• బందిపోట్లను మించిపోయిన జగన్ రెడ్డి అతని గ్యాంగ్ ఇసుక దోపిడీ
• ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఇసుక మైనింగ్ సొమ్ము ఎక్కడికి పోతోంది?
• రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్నఇసుకదోపిడీపై ముఖ్యమంత్రి నోరువిప్పాల్సిందే
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
జగన్మోహన్ రెడ్డి అతని గ్యాంగ్ ప్రజాసంపద, ప్రకృతివనరుల దోపిడీలో పిండారీలనే బంది పోట్లను మించిపోయిం దని, ముఖ్యమంత్రిస్థానంలో ఉండి ప్రజల్ని, ప్రకృతి సంపదను కాపాడాల్సిన వ్యక్తే వాటిని నిలువునా దోచేస్తున్నా డని, బకాసురుడిని మించిన వైసీపీ ఇసుకాసురుల్ని రాష్ట్రంలో చూస్తున్నామని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ మే 2023 నాటికి జేపీ వెంచర్స్ సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ముగిసినా, పర్యావరణానికి హాని కలిగేలా విచ్చలవిడిగా రాష్ట్రంలో సాగిస్తున్న ఇసుకతవ్వకాలు ఆపేయాలని ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) ఆదేశించినా ఇప్పటికీ యథేచ్ఛగా ఇసుకదోపిడీ నిరంరతం కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఇసుక రీచ్ లనుంచి వేలాది లారీ ల ఇసుక నిత్యం ఇతరరాష్ట్రాలకు తరలిపోతోంది.
జేపీ వెంచర్స్ సంస్థ ముసుగులో జగన్ రెడ్డి అతని గ్యాంగే ఇసుకదోపిడీకి పాల్పడుతున్నారు
జేపీ వెంచర్స్ సంస్థతో రాష్ట్రప్రభుత్వం చేసుకున్న ఒప్పందకాలపరిమితి ముగిసినా ఇసుక తవ్వకాలు ఎందుకు జరుగుతున్నాయి..ఇసుక ఎక్కడికి తరలిపోతోంది? టీడీ పీ ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ప్రజలకు అందిస్తే, అదే ఇసుక ఇప్పుడు బంగారంతో సమానంగా మారింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మూడుసార్లు ఇసుక పాలసీ మార్చాడు.
జేపీ వెంచర్స్ సంస్థకు తొలుత ఇసుకతవ్వకాలు అప్పగించిన జగన్ రెడ్డి, తరువాత బినామీ కంపెనీలైన బ్రాక్ట్సన్ ఇన్ ఫ్రా, కే.కే.ఆర్ ఇన్ ఫ్రాలకు ఇసుక రీచ్ లు అప్పగించాడు. వాటిద్వారా యథేచ్ఛగా ఇసుకదోపిడీ సాగిస్తున్నారు. ఇసుక తవ్వకం, రవాణాలో ఎక్కడా పారదర్శకత విధానాలు పాటించడం లేదు. ఆన్ లైన్ చెల్లింపులు.. ఆన్ లైన్లో ఇసుక బుక్ చేసుకోవడం.. రవాణా వాహనాలకు సరైన బిల్లులు, అనుమతు లు ఏవీ లేవు. గతంలో శేఖర్ రెడ్డిపై విమర్శలు చేసిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అతనిసంస్థకే ఇసుక రీచ్ లు ఎందుకు అప్పగించాడు.
జేపీ వెంచర్స్ సంస్థను, శేఖర్ రెడ్డిని అడ్డంపెట్టుకొని వైసీపీ నేతలే ఇష్టానుసారం ఇసుకతవ్వకాలు సాగిస్తున్నది నిజంకాదా? రాష్ట్రంలో 384 ఇసుక రీచ్ లుంటే, కేవలం 134 రీచ్ లను మాత్రమే జేపీ వెంచర్స్ సంస్థకు అప్పగించిన ప్రభుత్వం, కావాలని కృత్రిమకొరత సృష్టించి ఇసుకధరలు పెంచింది నిజంకాదా ? ఒక్కో ప్రాంతంలోని రీచ్ లో ఒక్కోధర నిర్ణయించి, సామాన్యులకు ఇసుక దొరక్కుండా చేస్తున్నది నిజంకాదా?
రాష్ట్రంలోని ఇసుక రీచ్ లన్నింటిలో ఎక్కడికక్కడ ఉండే వైసీపీనేతలే ధరలు నిర్ణయించి ఇసుకతవ్వకాలు, రవాణా, అమ్మకం వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఇసుక రీచ్ లను స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వైసీపీనేతలు అనధికారికంగా వారికి నచ్చిన ధరకు అమ్మేస్తు న్నారు. వైసీపీ నేతల ఉచ్చులోపడి, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రేమ్ రాజ్ అనే యువకుడు సొంతవ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో ఇసుకరీచ్ తీసుకొని, చివరకు తాడేపల్లి ప్యాలెస్ కు కప్పంకట్టలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ప్రభుత్వం చెప్పేధరకు ఎక్కడైనా ఇసుక దొరుకుతుందా? ఇసుక అక్రమరవాణాను అరికట్టాల్సిన పోలీసులు, అధికారయంత్రాంగం ఎందుకు చోద్యం చూస్తోంది? ఇసుక మాఫియాలో సజ్జల కుమారుడి పేరు వినిపిస్తోంది.
