Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌రెడ్డీ… ఇదీ అప్పుల గొప్పల కథ

• రోజుకి RBI నుంచి తీసుకుంటున్న అప్పు రూ.257 కోట్లు… రోజువారీ వడ్డీ రూ.80 కోట్లు
• రోజువారీ ఖర్చు రూ.698 కోట్లు.. సొంత ఆదాయం రూ.264 కోట్లే
• రోజువారీ సొంత ఆదాయంలో రూ.100కోట్లకు పైగా పెట్రోల్.. డీజిల్.. మద్యం అమ్మకాల ద్వారా వస్తున్నవే
• అప్పుల్లో FRBM పరిధి దాటడం లేదంటున్న మంత్రి బుగ్గన, ఆర్థికశాఖ కార్యదర్శి రావత్ ల వాదన పచ్చి అబద్ధం
• 2023-24 ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్-డిసెంబర్) కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన అప్పుల పరిమితి కేవలం రూ. 30, 275 కోట్లు మాత్రమే
• కానీ జగన్ సర్కార్ చేసిన అప్పు రూ.69,736 కోట్లు. ఏ ప్రాతిపదికన పరిమితికి మించి రెండింతల అప్పు చేశారు?
• దేశంలో ఏ రాష్ట్రం ఒప్పుకోకున్నా.. జగన్ సర్కార్ మాత్రం రూ.5వేలకోట్ల అదనపు అప్పుకోసం, రైతుల వ్యవసాయమోటార్లకు కెపాసిటర్లు పెడతామనే ఆర్బీఐ నిబంధనకు తలొగ్గింది
• రాష్ట్ర అప్పులకు సంబంధించి కాగ్ నివేదికలోని అంశాలు వాస్తవమో..కాదో మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణలే సమాధానం చెప్పాలి
• మార్చి 22024 నాటికి రాష్ట్ర అప్పు రూ.4.85లక్షల కోట్లకు చేరుతుందని ఇప్పటికే ఆర్బీఐ అంచనా వేసింది
• కార్పొరేషన్ అప్పులు. ఉద్యోగులు బకాయిలు.. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన చెల్లింపులు..డిస్కంల బకాయిలు అన్నీ కలిపితే రాష్ట్ర అప్పు రూ.11లక్షల కోట్లకు చేరుతుంది
• 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.2.64లక్షల కోట్లు మాత్రమేనని ఆర్బీఐ స్పష్టం చేసింది
• ఈ 5 ఏళ్లలో సుమారు రూ.8.50 లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ సర్కార్
– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

జగన్ రెడ్డి హయాంలో సాధారణ పాలన అస్తవ్యస్తం, అధ్వాన్నంగా ఉంటే, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన వ్యవహారాల్లో అంతకంటే దారుణంగా తయారైందని, వైసీపీప్రభుత్వం రోజుకి రూ.257కోట్ల అప్పు చేసింది అనడానికి కాగ్ (Comptroller and Auditor General of India) లెక్కలే నిదర్శనమని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. ఇంతగా అప్పులు చేస్తూఎఫ్.ఆర్.బీ.ఎమ్ పరిధి దాటడం లేదని మంత్రి బుగ్గన, ఆర్థికశాఖ అధికారులు జంకూ..బొంకూ లేకుండా అబద్ధాలు చెబుతున్నారని ఆయన అన్నారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ప్రభుత్వం కాంట్రాక్టర్లకు, టీచర్లకు, ఉద్యోగులకు వేలకోట్లు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎటుపోతోందో తెలియదు. ఆర్థికశాఖ అధికారు లేమో అప్పులకోసం ఢిల్లీలో కాళ్లు అరిగేలా తిరుగుతూ దేహి అని వేడుకుంటు న్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది.. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎందుకింత అధ్వాన్నంగా తయారైందో చూద్దాం.

