Suryaa.co.in

Andhra Pradesh

నవరత్నాల పేరుతో జగన్ రెడ్డి నయవంచన 9 సినిమాలు అట్టర్ ప్లాపే

• జగన్ చూడాల్సింది ఇక ప్రజల క్లైమాక్సే
• సంక్షేమం పేరుతో పాతపథకాలకు పేర్లుమార్చి, ప్రజల్ని ఏమార్చిన వైనం
• ప్రజలపై పన్నులు…ధరలభారం. రాష్ట్రంపై లక్షలకోట్ల అప్పులభారం.
• నాలుగున్నరేళ్ల పాలనలో నిరంతర దోపిడీతో దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా నిలిచిన జగన్ రెడ్డి.
• జగన్ రెడ్డి 9 సినిమాలు (నవరత్నాలు) అట్టర్ ప్లాపే. మిగిలింది ప్రజలు చూపించే క్లైమాక్సే.
– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి నెట్టిన జగన్ రెడ్డి నవరత్నాలతో పేదల్ని ఉద్ధరిస్తున్నట్టు చెబుతున్నాడని, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి నవమోసాలు అన్నట్టుగా తయారైందని, ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితికి మించి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.34 వేలకోట్ల అప్పుచేసిన వైసీపీప్రభుత్వం, చేసే అప్పులన్నింటికీ నవరత్నాలనే బూచిగా చూపుతోందని టీడీపీ అధికారప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ జగన్ రెడ్డి నవరత్నాల పేరుతో కొత్త పథకాలతో సరికొత్త సంక్షేమం ఏమైనా అమలు చేస్తున్నాడా అంటే అదేం లేదు. వేరే ప్రభుత్వాలు కట్టించిన భవనాలకు తనపార్టీ రంగు లేసుకున్నట్టే, పాతపథకాలకు పేర్లుమార్చి కేవలం ప్రచార ఆర్భాటంతో ముఖ్యమంత్రి ప్రజల్ని మోసగిస్తున్నాడు. సంక్షేమం ముసుగులో ప్రజల్ని పీక్కుతింటూ, ప్రకృతి వన రుల్ని దోచేసి, దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి నిలిచాడు.

నవరత్నాలు అనేవన్నీ గతప్రభుత్వాల హాయాంలో సమర్థవంతంగా అమలైన పథకాలే. రైతుభరోసా, జగనన్న విద్యాదీవెన, ఆరోగ్యశ్రీ, పెన్షన్ కానుక, వైఎస్సార్ జలకళ, మద్యపాన నిషేధం, పేదలకు ఇళ్లు, ఆసరా, చేయూత, అమ్మఒడి ఇవే ప్రభుత్వం చెబుతున్న నవరత్నాలు.

రైతుభరోసా : రైతులకు ఇచ్చింది గోరంత..ప్రచారం కొండంత
వీటిలో ఒక్కొక్కపథంక పనితీరు, అర్హులకు కలిగిన ప్రయోజనాలు పరిశీలిస్తే, జగన్ రెడ్డి మోసం, వైసీపీప్రభుత్వ మోసకారీ సంక్షేమం తెలుస్తుంది. రైతుభరోసా కింద రాష్ట్రం లోని ప్రతి రైతుకి ఏటా రూ.13,500లు అందిస్తున్నానని, దానివల్ల తమప్రభుత్వంపై రూ.31వేలకోట్ల భారం పడుతోందన్నది జగన్ రెడ్డి వాదన. నవరత్నాల్లో ఒక రత్నమైన రైతుభరోసా సాయంలో మొత్తం సొమ్ము జగన్ ప్రభుత్వం చెల్లించడం లేదు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిరైతుకి రూ.6,000లు ఇస్తే, మిగిలిన సొమ్ము వైసీపీప్రభుత్వం ఇస్తోంది. కేంద్రమిచ్చే సొమ్ము తానే ఇస్తున్నట్టు జగన్ రెడ్డి ప్రచారంతో ప్రజల్ని మోసగి స్తున్నాడు. వాస్తవంగా రైతుభరోసా కింద ఈ ప్రభుత్వం ఇప్పటివరకు పెట్టిన ఖర్చు కేవలం రూ.15వేలకోట్లు మాత్రమే. రైతులకు ఆర్థికసాయం అందించడమనేది జగన్ కొత్తగా తీసుకొచ్చిన పథకం కాదు. గతంలో టీడీపీ ప్రభుత్వం రైతురుణమాఫీ కింద 2014 -19 మధ్యన రూ.15,700కోట్ల సొమ్ముని కేవలం రైతులరుణాలకింద మాఫీ చేసింది.