టన్నుఇసుక ధర కేవలం రూ.470లు మాత్రమేనని పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. ఆ ధరకు ఎక్కడైనా ఇసుక దొరుకుతుందా అని ప్రశ్నిస్తున్నాం. చిత్తూరుజిల్లా నుంచి మంత్రి పెద్దిరెడ్డి నేత్రత్వంలో వందలాది ఇసుకలారీలు అటు చెన్నై, బెంగుళూరుకు తరలిపోతున్నాయి. కోస్తాంధ్రలోని ఇసుక రీచ్ లనుంచి వందలలారీలు హైదరాబాద్ కు తరలిపోతున్నాయి. ఎటువంటి బిల్లులు లేకుండా తమరాష్ట్రంలోకి వస్తున్న వందలాది ఇసుక లారీలను తెలంగాణప్రభుత్వం సీజ్ చేసింది వాస్తవంకాదా?
తెలంగాణ ప్రభుత్వం ఏపీ ఇసుకలారీలను సీజ్ చేసినా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీస్ యంత్రాంగం, రవాణాశాఖ ఎందుకు చోద్యం చూస్తోంది? సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే కొన్నిచోట్ల పోలీసులే ఇసుక రీచ్ లకు రక్షణగా ఉండటం. రాష్ట్రంలో పెచ్చరిల్లిన ఇసుకమాఫియాలో ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడి పేరు కూడా వినిపిస్తోంది. ఇరిగేషన్ శాఖ డ్రెడ్జింగ్ ద్వారా తీయాల్సిన ఇసుక తవ్వకాలను కూడా ప్రభుత్వం జేపీ వెంచర్స్ సంస్థకే అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.2కోట్ల విలువైన ఇసుకతవ్వకాలు చేస్తామని అనుమతి పొందిన జేపీ వెంచర్స్ సంస్థ, అనధికారికంగా రూ.10లక్షల కోట్ల విలువైన ఇసుక తవ్వకాలు జరిపింది నిజంకాదా?
సామాన్యుడికి ఇసుక దొరక్కపోయినా పర్లేదు… తన ఖజానా నిండితే చాలన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహరి స్తున్నది నిజంకాదా? జేపీ వెంచర్స్ సంస్థ సాగిస్తున్న ఇసుక తవ్వకాలపై కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) లో ఫిర్యాదు చేస్తే, దానిపై ఎన్జీటీ తవ్వకాలు జరపడానికి వీల్లేదని రీచ్ లను సీజ్ చేయాలని ఆదేశించినా జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదు?
ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో వైకుంఠ పురంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుకదోపిడీపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? ఆ ప్రాంతంలో ఏర్పడిన ఇసుక కొండలు ఈ ముఖ్యమంత్రికి కనిపించడం లేదా? రాష్ట్ర అధికారయంత్రాంగం మొత్తం ఉన్న ప్రాంతంలో జరిగే ఇసుకదోపీడీ ఈ ప్రభుత్వానికి కనిపించకపోవడానికి ప్రధాన కారణం దోపిడీనే.
రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఇసుక దోపిడీపై ముఖ్యమంత్రి నోరువిప్పాల్సిందే సజ్జల, డీజీపీ స్పందించాల్సిందే
తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ ఇసుకరీచ్ లో చంద్రబాబునాయుడు బయటపెట్టిన ఇసుక దోపిడీపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడు? రాష్ట్రంనుంచి తరలిపోతు న్న ఇసుక ఎక్కడికిపోతోంది.. దానిద్వారా వచ్చే సొమ్ము ఎటుపోతోందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి నోరు విప్పకపోతే, ఆ సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ కే చేరుతున్నట్టు భావించాలి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వందలకోట్ల ఇసుకదోపిడీ సొమ్ము ముఖ్యమంత్రికే అందుతోందని సుస్పష్టమని ప్రజలు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దోపిడీపై నీతిసూత్రాలు చెప్పే సజ్జల ఏం సమాధానం చెబుతాడు?
అధికారయంత్రాంగం, పోలీస్ వ్యవస్థ అండతో జరుగుతున్న ఇసుక దోపిడీ పై ముఖ్యమంత్రి స్పందించాల్సిందే. ఇసుక అక్రమరవాణాను అరికట్టడంలో పోలీస్ యంత్రాంగం ఎందుకు విఫలమైందో డీజీపీ సమాధానం చెప్పాలి.” అని నరేంద్ర డిమాండ్ చేశారు.