కుప్పం సొంతమవుతుందని జగన్ రెడ్డి బ్యాచ్ అండ్ కో పగటి కలలు కంటోంది

Spread the love

– జగన్ రెడ్డి రోడ్డు మీద వెళితే అందరినీ అడ్డుకునే పోలీసులు.. చంద్రబాబు పర్యటనలో వైసీపీ మూకని ఎలా రానిచ్చారు?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

అధికారపార్టీకి పోలీసులు దాసోహమై.. వైసీపీ అల్లరిమూక అన్నా క్యాంటిన్లను ధ్వంసం చేస్తున్నా చోద్యం చూస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వైసీపీ రౌడీ మూకలు టీడీపీ ఫ్లెక్సీలను చింపి విధ్వంసం సృష్టిస్తున్నా, అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై దాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూడడమేకాక టీడీపీ కార్యకర్తలపైనే దాడికి దిగడం దుర్మార్గం.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నా వాటిని కాపాడటంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా పని చేయడానికి పోలీసులు భయపడుతున్నారు. తప్పు చేసిన వైసీపీ వారిని నిలువరించడానికి పోలీసులు సాహించలేకపోతున్నారు. అధికారపార్టీకి ఏకపక్షంగా కొమ్ముకాస్తున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. కుప్పంలో పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గమైంది. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా ఉంది. గతంలో సవాంగ్, నేడు రాజేంద్ర నాథ్ నేతృత్వం దీనికి అద్దం పడుతోంది. చట్టాన్ని కాపాడాలి, అన్ని వర్గాల వారికి సమన్యాయం చేయాలనే ఆలోచన పోలీసులకి ఏకోశాన లేదు. ప్రశ్నించే గొంతులను పోలీసులు బూటుకాలితో నొక్కేస్తున్నారు. ప్రజా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు.

భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ 19 భారత పౌరులకు స్వేచ్ఛని, అధికారాన్నిచ్చింది. ఈ ఆర్టికల్ ను రాష్ట్రంలో ఇనుప పాదంతో అణగదొక్కుతున్నారు. దీన్ని ప్రశ్నించి, అరాచక పాలనకు స్వస్తి పలకాల్సిన భాద్యత ప్రజాస్వామ్య వాదులందరిపై ఉంది. మూడు రోజులు కుప్పంలో పర్యటిస్తానని 7సార్లు ఎమ్మెల్యేగా అదే నియోజక వర్గంలో పని చేసిన చంద్రబాబు ముందే తెలిపారు. ఆయన 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటి ఉంది. ఎన్.యస్.జి గార్డ్స్ రక్షణలో ఉన్న వ్యక్తి ముందే అధికారులకు సమాచారం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు పర్యటనలో ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. పర్యటన సజావుగా సాగటానికి రక్షణ కల్పించడంలో పోలీసు శాఖ ఘోరంగా విఫలమైంది. నవ్విపోదురుగాక మాకేంటి అనే రీతిలో పోలీసులు బాధ్యతలను విస్మరించారు.

టీడీపీ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఎవరికి వినతి పత్రాల్ని ఇవ్వడానికి వెళుతున్నా వారిని అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు కుప్పంలో అల్లర్లు సృష్టించిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కుప్పంలో వైసీపీ గూండాల అరాచకం వెనుక మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ భరత్, స్థానిక పోలీసు అధికారుల హస్తం ఉంది. అన్నా క్యాంటీన్ ను వైసీపీ గూండాలు ధ్వంసం చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఇది చాలా దుర్మార్గం.చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై వైసీపీ గూండాలు కర్రలతో దాడులు చేశారు. ఆ దాడులలో కార్యకర్తలకు రక్తగాయాలయ్యాయి. పోలీసులు వైసీపీ అల్లరి మూకని రోడ్ల మీదకి ఎందుకు రానిచ్చారు? టీడీపీ కార్యకర్తలను కొట్టడానికి వెళతున్నాం అంటే వైసీపీ అల్లరి మూకకు మీరేమైనా అనుమతులు ఇచ్చారా? వాళ్ళని అడ్డుకోవడంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారు? రావడానికి వారేమైనా అనుమతి తీసుకున్నారా? దీనిపై డిజిపి మాత్రమే కాదు, మిగతా సీనియర్ అధికారులు కూడ సమాధానం చెప్పాలి.

జగన్ రెడ్డి కి సీఎం పదవి శాశ్వతం కాదు, ఆయన అండదండలతో పోలీసులు రెచ్చిపోయి తప్పులు చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పులు చేసినవారు తప్పించుకోలేరు.
టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీ తప్పుల చిట్టా నమోదవుతోంది. తప్పు చేసిన ఎవ్వరిని వదిలేది లేదు. తప్పు చేసిన వారి మీద ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాం. అధికారంలోకి వచ్చిన తరువాత వారికి శిక్ష పడేలా చూస్తాం.

పోలీసులు చట్ట బద్ధంగా విధి నిర్వహణ చేయాలి. వైసీపీ అల్లరి మూక దాడులు చేస్తుంటే నిస్తేజంగా నవ్వుకుంటూ పోలీసులు ఉండిపోవడం సిగ్గు చేటు. వైసీపీ మూక ఇష్టానుసారం ప్రవర్తించి చంద్రబాబు కాన్వాయ్ దిగి రోడ్డు మీద కూర్చునేలా చేశారు. పేదవాడికి అన్నం పెట్టి కడుపునింపుతున్న అన్నా క్యాంటిన్లని ధ్వంసం చేశారు. టీడీపీ ఫ్లెక్సీలను చింపి విధ్వంసం సృష్టించారు. వైసీపీ అల్లరి మూక చేస్తున్న విధ్వంసాన్ని పోలీసులు చోద్యం చూస్తున్నారు. పోలీసులు ఈ కుట్రలో భాగస్థులు అయ్యారు.