FRBM పరిధి దాటడం లేదు అని ప్రభుత్వం చెబుతున్నదంతా పచ్చి అబద్ధం. అప్పుల మాదిరే జగన్ రెడ్డి ప్రభుత్వ అబద్ధాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి.
వేజ్ & మీన్స్ మొదలుకొని, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ సొమ్ములు కూడా RBI నుంచి తీసేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ పాలన ముగింపు దశకు వచ్చింది.
ఈ ప్రభుత్వం ఏప్రియల్ నుంచి డిసెంబర్ వరకు (ఆర్థిక సంవత్సరంలో) రోజుకి రూ. 257 కోట్ల అప్పు చేసింది. ఈ సత్యం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చేసే అప్పు అంత ఉంటే, జగన్ ప్రభుత్వం రోజుకి పెట్టే ఖర్చు: రూ. 698 కోట్లు
(డిసెంబర్ దాకా 1,88,324 కోట్లు ఖర్చు పెట్టింది – అంటే నెలకి– రూ. 20,924 కోట్లు – రోజుకి రూ. 698 కోట్లు) దానిలో ప్రభుత్వం రోజుకి సొంతంగా సంపాదించేది మూడో వంతే- కేవలం రూ. 264 కోట్లు మాత్రమే. మరి మిగతా రూ.434 కోట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి అంటే, దానిలో రోజుకి రూ.257 కోట్ల అప్పుల సొమ్మే ఉంది. అదికాకుండా..
– రూ. 73 కోట్లు కేంద్రం నుంచి పన్నుల వాటా,
– కేంద్ర గ్రాంటులు రూ. 89 కోట్లు
– కేంద్రం నుంచి వచ్చే ఇతర రుణాలు రూ. 50 కోట్లు
– రూ.257 కోట్ల రోజువారీ అప్పులు కేవలం RBI ద్వారా తీసుకొన్న సొమ్ము.
– కార్పొరేషన్ అప్పులు వేరే. అవి కూడా కలిపితే రోజుకి సులభంగా రూ. 300 కోట్లు దాటి పోయే అవకాశముంది.

అప్పులు తీసుకోవడం తప్పేమీ కాదు, కేంద్రం కూడా చేస్తోందిగా అంటూ చేస్తున్న అప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మంత్రి బుగ్గన, ఆర్థికశాఖ కార్యదర్శి రావత్ లాంటి మేథావులు అబద్ధాలు చెప్పడం ఇంకా పెద్దతప్పు.

రాజ్యాంగం ప్రకారం, కేంద్రం అప్పులు తీసుకోవడానికి రాష్ట్రాల మాదిరి అనుమతి అక్కర్లేదు. కానీ రాష్ట్రాలు అప్పు తీసుకోవాలి అంటే, కేంద్రం అనుమతి కావాలి. అప్పులు తీసుకుంటు న్నారు అంటే మాత్రం.. మంత్రి బుగ్గనకు తెగ కోపం వచ్చేస్తుంది. అదే వ్యక్తి ప్రతి మంగళ వారం అప్పులకోసం నానా అవస్థలు పడుతుంటారు. మేము FRBM పరిధిలోనే అప్పులు తీసుకొంటున్నాము అని అడ్డగోలుగా వాదిస్తారు. తాను చెప్పేది ఎంత నిజమో బుగ్గనే సమాధానం చెప్పాలి.

2023-24 ఏప్రిల్ – డిసెంబర్ – 9 నెలలకు ఇచ్చిన అప్పు పరిమితి ఎంతో చెప్పాలని విజయ్ కుమార్ తెలుగుదేశం తరుపున సవాల్ విసిరారు 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక శాఖ ఏపీకి ఇచ్చిన అప్పుల అనుమతి (FRBM) కేవలం రూ. 30, 275 కోట్లు మాత్రమే! FRBM పరిమితి ఏమైనా పెంచితే ఈ ఒక్కసారైనా నిజం చెప్పమని ఆర్థిక మంత్రి బుగ్గనను, ఆర్థిక శాఖ అధికారుల్ని అడుగుతున్నాం.

ఒక వేళ మీ వత్తిడితో కేంద్రం ఏమైనా పెంచి ఉంటే అదైనా ధైర్యంగా చెప్పండి…మీరిప్పటి దాకా FRBM లిమిట్ పెంచారు అని ఈ 9 నెలల్లో ఎప్పుడూ చెప్పలేదు. ప్రభుత్వం పారదర్శకత ఏమాత్రం పాటించడం లేదని కేంద్రఆర్థిక శాఖ ఇచ్చిన FRBM లిమిట్ ఎంతో ఈ ప్రభుత్వం ఏనాడూ ప్రజలకు చెప్పిన పాపాన పోలేదని విజయ్ కుమార్ అన్నారు. FRBM పరిమితిపై వాస్తవాలు వెల్లడించాలని ఆయన బుగ్గనకు సవాల్ విసిరారు.

డిసెంబర్ CAG రిపోర్ట్ లో ఇచ్చిన రూ.69736.83 కోట్ల అప్పు నిజమో కాదో ప్రభుత్వం తేల్చిచెప్పాలి. FRBM పరిమితి కంటే అప్పు ఎక్కువ తీసుకోవడం FRBM ను అధిగమించినట్టు కాదా? దేశంలో రైతుల పంపు సెట్లకు capacitor లు పెడుతామని ఒప్పుకొన్న ఏకైక రాష్ట్రం ఏపీనే. అంటే మొదట ఇచ్చిన రూ.30,275 కోట్ల పరిమితికి incentive గా సుమారు రూ. 5000 కోట్లు అదనంగా లిమిట్ ఇచ్చారు. FRBM పరిమితి 35,275 కోట్లకు చేరింది. కాగ్ నివేదిక ప్రకారం వైసీపీ ప్రభుత్వం డిసెంబర్ దాకా చేసిన అప్పు : రూ. 69,736.83 డిసెంబర్ నాటి లిమిట్ కు చూస్తే, RBI నుంచే 100౦ శాతం అదనంగా అప్పు చేశారు. అంటే రెండు FRBM లిమిట్ లకు సరిపడా వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసింది.

