Suryaa.co.in

Andhra Pradesh

పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్న జగన్ రెడ్డి

– యనమల రామకృష్ణుడు

మీడియాపై వరుస దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు చోటు లేదు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఇలా వాటిని ఉసుగొల్పుతున్న జగన్ రెడ్డికి ప్రజాకోర్టులో ఓటమి తీర్పు తప్పదు. ప్రశ్నించే గళం వింటే జగన్ రెడ్డికి వణికిపోతున్నారు. వాస్తవాలు ప్రజలకు చేరవేసే మీడియా అంటేనే తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోతున్నాయి. అందుకే ప్రజలు, ప్రతిపక్షపార్టీలు, మీడియాపై యదేచ్చగా దాడులు చేయిస్తున్నారు.

ఓటమితో పాటు పరాభవం ఖాయమని తెలిసి ఉద్దేశ్యపూర్వకంగానే వైసీపీ రౌడీ మూక తెగబడుతున్నారు. చొక్కాలు మడతపెట్టండి అనడం, ప్రతిపక్ష నాయకుల ఫోటోలు పెట్టి కార్యకర్తలతో కొట్టించడం జగన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు నిదర్శనం. ఆయన ప్రతి సభల్లోను ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ -5ల పేరెత్తని సభ అంటూ ఉండదు.
జగన్ రెడ్డి నిరంకుశత్వ పాలనతో పాటు లాండ్, శాండ్, వైన్, మైన్, అత్యాచారాలు, హత్యలను వెలుగులోకి తెస్తున్న ఫోర్త్ ఎస్టేట్ పై దాడి చేయించడం అంటే ఆయన ఫ్యాక్షన్ మనస్తత్వానికి అద్దం పడుతుంది. నియంతలకు, నిరంకుశత్వ పాలకులకు ప్రజాస్వామ్యంలో చోటు లేదు. ఇలాంటి వారు కాలగర్బంలో కలిసిపోక తప్పదు.

పత్రికలపై దాడి చేయించమని జగన్ రెడ్డి ఉసిగొల్పుతున్నారంటే రాబోయే రోజుల్లో సాక్షి పత్రిక, మీడియా విలేకర్లకు భధ్రత లేకుండా చేస్తున్నట్లే. జగన్ రెడ్డి నవరత్నాల పేరుతో చేస్తున్న మోసపు సంక్షేమాన్ని మీడియా సంస్థలు ఎండగట్టాన్ని తట్టుకోలేకపోతున్నారు. అంతేకాకుండా జగన్ రెడ్డి అవినీతి, అక్రమాలు, భూకబ్జాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తున్నారని మీడియాపై దాడులు చేయిస్తున్నారు. నిన్న కర్నూలులో కాటసాని సైకో గ్యాంగ్ ఈనాడు కార్యాలయంపై పోలీసుల సమక్షంలో దాడులు చేశారు. మొన్న రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి విలేఖరిపై తీవ్రంగా దాడులు చేశారు.

మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యం గొంతు నొక్కే ప్రయత్నం
పత్రికలు, మీడియాలపై ఉక్కు పాదం మోపేందుకు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫిబ్రవరి 27, 2007న జీవో నెం. 938 ని విడుదల చేస్తే తండ్రి వారసత్వాన్ని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 20, 2019న జీవో నెం. 2430ని విడుదల చేశారు. గతంలో ఏబీఎన్, టీవీ -5, ఈ టీవీ ఛానళ్ల ప్రసారాలు నిలిపేయాలంటూ వైకాపా నాయకులు ఎమ్ఎస్ వోల మీద బలవంతంగా ఒత్తిడి తెచ్చారు.

మార్గదర్శిపై నిందలు మోపి, పోలీసులతో దాడులు చేయించి రామోజీరావును అక్రమ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేశారు. వాస్తవాలు ప్రజలకు చేరవేస్తున్నారన్న కక్షతో టీవీ5 కార్యాలయంపై రాళ్ల దాడి, బీఆర్. నాయుడు, సాంబశివరావు, మూర్తి లాంటి సీనియర్ జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించారు.

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై అక్రమ కేసు బనాయించిన జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందారు. జగన్ సభలో శ్రీ కృష్ణ అనే ఫోటో గ్రాఫర్ పై దాడికి పాల్పడ్డా ఇంత వరకు బాధితులపై చర్యలు తీసుకోలేదు. తునిలో ఆంధ్రజ్యోతి విలేకరి కాతా సత్యనారాయణ హత్యకు గురయ్యారు. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ విలేకరిపై హత్యాయత్నం, కోనసీమలోని ఐ పోలవరం ప్రజాశక్తి విలేకరిపై వైసీపీ కార్యకర్తల దాడి, నరసన్నపేట విశాలాంధ్ర విలేకరిపై దాడులకు పాల్పడ్డారు.

అమరావతి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నారని కుట్ర పూరితంగా ముగ్గురు విలేకరులపై అక్రమ కేసులు పెట్టారు. ఈటీవీ, ఏబీఎన్, టీవీ 5 ఛానళ్ల ప్రతినిధులను అసెంబ్లీ ప్రాంగణంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ప్రజా పక్షానా నిలుస్తున్న జర్నలిస్టులు, విలేకర్లు, మీడియా, పత్రికలపై ప్రభుత్వం జులం చేలాయించి పత్రికా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నం చేస్తోంది. జగన్ రెడ్డి ఎన్ని దాడులు చేయించినా, ఎంత మంది జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేసినా ప్రశ్నించే ప్రజా గొంతుకను ఆపలేడు.

LEAVE A RESPONSE