అది కాకుండా అన్నదాతా సుఖీభవ పథకం కింద రాష్ట్రంలోని ప్రతిరైతుకి రూ.5వేలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో పడేలా చేసింది. మొత్తం కలిపితే రూ.21వేల కోట్లు. ఆ విధంగా చంద్రబాబునాయుడు ఐదేళ్లలలో రైతులకు అందించిన మొత్తం ఆర్థికసాయం రూ.21వేల కోట్లు. ఈ నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి అన్నదాతలకు అందించింది కేవలం రూ.15వేలకోట్లు. ఆఖరి ఏడాది మరో రూ.5వేలకోట్లు ఇచ్చినా రూ.20వేల కోట్లు అవుతుంది.

చంద్రబాబుకంటే జగన్ రెడ్డి రైతులకు అదనంగా చేసిన సాయం ఏమీ లేదు. కేవలం రైతుల్ని వంచిస్తూ, వారికి తీరని అన్యాయంచేస్తూ, రైతుభరోసా పేరుతో మభ్యపెడుతున్నాడు. ఈ లెక్కన జగన్ రెడ్డి చెప్పినట్టుగా రైతుభరోసా పథకం అసలు రత్నమే కాదు..కేవలం రంగురాయే.

జగనన్న విద్యాదీవెన… ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మిగిల్చింది వేదన
జగన్ రెడ్డి చెబుతున్న రెండోరత్నమైన ‘జగనన్న విద్యాదీవెన’ తీరుతెన్నులు పరిశీలిస్తే …., ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేశాడు. దాన్ని తరువాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి , రోశయ్యలు కూడా కొనసాగించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కింద ఇస్తున్న ఆర్థికసాయాన్ని చంద్రబాబు కూడా సమర్థవంతంగా అమలుచేశారు. దానికే జగన్ రెడ్డి విద్యాదీవెన అని పేరుమార్చి నవరత్నమన్నాడు.

2014-19 మధ్యలో చంద్రబాబునాయుడు ఫీజు రీయింబర్స్ మెంట్ కింద రూ.10,136 కోట్లను 16లక్షల మంది విద్యార్థులకు అందించారు. జగన్ రెడ్డి వచ్చాక దానిపేరుమార్చి, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల్ని ఏమార్చి కేవలం 9.86లక్షల మంది విద్యార్థులకి, రూ.9,947కోట్ల సొమ్ము మాత్రమే ఫీజు రీయిం బర్స్ మెంట్ కింద అందించాడు. ఈ విధంగా అర్హులైన 6లక్షల మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థు లకు తీవ్ర అన్యాయం చేశాడు.

టీడీపీ ప్రభుత్వం మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 1.43 శాతం నిధులు ఫీజు రీయింబర్స్ మెంట్ కు ఖర్చుచేస్తే, నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి కేవలం 0.82శాతమే ఖర్చు పెట్టాడు. ఈ విధంగా రెండోనవరత్నమైన విద్యాదీవెన పథకంలో కూడా జగన్ రెడ్డి తన మార్క్ మోసం చూపించి పేద విద్యార్థుల నోట్లో మట్టికొట్టాడు.

ఆరోగ్య శ్రీ … ఆసుపత్రుల యాజమాన్యాలు బెంబేలెత్తుతుంటేవైద్యసేవలు అందక ప్రజలు నరకయాతన పడుతున్నారు
ఇక మూడోరత్నమైన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలు రాష్ట్రంలో మరింత అధ్వాన్నంగా తయారైంది. వాస్తవానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా రాజశేఖర్ రెడ్డే తీసుకొచ్చాడు. దాన్ని తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారు. చంద్రబాబు హాయాంలో 900 కొత్త జబ్బుల్ని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చి నిధుల కేటాయింపులు పెంచారు. ఈ పథకం కూడా తానే తీసుకొచ్చి ప్రజల్ని ఉద్ధరిస్తున్నానని జగన్ రెడ్డి డబ్బాలు కొడుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందించలేమని ఆసుపత్రుల యాజమా న్యాలు తెగేసి చెబుతున్నాయి.

ప్రభుత్వం నుంచి బిల్లులు రావడంలేదని, పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యసేవలు అందించలేమంటున్నాయి. నవరత్నాల్లో మూడోదైన ఆరోగ్య శ్రీ కూడా జగన్ రెడ్డి హాయాంలో పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నతీరుగా తయారైంది.