మార్చి- 2024 నాటికి రాష్ట్ర అప్పు 4.85 లక్షల కోట్లు అని ఆర్బీఐ అంచనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ డెట్ లో భాగంగా RBI ద్వారా అధికారికంగా రూ.4, 85,490 కోట్ల అప్పులు 2024 మార్చి నాటికి తీసుకుంటుందని RBI తన తాజా నివేదిక లో పేర్కొంది. ఆ అప్పులకు కార్పొరేషన్ అప్పులు, డిస్కంల అప్పులు, ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు, కాంట్రాక్టర్ల బకాయిలు, ఉద్యోగులకి ఇవ్వాల్సిన డీఏల వంటివన్నీ కలిపితే, మనకున్న సమాచారం మేరకు రాష్ట్ర అప్పు 11 లక్షల కోట్ల చేరువలో ఉంది.
RBI నివేదిక ప్రకారం RBI ద్వారా మాత్రమే తీసుకొన్న ఆంద్ర ప్రదేశ్ అప్పులు ఇవి :
– 2019 నాటికి 2,64,451 కోట్లు
– 2023 నాటికి 4,28,715 కోట్లు
– 2023-24 – ఏప్రియల్ : సెప్టెంబర్ మధ్యలో 41,500 కోట్లు
– అంటే మొత్తంగా ఈ 5 ఏళ్లలో ఏపీ RBI ద్వారా చేసిన స్థూల అప్పులు 2.5 లక్షల కోట్లకు పైమాటే. అంటే సంవత్సరానికి రూ.50,000 కోట్లు. ఇవి కాకుండా కార్పొరేషన్ అప్పులు తదితరాలు అన్నీ కలిస్తే రూ.11 లక్షలకోట్లకు చేరతాయి.

GSDP ప్రకారం అప్పు చేస్తున్నామనేది పనికిమాలిన వాదన
ప్రతిరోజూ రూ. 257 కోట్లు అప్పుచేస్తూ, ఖర్చుపెడుతుంటే, ఆర్ధిక వ్యవస్థలో క్రయ విక్రయాలు జరుపుతుంటే…. మరి మొత్తం క్రయ విక్రయాలు పెరగకుండా ఉంటాయా? అదే కదా GSDP అంటే. సంవత్సరానికి లక్ష కోట్లకు పైగా అప్పులు వివిధ మార్గాల్లో తెచ్చి ఖర్చు పెడుతుంటే, ఒక్కో రూపాయి ఆర్ధిక వ్యవస్థలో రెండు సార్లు చేతులు మారినా కూడా రెండు లక్షల కోట్ల అదనపు విక్రయాలు జరిగినట్టే కదా!

దాన్ని చూపించి GSDP పెరిగిపోయింది అని డప్పు కొట్టుకొంటే ఎలా అని వైసీపీప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అప్పు చేసేది..ఖర్చు పెట్టేది, ఆర్ధిక వ్యవస్థలో జరిగిన క్రయ విక్రయాలు చూపించి GSDP పెరిగిపోయింది అని మళ్లీ అదనంగా అప్పు తెచ్చుకోవడం.. ఇదీ జగన్ సర్కార్ వరస. ఇదేమి ఆర్థిక పాలసీనో బుగ్గన మరియు జగన్ రెడ్డే చెప్పాలి. దీని వలన అప్పులు పెరగడం తప్ప, ఆర్ధిక వ్యవస్థలో బయట నుంచి వచ్చే డబ్బే ఎక్కడుంది? అంతా జగన్ రెడ్డి చేసిన అప్పులే కదా!

స్థూల ఉత్పత్తిలో రాష్ట్ర అప్పుల శాతం ఎంతో తెలుసా?
జీఎస్డీపీ తెగ పెరిగింది అని చెప్తూంటారు బుగ్గన. ఆ జీఎస్డీపీ లో మన అప్పులు శాతమో ఆర్థిక మంత్రికి తెలుసునా? అక్షరాలా…33.5%. మన కంటే ఎక్కువ అప్పుల శాతం ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్. తర్వాత మహారాష్ట్ర – 18%, కర్ణాటక, 22% , తెలంగాణా, 27%, ఒడిశా, 14%. ఇంత స్పష్టంగా అయినకాడికి అప్పులు చేస్తూ, అప్పులు ఎక్కువ చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటుంటే, లేనేలేదు అంటూ కాకి లెక్కలు చెప్పడం పాలకులకు రివాజుగా మారింది.

