Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌రెడ్డా.. ఛీ..ఛీ!

-తెలుగువారికొచ్చిన గుర్తింపు పొట్టి శ్రీరాములు చలువే
-తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీ రామారావుదే
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

పొట్టి శ్రీరాములు వంటి మహానుభావుడి స్మరించుకునేటప్పుడు, కొంతమంది పనికిమాలిన వెధవలను కూడా గుర్తుంచుకోవలసిన అవసరం రావడం మన దౌర్భాగ్యమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మే 20వ తేదీ తర్వాత అటువంటి పరిస్థితి రాష్ట్రానికి రాకూడదని ఆయన కోరుకున్నారు. వచ్చే ఏడాది పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించుకుందామని చెప్పారు.

శనివారం పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని రఘురామకృష్ణం రాజు ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఆంధ్ర రాష్ట్రం, ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ఆయన నిజమైన నిరాహార దీక్ష చేశారన్నారు. ప్రస్తుతం కొంతమంది డమ్మీ నిరాహార దీక్షలను చేస్తూ, ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరాహార దీక్ష చేసిన వెంటనే పోలీసులు రావడం కాస్తా ఆలస్యమైతే, వారే పోలీసులకు ఫోన్లు చేసి పిలిపించుకుంటున్నారన్నారు. ఊళ్లకు ఊళ్లనే పంచుకునే ప్రజా ప్రతినిధులు ఉన్న ఈ రోజుల్లో, నెల్లూరుకు చెందిన పొట్టి శ్రీరాములు ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేశారన్నారు.

తెలుగు వారికి ఈరోజు ఒక గుర్తింపు ఉందంటే దానికి సృష్టికర్త పొట్టి శ్రీరాములేనని రఘురామ కృష్ణంరాజు కొనియాడారు . తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు అని పేర్కొన్నారు. తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన పొట్టి శ్రీరాములు కు ప్రతి ఒక్క ఆంధ్రుడు, తెలుగు వారు హృదయపూర్వకంగా నివాళి అర్పించాలని కోరుకుంటున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

రాజకీయాలలో ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారామన్న ఆయన, ఆ రోజుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహోన్నతమైన నాయకులు ఉండేవారు. వారి పేర్లను తలుచుకుంటే తనువు పులకిస్తుందని చెప్పారు. ఈరోజు పాలకులు శవాన్ని చూస్తే నవ్వుతారని, పెళ్లికొస్తే ఏడుస్తారని ఎద్దేవా చేశారు. అటువంటివారు పొట్టి శ్రీరాములు తీసుకువచ్చిన ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలుగా చేయడానికి నక్కల్లాగా పొంచి ఉన్నారని విరుచుకుపడ్డారు.

పొట్టి శ్రీరాములు వంటి మహానుభావుడిని స్మరించుకునే సమయంలో, ప్రస్తుత పాలకుడైన జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తేనే ‘ఛీ’ అని అసహ్యం వేస్తుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

LEAVE A RESPONSE