పెన్షన్ కానుక : పింఛన్ రూ.3వేలకు పెంచుతానన్న హమీకి జగన్ తిలోదకాలు
నాలుగోరత్నమైన ‘పెన్షన్ కానుక’ లో జగన్ రెడ్డి చేసిన మోసం అంతా ఇంతా కాదు. అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పింఛన్ ను రూ.3 వేలకు పెంచుతానని చెప్పి అవ్వాతాతల్ని, వితంతు..వికలాంగుల్ని మభ్యపెట్టి, అమల్లోకి వచ్చేసరికి ఏటా రూ.250 చొప్పున పెంచుతూ, వారిఆశల్ని నట్టేట ముంచాడు. పింఛన్ల చెల్లింపుని ఏ ముఖ్యమంత్రి అమలుచేయని విధంగా సమర్థవంతంగా అమలుచేసింది చంద్రబాబే.

ఉమ్మడి రాష్ట్రంలో రూ. 75లు ఉండే పింఛన్ ను రూ.200లకు పెంచిన చంద్రబాబు, విభజనానంతర ఏపీలో దాన్ని రూ.2000లకు పెంచాడు. రూ. 200ల పింఛన్ రూ.2వేలకు పెంచిన చంద్రబాబు రాష్ట్రవ్యాప్తం గా 54లక్షల మంది అర్హులకు పింఛన్ ఆర్థికసాయం అందించారు. సామాజిక పింఛన్ ను రూ.3వేలకు పెంచుతానన్న జగన్ రెడ్డి తనహామీని తుంగలోతొక్కి, నాలుగేళ్లలో రూ.2,750కు పెంచాడు.

పింఛన్ లబ్ధిదారు ల సంఖ్యలో కూడా కోతలు పెట్టడం… మరలా కొత్తవి చేర్చడం చేస్తూ అసలైన అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. పింఛన్లు అనేవి తానేకొత్తగా ఇస్తున్నట్టు… దాని అమలు కోసమే అప్పులు చేస్తున్నట్టు అబద్ధాలు చెబుతు న్నాడు.

వైఎస్సార్ జలకళ : నాలుగున్నరేళ్లలో ఒక్క ప్రాజెక్ట్ కట్టి, ఒక్కఎకరాకు నీరిచ్చింది లేదు. రైతులు ఏడుస్తుంటే, జగన్ రెడ్డిని నమ్ముకున్న కాంట్రాక్టర్లు సంతోషిస్తున్నారు
ఐదో నవరత్నమైన ‘వైఎస్సార్ జలకళ’ ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా సక్రమంగా సమర్థవంతంగా అమలైంది లేదు. గతంలో రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం అని, భారీఅవినీ తికి పాల్పడితే, దానికి కొనసాగింపుగా జగన్ రెడ్డి జలకళ అంటున్నాడు. నాలుగేన్నరే ళ్లలో సాగునీటి రంగాన్ని సర్వనాశనం చేసి, టీడీపీహాయాంలో 80 నుంచి 90శాతం పూర్తైన ప్రాజెక్టుల్ని కూడా పూర్తిగా నాశనంచేసి, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుని గోదాట్లో ముంచేసిన ఘనత జగన్ రెడ్డిదే.

టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్యన పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ని 72శాతం పూర్తిచేసింది. అలానే ముచ్చుమర్రి, పట్టిసీమ, నెల్లూరుసంగం బ్యారేజ్ వంటి వాటిని పూర్తిచేసింది. ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.68 వేలకోట్ల వరకు ఖర్చుపెట్టింది. జగన్ రెడ్డి మాత్రం రూ22వేల కోట్లను కేవలం కాంట్రాక్టర్లకు చెల్లించాడు. ఈ విధంగా అతి ముఖ్యరత్నమైన జలకళ పథకం పూర్తిగా నీరుగారింది.

మంటగలిసిన మద్యపాన నిషేధం : కల్తీమద్యాన్ని అధికధరకు అమ్ముతూ, పేదల బలహీనతను సొమ్ముచేసుకుంటున్న జగన్ రెడ్డి అతని గ్యాంగ్
ఇక ఆరో రత్నమైన మద్యపాన నిషేధం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది. వైసీపీనేతలు మద్యపాన నిషేధం అమలుచేశామంటే ఆడవాళ్లు వెంటపడి కొడుతున్నారు. మద్యాన్ని నిషేధిస్తానని, కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలో ఖరీదైన మద్యం మాత్రమే అందు బాటులో ఉంచుతానని ఎన్నికలకు ముందు చెప్పిన అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలతోనే రూ.లక్షకోట్లకుపైగా సంపాదించాడు.

