏడున్నర నెలల్లోనే ఒక్క ఆర్.బి.ఐ నుంచి రూ.43,803 కోట్ల భారీ అప్పు రాష్ట్రం చేసింది
-ఆర్.బీ.ఐ సమాచారానికి జగన్ రెడ్డి, బుగ్గన ప్రజలకు సమాధానం చెప్పాలి

ఢిల్లీ వీధుల్లో బొచ్చె పట్టుకుని తిరుగుతూ బిజీగా కనిపించే ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇటీవల మీడియా ముందుకు వచ్చారు. యథావిధిగా ఎప్పటిలాగానే బుర్ర కథల, పిట్టకథలు చెప్పే బురిడీ బుగ్గన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీడియా ముందుకు పచ్చి అబద్దాలే వల్లె వేశారు. బుర్రకథలు చెప్పడం, బురిడీ కొట్టించడంలో తనను మించిన వారు లేరని బుగ్గన అనుకుంటూ చివరకు బఫూన్ బుగ్గనలా మారారు. ఇప్పటికైనా బుగ్గన అబద్దాలు చెప్పడం మాని తాను ఒక బాధ్యతగల మంత్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. ఈమధ్యనే కాగ్ నివేదికలో అప్పుల్లో మనమే నంబర్ వన్ అని తేలిపోయింది. దానికి అధనంగా ప్రతి మంగళవారం ఆర్ బీ ఐ గడప వద్దకు భారీ బొచ్చె పట్టుకుని వెళ్లే కార్యక్రమంలో కూడా మనమే ముందున్నామని నేడు ఆర్.బి.ఐ లెక్కలతో స్పష్టమైంది.

2022-2023ఆ ర్థిక సంవత్సరంలో 2022 ఏప్రిల్-1 నుండి నవంబర్-15 వరకు ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అప్పులు తీసుకునే విధానం ప్రకారం ఆర్.బీ.ఐ వద్ద అత్యధికంగా అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ముందు ఉంది అని నేను సమాచార హక్కు చట్టం ద్వారా అడిగాను. వాళ్లు ఇచ్చిన అధికారిక సమాచారం ప్రకారం ఆర్.బీ.ఐ నుండి అప్పులు అత్యధికంగా తీసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రూ.43,803 కోట్ల అప్పులు చేసి ముందంజలో ఉంది. ఇది వివిధ కార్పొరేషన్లు, లిక్కర్ బాండ్ల ద్వారా చేసిన అప్పులను జత చేయకుండా చేసిన మొత్తం. ఒక్క మహారాష్ట్ర మాత్రమే మనకంటే ఒక వెయ్యి కోట్లు అధనంగా ఆర్.బి.ఐ నుంచి అప్పు చేసింది.

ఆర్.బి.ఐ వారు ఇచ్చిన సమాచారం మేరకు వివిధ రాష్ట్రాలు వారి వద్ద తీసుకున్న అప్పుల వివరాలు…
రాష్ట్రం చేసిన అప్పు (రూ.కోట్లలో
ఆంధ్రప్రదేశ్ 43,803
తమిళనాడు 41,000
పశ్చిమబెంగాల్ 30,000
పంజాబ్ 27,955
రాజస్థాన్ 25,500
తెలంగాణ 24,500
హర్యానా 23,500
గుజరాత్ 22,500
బీహార్ 17,000
ఉత్తర్ ప్రదేశ్ 14,000
కేరళ 12,436
మధ్య ప్రదేశ్ 12,000
అస్సాం 11,300
కర్నాటక 4,000
జమ్మూ,కాశ్మీర్ 3,550
ఝార్ఖండ్ 1000
నాగాలాండ్ 1,022
మిజోరాం 840
మణిపూర్ 750
మేఘాలయా 600
గోవా 600
ఉత్తరాఖండ్ 500
పాండిచ్చేరి 400
చత్తీస్ ఘడ్ 0.00
అరుణాచల్ ప్రదేశ్ 0.00
త్రిపుర 0.00
ఒరిస్సా 0.00

