– టీడీపీ హయాంలో రూ.11,535 కోట్ల ఖర్చు చేశారన్న పరిటాల సునీత
– శివపురంలో సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత
– నియోజకవర్గంలో అన్ని చెరువులకు నీరు ఇవ్వాలన్నదే మా లక్ష్యం
– రానున్న నాలుగేళ్లలో రాప్తాడు అభివృద్ధి చూస్తారన్న సునీత
రాప్తాడు: హంద్రీనీవా తో పాటు రాయలసీమలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ రెడ్డికి లేదని.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. కనగానపల్లి మండలం కె.ఎన్.పాళ్యం పంచాయతీ శివపురం గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో నిర్మించిన గోకులం షెడ్లను ప్రారంభించారు. అలాగే కనగానపల్లి మండలంలో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి గురించి ఎమ్మెల్యే సునీత వివరించారు. హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి జిల్లాకు ఇప్పటికే నీరు చేరిందని, గతం కన్నా ఎక్కువగా ఈ ఏడాది రాప్తాడు నియోజకవర్గానికి నీరు తీసుకునే అవకాశం ఉందన్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం హంద్రీనీవా విషయంలో ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు.
అసలు హంద్రీనీవా ప్రాజెక్టు ఎక్కువ భాగం టీడీపీ అధికారంలో ఉండగానే జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఫేజ్-1, ఫేజ్-2కు కలిపి రూ.13,635 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చారన్నారు. రూ.11,535 కోట్ల వరకు టీడీపీ ప్రభుత్వంలోనే హంద్రీనీవాకు ఖర్చు చేశారన్నారు. 2014-19లో హంద్రీ నీవా ప్రాజెక్టుకు రూ.4,182 కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు.
కాలువ విస్తీర్ణాన్ని 10 మీటర్ల నుంచి 16. 5 మీటర్ల వెడల్పు చేసి.. 40 టీఎంసీల నీరు తరలించే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. 2019–24లో జగన్ రెడ్డి 5 ఏళ్లల్లో రూ.515.78 కోట్లు మాత్రమే హంద్రీనీవాకు ఖర్చు చేశారన్నారు. రాయలసీమ బిడ్డని అని చెప్పుకొని సీమకే అన్యాయం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలోనే హంద్రీనీవా ఫేజ్1, ఫేజ్ 2 కి రూ.3873 కోట్లు ఖర్చు చేశామన్నారు.
కాలువ వెడల్పుతో 3,850 క్యూసెక్కులకు నీటి సామర్థ్యం పెరిగిందన్నారు. దీని ద్వారా వీలైనంత ఎక్కువ నీరు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈసారి కచ్చితంగా రాప్తాడు నియోజవర్గంలో అన్ని చెరువులకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే సునీత స్పష్టం చేశారు..