అక్రమార్జన కోసం నాసిరకం మద్యాన్ని తనపార్టీవాళ్లతోనే అధికధరకు అమ్మిస్తూ, మద్యం సేవించేవారి బల హీనతను సొమ్ము చేసుకుంటున్నాడు. 2022-23, 2023-24 బడ్జెట్లు పరిశీలిస్తే, మద్యం ద్వారా రూ.25వేలకోట్లు రావాలని, వైసీపీప్రభుత్వం అంచనా వేసింది. కానీ మొత్తంగా నాలుగేళ్లలో రూ.లక్షకోట్లకు పైగా రాబట్టింది.

మద్యం తయారీ, అమ్మకాలు అంతా వైసీపీనేతలకే అప్పగించిన జగన్ రెడ్డి నిస్సిగ్గుగా మద్యంద్వారా వచ్చేసొమ్ముతోనే ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇంత జరిగాక ఆరో రత్నం మద్యపాన నిషేధం రాష్ట్రంలో అమలైంది చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటే. ప్రజలు కల్తీమద్యం తాగి తాగి మరణిస్తుంటే, నవరత్నం ఎలా అవుతుందో జగన్ రెడ్డే చెప్పాలి.

పేదలకు ఇళ్లు…నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి మిగిల్చాడు కన్నీళ్లు. సెంటు పట్టాల పేరుతో రూ.7వేలకోట్ల దోపిడీ. వైసీపీ ప్రభుత్వం కట్టింది కేవలం 5 ఇళ్లేనన్న కేంద్రం
ఏడవ రత్నమైన పేదలకు ఇళ్లనిర్మాణం మరీ దారుణం. ఇళ్ల నిర్మాణం ముసుగులో నాలుగేళ్లలో జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం వేలకోట్లు దోచేసింది. ఏటా 5లక్షల చొప్పున 5 ఏళ్లలో 25లక్షల ఇళ్లు నిర్మిస్తానని జగన్ రెడ్డి ప్రగల్భాలు పలికాడు. కానీ ఏపీ ప్రభుత్వం నాలుగేళ్లలో కట్టిన ఇళ్లు కేవలం 5 మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.

టీడీపీహాయాంలో చంద్రబాబు నిర్మించిన 5 లక్షల టిడ్కోఇళ్లను కూడా జగన్ ప్రభుత్వం పాడుపెట్టింది. సెంటు పట్టాలు పేదలకు ఇస్తున్నట్టు నమ్మించి, నిర్మాణాలకు పనికిరాని భూముల్ని కారుచౌకగా కొని, ప్రభుత్వానికి అంటగట్టి, రూ.7వేలకోట్లవరకు వైసీపీ నేతలు దోచేశారు. ఈ విధంగా ఏడో రత్నమైన పేదలకు ఇళ్లుపథకం ప్రజలకు ఏడుపే మిగిల్చింది.

ఆసరా చేయూత.. జగన్ రెడ్డి హాయాంలో ఆడబిడ్డలకు తీరని గుండెకోత
ఎనిమిదో రత్నమైన ఆసరా, చేయూత పేరుతో జగన్ రెడ్డి ఆడబిడ్డల్ని దారుణంగా వంచించాడు. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీచేస్తానన్న జగన్ రెడ్డి రూ.27వేలకోట్లు రద్దుచేయాల్సి ఉంటే, నాలుగేళ్లలో తూతూమంత్రంగా కేవలం రూ.12 వేలకోట్లే మాఫీచేశాడు. అలానే 45 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు ఏటా రూ.15వేలు ఇస్తానన్న హామీని కూడా జగన్ విస్మరించాడు.

నాలుగున్నేరేళ్ల పాలనలో ఎప్పుడూ దాని ఊసే ఎత్తింది లేదు. తెలుగుదేశం ప్రభుత్వం 2014-19మధ్యన ప్రతి డ్వాక్రా మహిళకు మూడు వాయిదాల్లో రూ.20వేల ఆర్థికసాయం అందించింది. ఆ విధంగా 94 లక్షల మంది డ్వాక్రామహిళలకు లబ్ది చేకూర్చింది. అదీ చంద్రబాబు చిత్తశుద్ధి. ఈ పథకం కూడా జగన్ రెడ్డి మోసానికి బలైంది.