పై వివరాలు గమనించినట్లైతే ఎంతో వెనుకబడిన చత్తీస్ ఘడ్ రాష్ట్రం ఈ ఏడాది ఆర్.బి.ఐ నుండి ఒక్క రూపాయి కూడా అప్పు తేలేదు. మన ప్రక్కనే ఉన్న ఒరిస్సా సైతం ఆర్.బి.ఐ నుంచి నయాపైసా అప్పు చేయలేదు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర కూడా ఈ ఏడాది ఆర్.బి.ఐ నుంచి ఎటువంటి అప్పులు చేయలేదు. జార్ఖండ్ రాష్ట్రం కేవలం రూ.1000 కోట్లు మాత్రమే అప్పు చేయడం జరిగింది. అత్యంత వెనుకబడిన రాష్ట్రాలు ఆర్.బి.ఐ నుంచి ఏమాత్రం అప్పు చేయకుండా ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకు వెళుతుంటే అన్ని రకాల వనరులున్న మన రాష్ట్రం మాత్రం విచ్చలవిడిగా అప్పులు చేసి ఆర్ధిక పతనావస్థకు చేరుకుంటోంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఈ సంవత్సరం ఇప్పిటివరకు రూ.14 వేల కోట్లు అప్పు చేస్తే మధ్యప్రదేశ్ రాష్ట్ర రూ.12 వేల కోట్లతో సరిపెట్టుకుంది. ఈశాన్య రాష్ట్రమైన అస్సాం కూడా రూ.11 వేల కోట్ల అప్పుతో పాలన సాగిస్తోంది. మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణ మనం చేసిన అప్పులతో పోల్చితే దాదాపు సగంతో సరిపెట్టుకుంది. మరోపొరుగు రాష్ట్రమైన కర్నాటక అయితే అతి తక్కువగా ఇప్టటి వరకు రూ.4 వేల కోట్లు మాత్రమే ఆర్.బి.ఐ నుంచి అప్పు తీసుకుంది. గతంలో వెనుకుబాటుతనానికి ఒక ప్రామాణికంగా ఉన్న బీహార్ నేడు అప్పుల విషయంలో మనకంటే చాలా మెరుగ్గా కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే ఇప్పటి వరకు ఆర్.బి.ఐ నుంచి అప్పు చేయడం జరిగింది.

అప్పుల వేటలో “ఇదేం ఖర్మ… రాష్ట్రానికి”:
అప్పుల వేటలో దేశంలో మరేఇతర రాష్ట్రానికి లేనటువంటి తపన మన రాష్ట్రానికి ఉండటాన్ని గమనించి “ఇదేం ఖర్మ….రాష్ట్రానికి” అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కోవిడ్ సమయంలో గానీ, ఆ తర్వాత గానీ దేశంలో మిగతా అన్ని రాష్ట్రాలు ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తూ గాడితప్పకుండా పరిపాలన సాగిస్తుంటే ఒక్క మన రాష్ట్రమే ఎందుకు ఆర్ధిక పతనావస్థకు చేరుకుంటోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతినిత్యం మిగతా రాష్ట్రాలు అప్పులు చేయడం లేదా అని రాష్ట్ర అప్పుల విషయంగా ప్రశ్నలు దాటవేసే బుగ్గన నేడు ఆర్.బి.ఐ వారు ఇచ్చిన గణాంకాలు చూసి ఏం జవాబు చెబుతాడు? మిగతా రాష్ట్రాలు అప్పులు చేసినా అవి ఒక పరిమితికి లోబడి ఆర్ధిక క్రమశిక్షణ తప్పకుండా చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే అసలు పైసా అప్పు చేయకుండా తమ సొంత ఆదాయాలపైనే ఆధారపడుతున్నాయి. కానీ, మన రాష్ట్రానికి వలే అప్పుల విషయంలో విచ్చలవిడితనం ఎక్కడా ప్రదర్శించడం లేదు. గతంలో ఎప్పుడూ లేనటువంటి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ నేడు మన రాష్ట్రంలో ఏర్పడటం నిజంగానే మన ఖర్మగా భావించాలి.

కేంద్ర ఆర్ధికశాఖ విధించిన నెట్ బారోయింగ్ సీలింగ్(ఎన్.బీ.సీ)ని అధికమించడంలో కూడా ఏపీనే నం.1:
ప్రతీ ఆర్ధిక సంవత్సరం కేంద్ర ఆర్ధికశాఖ పరిధిలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్ వారు దేశంలోనే అన్ని రాష్ట్రాలకు అప్పులకు పరిమితిని (నెట్ బారోయింగ్ సీలింగ్) నిర్ధేశిస్తారు. దేశంలోని కొన్ని ప్రధాన రాష్ట్రాలు చేస్తున్న అప్పు వారికి ఉన్నటువంటి నెట్ బారోయింగ్ సీలింగ్ పరిమితి పరిశీలిస్తే మన రాష్ట్రం ఆ విషయంలో కూడా అగ్రభాగంలో ఉంది.

