జగన్ రెడ్డి ఒక సైకో: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు, ఇతర ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ..రెండున్నరేళ్లలో ఇంత అరాచకం, అప్రతిష్టపాలైన ప్రభుత్వం దేశ చరిత్రలో లేదు. అవినీతి, అరాచకం, అబద్ధాలలో తప్ప ప్రతి అంశంలోనూ జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పుడు మనం ఒక సైకో నుంచి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి. అయినప్పటికీ ప్రజల కోసం, రాష్ట్రం కోసం అన్నీ భరిస్తున్నాం. టీడీపీకి కార్యకర్తలే బలం. పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో పోలీసులు, వైసీపీ గూండాలతో వీరోచితంగా పోరాడుతూ.. జైలుకు కూడా వెళ్లి వస్తున్నారు. భవిష్యత్ తరాల కోసం టీడీపీ శ్రేణులు చేస్తున్న పోరాటం చరిత్రాత్మకం. టీడీపీ అనేక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొని విజయం సాధించింది. తెలుగుదేశం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి 2019 ఎన్నికల్లో వైసీపీ లబ్ధి పొందింది. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పే గోబెల్స్ ప్రచారం చేశారు. నేడు అన్ని విషయాలు ప్రజల నిజజీవితంలో అవగతం అవుతున్నాయి. జగన్ రెడ్డి మోసాలను ప్రజలు గ్రహిస్తున్నారు. బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
ఉపాధి హామీ బిల్లుల బకాయిలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సృష్టించారు. 12శాతం వడ్డీతో కలిపి బిల్లులు ఇవ్వాలని న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుతోనైనా జగన్ రెడ్డి తీరు మార్చుకోవాలి. ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో టీడీపీ చివరి వరకూ పోరాడి విజయం సాధించింది. నీరు-చెట్టు బిల్లులు చెల్లింపుపైనా పోరాడతాం. వీటితో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలేదు. సుమారు రూ.70 వేల కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. టిడ్కో ఇళ్లను ఇంతవరకు లబ్దిదారులకు కేటాయించకుండా నాశనం చేస్తున్నారు. గృహ నిర్మాణం అటకెక్కింది. ఆధునిక వసతులతో, నాణ్యత లోపించకుండా టిడ్కో ఇళ్లు నిర్మించాం. లబ్ధిదారులకు న్యాయం చేస్తాం.
ప్రభుత్వం మెడలు వంచుతాం. చివరకు రైతుల పంట పొలాల్లో బోర్లు వేసిన డబ్బులు కూడా ఇవ్వలేదు. ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారు. టీడీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. టీడీపీ సోలార్ పవర్ తీసుకువస్తే జగన్ వాటిని నాశనం చేసి ప్రజలపై భారం వేస్తున్నారు. ప్రజావేదికతో మొదలైన విధ్వంసం నేడు.. అన్నింటికీ వర్తింపజేస్తున్నారు. ఆదాయం కోసం ప్రభుత్వమే మద్యాన్ని బలవంతంగా తాగించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. లిక్కర్ పై రూ. 75వేల కోట్లు అప్పు చేస్తున్నారు. ఆడబిడ్డల తాళిబొట్లతో కూడా ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఏపీలో ఉండే మద్యం బ్రాండ్స్ దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? మద్యం బ్రాండ్స్ ఎందుకు మార్చారు? సొంతంగా మద్యం తయారుచేసుకుంటూ, నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతిస్తూ డబ్బులు సంపాదించు కుంటున్నారు.
ఏపీని డ్రగ్స్ కు కేంద్రంగా మార్చారు. గంజాయి, హెరాయిన్ అడ్డాగా రాష్ట్రాన్ని మార్చారు. ఆఫ్గనిస్తాన్ నుంచి హెరాయిన్ సరఫరాతో రూ.72వేల కోట్ల రూపాయల దందా బయటపడింది. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపడతాం. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా మావంతు కృషిచేస్తాం.
జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. దోచుకోవడానికి, దాచుకోవడానికే అప్పులు చేస్తున్నారు. సంపద సృష్టి ఎక్కడా లేదు. ఆదాయం పెంచకుండా ప్రజా ఆస్తులను అమ్మేస్తున్నారు, తాకట్టుపెడుతున్నారు. చివరకు ప్రైవేటు ఆస్తులను కూడా తాకట్టుపెడతారేమో? మరోవైపు సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారుల సంఖ్యను కుట్రపూరితంగా తగ్గిస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నారు. వైసీపీ నేతల అవినీతిని బట్టబయలు చేస్తాం. అవినీతి డబ్బుతో రాజకీయం చేస్తున్నారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. జగన్ రెడ్డి విధానాలు, విధ్వంసకరపాలన నచ్చని వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు. ప్రజలకు టీడీపీ నేతలు అండగా నిలవాలి.
రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తిచేసే పరిస్థితి లేదు. ఇరిగేషన్ ను నాశనం చేశారు. టీడీపీ హయాంలో నదుల అనుసంధానానికి కృషి చేశాం. బనకచర్ల వరకు నీటిని తీసుకెళ్లే ప్రణాళిక చేశాం. ఇప్పుడు నీరుగార్చారు. డ్రిప్ ఇరిగేషన్ ను పూర్తిగా అటకెక్కించారు. రాయలసీమలో 15 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట ఎండిపోయే పరిస్థితి ఉంది. రక్షక తడులు అందించడంలో విఫలమయ్యారు. జగన్ రెడ్డి పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతులకు టీడీపీ అన్నివిధాల అండగా ఉంటుంది.
ఉత్తరాంధ్రను పూర్తిగా నాశనం చేశారు. సాగునీటిని సక్రమంగా వినియోగించుకునే పరిస్థితి లేదు. విశాఖను భూకబ్జాలకు నిలయంగా మార్చారు. అప్పుల కోసం విలువైన, చారిత్రక భవనాలను తాకట్టుపెడుతున్నారు. పోలవరంను నాశనం చేశారు. మరోవైపు అమరావతిని నాశనం చేశారు. దీనివల్ల రూ.2 లక్షల కోట్ల ప్రభుత్వ సంపదను నాశనం అయింది. ఇది ఉంటే 13 జిల్లాల అభివృద్ధికి నిధులు సమకూర్చి ఉండేది. ఇవాళ నూతన సిటీల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తున్నారు. ఆయా నిధులను అమరావతి ఉంటే వినియోగించుకునే వాళ్లం. అమరావతి నాశనం వల్ల యువతకు ఉద్యోగాలు లభించడం లేదు. వీటన్నింటిపై తెలుగుదేశం నాయకత్వ పోరాడుతుంది. తెలుగుదేశం పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం.. ఇప్పుడు జగన్ రెడ్డి పాలనలో విధ్వంసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం.
అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు- తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజల సంక్షేమం కోసం కృషి చేశాం. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత టీడీపీని నిర్వీర్యం చేసే కుట్ర పన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాం. 2014-19 మధ్య చంద్రబాబు గారు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేశాం. ఇవాళ టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. కుట్రలన్నింటిని తిప్పికొట్టాలి. టీడీపీకి కార్యకర్తలే బలం అని గుర్తుంచుకోవాలి. విద్యుత్ ఛార్జీల పెంపుదలతో ప్రజలు అనేక బాధలు పడుతున్నారు. దీనిపై నిరంతరం పోరాటం చేస్తాం. చంద్రబాబు గారి పోరాటం వల్ల నేడు ఉపాధి హామీ, నీరు-చెట్టు బిల్లులు విడుదలవుతున్నాయి. ఇది ప్రజా విజయం. జగన్ రెడ్డి అప్రజాస్వామిక విధానాలపై న్యాయస్థానంలో పోరాటం చేస్తాం.
ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు అనేకమంది మాట్లాడారు. అక్టోబర్ నెలాఖరు వరకూ విద్యుత్ రేట్లు భారీ పెంపుపై ప్రజా చైతన్య కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.

Leave a Reply