అమ్మఒడిని ఆంక్షల సుడిగా మార్చి, తల్లుల్ని మోసగించి, నాన్నబుడ్డి కింద ఇచ్చిన దానికంటే ఎక్కువ కొట్టేస్తున్న జగన్ రెడ్డి
అమ్మఒడి పథకాన్ని జగన్ రెడ్డి ఆంక్షల ఒడిగా మార్చి, అర్హులైన విద్యార్థులకు అన్యాయం చేశాడు. ఎన్నికలకు ముందు ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే, ఒక్కొక్కరికీ ఏటా రూ.15వేలచొప్పున నేరుగా తల్లుల ఖాతాల్లో వేస్తానని జగన్ చెప్పాడు. పదవి చేపట్టగానే ఇంటికొకరికే ఇస్తానని మెలిక పెట్టి, నాలుగేళ్లలో ఒక సంవత్సరం పూర్తిగా విద్యార్థులకు రూ.6వేలకోట్లు ఎగ్గొట్టాడు.
రూ.15వేలను ఏటా కొంతతగ్గిస్తూ, రూ.13వేలకు చేర్చాడు. ఇలా ఈ పథకం కూడా జగన్ కపటపాలనతో నీరుగారిపోయింది. అమ్మఒడి తీసుకునే ప్రతి తల్లి నాన్నబుడ్డి కింద తమకు ఇచ్చేదానికంటే కొట్టేస్తున్నదే ఎక్కువని వాపోతోంది. జగన్ రెడ్డి చెబుతు న్న 9 సినిమాలు (నవరత్నాలు) అట్టర్ ప్లాప్ లే. మిగిలింది ప్రజలు పూర్తిచేయాల్సిన క్లైమాక్సే.

నవరత్నాల పేరుతో ప్రజలకు వంచన, అదనంగా వారిపై పన్నులు…ధరలభారం.. రాష్ట్రంపై అప్పులభారం… వాస్తవంలో నాలుగేళ్లలో కొనసాగింది కేవలం జగన్ రెడ్డి దోపిడీనే
ఈ విధంగా నవరత్నాల అమలుని నవమోసాలుగా మార్చిన జగన్ రెడ్డి, అప్పులు చేస్తున్న సొమ్ముని దిగమింగుతూ, మొత్తం ప్రజలకోసమే అప్పులుతెస్తున్నానని నిస్సిగ్గుగా అబద్ధమాడుతున్నాడు. పాతపథకాలకు పేర్లుమార్చి, నవరత్నాలుగా కుదించి, ప్రజలచెవిలో పూలు పెడుతూ, ఇష్టానుసారం అప్పులుతెస్తూ, ప్రజల నెత్తిన, రాష్ట్రంపైన మోయలేని అప్పులభారం మోపాడు.

వాస్తవంగా జగన్ రెడ్డి అమలుచేసే అత్తెసరు పథకాలకంటే చంద్రబాబు అందించినవే ఎక్కువ. అన్నాక్యాంటీన్లు, సంక్రాంతి కానుక, పెళ్లికానుక, నిరుద్యోగభృతి, తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్, బాలింతలకు, చిన్నారులకు పౌష్ఠికా హారం, విదేశీవిద్య, మహాప్రస్థానం వంటి అనేక పథకాలు జగన్ రద్దుచేశాడు. అలానే ఎస్సీ..ఎస్టీ, బీసీలు, మైనారిటీల కోసం చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా అమలుచేసిన దాదాపు 120కు పైగా పథకాల్ని జగన్ రెడ్డి ఒకే ఒక్క కలంపోటుతో రద్దుచేశాడు.

గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలు రద్దుచేసినప్పుడు ప్రజలకు అందించే సంక్షేమానికి ఎక్కువ ఖర్చు ఎందుకవుతుందో జగన్ రెడ్డే చెప్పాలి. టీడీపీ అమలు చేసిన పథకాలన్నీ తీసేసి నవరత్నా లని చెప్పి ప్రజల్ని ఏమార్చి నాలుగేళ్లలో వారిని, రాష్ట్రాన్ని దారుణంగా దోచేశాడు. చేసిన దోపిడీ చాలదన్నట్లు ప్రజలపై పన్నులభారం మోపి, అడ్డగోలుగా అప్పులుచేస్తూ, అందిన కాడికి స్వాహా చేసేశాడు.” అని విజయ్ కుమార్ వివరించారు.

LEAVE A RESPONSE