రాష్ట్రం ఆర్.బి.ఐ నుంచి చేసిన అప్పు (రూ. కోట్లలో) నెట్ బారోయింగ్ సీలింగ్
(రూ.కోట్లలో) శాతం
ఆంధ్రప్రదేశ్ 43,803 44,574 98.2
తెలంగాణ 24,500 42,728 57.3
పశ్చిమబెంగాల్ 30,000 58,461 51.3
తమిళనాడు 41,000 83,955 48.8
మహారాష్ట్ర 45,000 1,10,626 40.6
ఉత్తరప్రదేశ్ 14,000 71,688 19.5
కర్నాటక 4,000 76,343 5.2

పై పట్టిక ద్వారా ఆంధ్రప్రదేశ్ చాలా స్పష్టంగా పరిమితికి మించి అప్పులు చేసే విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే అందనంత ఎత్తులో ఉన్న విషయం ప్రస్పుటంగా అర్ధమౌతోంది. ఏపీ చేసినంత అప్పు దేశంలో మరే రాష్ట్రం చేయలేదు. మహారాష్ట్ర రూ.45 వేల కోట్లు అప్పులు చేసింది..అయితే రాష్ట్రాలకు కేంద్ర విధించే నెట్ బారోయింగ్ సీలింగ్ (ఎంత అప్పు చేయాలో విధించే షరతు) మహారాష్ట్రకు రూ.1,10,626కోట్లు బారోయింగ్ సీలింగ్ ఉంది, ఎందుకంటే ఆ రాష్ట్రానికి స్థూల ఉత్పత్తి ఎక్కువ గనుక. మహరాష్ట్రకు అప్పు ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంది. అయినా కూడా తమ పరిమితిలో తక్కువగా కేవలం 40.6 శాతం (రూ.45,000 కోట్లు) మాత్రమే అప్పు చేసింది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు వారికున్నటువంటి అప్పుల పరిమితిలో ఇప్పటి వరకు కేవలం వరుసగా 57.3 మరియు 48.8 శాతం మాత్రమే వినియోగించుకోవడం జరిగింది. మరో పొరుగు రాష్ట్ర కర్నాటక అయితే అత్యంత తక్కువగా వారికున్న అప్పుల పరిమితిలో కేవలం 5.2 శాతం మాత్రమే ఆర్.బి.ఐ నుంచి అప్పుల రూపంలో వినియోగించుకుంది. మన రాష్ట్రం మాత్రం మొదటి ఏడున్నర నెలల్లోనే సంవత్సరం మొత్తానికి చేయాల్సిన అప్పులో 98.02శాతం అప్పులు ఒక్క ఆర్.బీ.ఐ నుండే చేశారు. దీని ద్వారా కూడా ఆర్.బి.ఐ అప్పుల వేటలో ఏపీనే నెం.1 గా నిలిచింది.

ఆర్.బీ.ఐ ఇచ్చిన సమాచారానికి బుగ్గన ఏం సమాధానం చెబుతారు? మీడియా ముందుకు వచ్చి పై వాస్తవాలపై స్పదించే ధైర్యం బురిడీ బుగ్గనకు ఉందా? అప్పుల వేటలో ఏపీనే మొదటి స్థానంలో ఉందని బుగ్గన ఒప్పుకోక తప్పదు. అప్పులు చేసి తెచ్చిన డబ్బులు ఎవరి జేబులో పెట్టారో జగన్ రెడ్డి, బుగ్గన ప్రజలకు సమాధానం చెప్పాలి. తెచ్చిన అప్పుల్లో నయాపైసా మౌలిక సదుపాయాల రూపకల్పనకు వినియోగించలేదు. కనీసం రోడ్లపై పడిన గుంటలు పూడ్చలేదు. ఒక్క నూతన కట్టడానికి ఇటుక వేయలేదు. పూర్తిగా అభివృద్ధి కుంటుపడిన పరిస్థితి. మరోప్రక్కన సంక్షేమం కాస్త దగాకోరు సంక్షేమంగా మారిన దుస్థితి. అనేక పథకాల్లో పడుతున్నటువంటి కోతలు తగ్గుతున్న లబ్దిదారులు ఈ దగాకోరు సంక్షేమానికి అద్దంపడుతున్నాయి. అప్పులు చేసి తెచ్చిన సొమ్మంతా నల్ల డబ్బుగా మారి గాలి మార్గంలో ఏ1, ఏ2 ల సొంత ఖజానాలకు తరలిపోతున్నాయి. ప్రజలు ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకుని ఇదేం ఖర్మ….రాష్ట్రానికి అని వాపోతున్నారు.

Leave a Reply