టీడీపీ కార్యకర్తలను భయబ్రాంతానికి గురి చేసి, చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడానికి భయపడేలా చేసి.. కుప్పంను ఆక్రమించుకోవాలన్నదే జగన్ రెడ్డి, అతని పేటియం బ్యాచ్ ప్రయత్నం. అది కలగానే మిగులుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భరత్ రెడ్డి, జగన్ రెడ్డికి కొమ్ముకాసిన పోలీసులను వదిలేదిలేదు. మీ ఉడుత ఊపులకు టిడిపి కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు భయపడరు. అలిపిరిలో 26 క్లెయిమోర్ మైన్స్ కే చంద్రబాబు భయపడలేదు.

బంతిని నేలకేసి కొడితే రెట్టింపు వేగంతో పైకి లేచినట్లు టిడీపీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో కుప్పంలో పని చేస్తారు. ఇక మీ ఆటలు అక్కడ సాగవు. చంద్రబాబుకు వస్తు్న్న ఆదరణని చూసి జగన్ రెడ్డి భయపడుతున్నారు. చంద్రబాబుకు ప్రజలు నీరాజనం పడతుంటే కుప్పంను ఎలా ఆక్రమించుకుంటారు? మీరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా అక్కడ బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు పర్యటన ముగిసింది.

పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటిన్లని కూలదోసిన వైసీపీ అల్లరి మూకకు వారి తల్లిదండ్రులు ఏం సంస్కారం నేర్పించారు? విధ్వంసం మాత్రమే నేర్పించారా? ధ్వంసం చేసినచోటే చంద్రబాబు నాయుడు క్యాంటిన్ ని ప్రారంభిస్తే మీ వైసీపీ కార్యకర్తలు కూడ భోజనం చేయడం గొప్ప విషయం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భరత్ రెడ్డి లు సిగ్గుతో తలదించుకోవాలి. మీరు ట్రైనింగ్ అయిన పోలీసులా లేదా చెట్టుకింద పోలీసులా? వైసీపీ రాళ్ల దాడి చేస్తే టీడీపీకి తగిలినా అక్రమంగా టీడిపీ వారి మీదే కేసులు పెట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాడు కనుక జైళ్లో ఉండాలి, బెయిల్ రాకూడదనే రీతిలో పోలీసులు వ్యవహరించారు.

నోరు మెదపని వ్యక్తి గౌరివాని శ్రీనివాస్ మీద అట్మెంటు మర్డర్ కేసు పెట్టిన పోలీసులకు మానవత్వం లేదు. హింసించి భయపెట్టి కుప్పంను ఆక్రమించుకోవాలనుకుంటే అది జరగని పని. ఇది ప్రజాస్వామ్య దేశం. మీరు ఎంత దుర్మార్గాలకు ఒడిగడుతున్నా ప్రజలు టీడీపీ వైపు, చంద్రబాబు పక్షాన ఉన్నారు. దౌర్జన్యం చేసి క్షణికానందం పొందొద్దు.

రెండు గ్రూపుల మధ్య గొడవలు జరిగితే ఎస్సీ కుర్రాడ్ని తీసుకొచ్చి ఎట్రాసిటి కేసు పెడతారా? ఎస్సీ ఎట్రాసిటి యాక్ట్ ని దుర్వినియోగం చేసిన ఘనత ఆంధ్ర రాష్ట్ర పోలీసులకు, జగన్ రెడ్డికే దక్కుతుంది. క్యాంటిన్లని ధ్వంసం చేసిన వారి మీద ఆకతాయిలు చేశారని పేర్కొనడం దుర్మార్గం.

డిజిపి ఉన్నాడంటే ఉన్నాడు. జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఉన్నత అధికారులు ఏం చేస్తున్నారో తెలియని పరిస్ధితి. నోటికొచ్చినట్టు మాట్లాడిన సిఐ శ్రీధర్ ని వదలం. ప్రస్తుతం రెండు ప్రైవేటు ఫిర్యాదులు ఉన్నాయి, మూడోది కూడ సిద్ధం చేశాం. కుప్పంలోని టిడిపి వాళ్లు వదిలేది లేదు. వైసీపీ ప్రతినిధిగా ఉండాలనుకుంటే పోలీసు జాబ్ ఎందుకు? పార్టీలో చేరి భరత్ వెంట తిరగండి. జై జగన్ అని నినాదాలు చేసుకొండి.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్ రెడ్డిల పదవులు శాశ్వతం కాదు. కేసుల విచారణ సరిగా జరిపకుండా వైసీపీ నేతల మోచేయి నీరు తాగుతున్నారు. పేపర్ లేనిదే నాలుగు మాటలు మాట్లడలేరు. రాసింది చదువుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి అయినందుకు సిగ్గుపడాలి.

చంద్రబాబు నాయుడికి కుప్పంలో ఒటమి తప్పదని పగటి కలలు కనద్దు. వైసీపీ వారిని మీరెందుకు అక్కడన్నారని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టారంటారు. జగన్ రెడ్డి వెళుతుంటే రోడ్ల మీదకి రానివ్వనివారు చంద్రబాబు నాయుడు పర్యటనలో వైసీపీ మూకని ఎలా రానిచ్చారు?

డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికైనా మేల్కొని శాంతిభద్రతలను కాపాడాలి. కుట్రలో భాగమైన జగన్, పెద్దిరెడ్డి, భరత్, పోలిసుల పై చర్యలు తీసుకోవాలి. హత్యాయత్నం, ఎస్సీ,ఎస్టీ సెక్షన్లు తొలగించి నిష్పక్షపాతంగా కేసును పోలీసులు విచారించాలని టీడీపీ డిమాండ్ చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.

Leave a Reply