సంపాదన అంతంతే
అప్పులకు తగినట్టు సంపాదన బ్రహ్మాండంగాఉందా అంటే..అదీ లేదు. డిసెంబర్ దాకా మనకు అందుబాటులో ఉన్న లెక్కలను చూస్తే…. ఈ సంవత్సరంలో, కేంద్రము ఇచ్చే పన్నులు వాటా, కేంద్రం ఇచ్చే గ్రాంటులు…ఇత్యాదులు పక్కన పెడితే.. రాష్ట్రం తనకు తానుగా సంపాదించింది … కేవలం రూ.71, 396 కోట్లు. అంటే డిసెంబర్ దాకా నెలకు రూ. 7933 కోట్లు మాత్రమే. అంటే రోజుకు రూ. 264 కోట్లు పోనీ ఆ సంపాదనంతా ఏమైనా క్వాలిటీ సంపాదనా అంటే అదీ లేదు. బయట నుంచి రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు కట్టే పన్నులా అంటే అవీ కావు.

కేవలం ప్రజల దగ్గర ముక్కుపిండి వసూలు చేసే పన్నులే. రోజుకి 41 కోట్లు మద్యం అమ్మకాల ద్వారా, రూ. 51 కోట్లు పెట్రోల్, డీజీల్ మీద సేల్స్ ట్యాక్స్ ఆదాయం, వెరసి 34 % ఆదాయం వస్తోంది. అంటే ఈ ప్రభుత్వం చెప్పుకుంటున్న సొంత ఆదాయంలో మూడో వంతు ప్రజలపై మోపే పన్నులే. బయట నుంచి వచ్చే కంపెనీలు, సంస్థలు కట్టే పన్నులు సగం కూడా లేవు.. జగన్ రెడ్డి, మంత్రి బుగ్గనేమో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ భలేగా ఉంది అంటూ వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటారు.

రోజువారీ ఖర్చు 698 కోట్లలో వడ్డీలకే రూ.85కోట్లు
రూ.698 కోట్ల రోజువారీ ఖర్చులో కేవలం వడ్డీ చెల్లింపులకే రోజుకి 85 కోట్లు చెల్లిస్తున్నారు. ఇది కేవలం ఆర్బీఐ ద్వారా తీసుకొన్న అప్పులకు చెల్లిస్తున్న వడ్డీ మాత్రమే. ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి చెప్పిన కార్పొరేషన్ ల ద్వారా తీసుకొన్న 1, 97, 895 కోట్లకి ఎంత వడ్డీ చెల్లిస్తున్నారనేది ఆయనే చెప్పాలి. ప్రతిరోజూ తీసుకొనే 257 కోట్ల అప్పులో రూ. 80 కోట్లు వడ్డీకే పోతుంటే, ఇక మనం పెట్టుబడుల మీద పెట్టే ఖర్చు ఏముంటుంది?

వచ్చే ఆదాయంలో మనకంటే తక్కువ వడ్డీలు కట్టే రాష్ట్రాలు దేశంలో 21 ఉంటే, మనం 22 వ స్థానంలో ఉన్నాము. మన కంటే ఎక్కువ కట్టే వాళ్లు ఇంకాఉన్నారు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తదితర రాష్ట్రాలు. కానీ ఆయా రాష్ట్రాల GSDP మనకన్నా రెండింతలు ఎక్కువగా ఉంది. తక్కువ GSDPతో ఏపీ కంటే ఎక్కువ వడ్డీ కట్టే రాష్ట్రాలు పంజాబ్, పశ్చిమ బెంగాల్ మాత్రమే. ఈ వడ్డీమొత్తం ప్రతి సంవత్సరం 14 శాతం చొప్పున పెరుగు తూ వస్తోంది. ఈ వడ్డీలకి కార్పొరేషన్ ల ద్వారా తీసుకొన్న లక్షల కోట్ల అప్పులు కూడా కలిపితే, సంవత్సరానికి చెల్లించే వడ్డీ సులభంగా రూ.60 వేల కోట్లు దాటిపోతుంది..

పెట్టుబడుల మీద ఖర్చులో 15 వ స్థానం..
రాష్ట్రంలో పెట్టుబడుల మీద పెట్టే ఖర్చు 2022-23 లో 16,846 కోట్లు మాత్రమే. అంతకు ముందు సంవత్సరమూ అంతే. పెట్టుబడులలో దేశంలో ఏపీ 15 వ స్థానంలో ఉంది. మనకంటే, తక్కువగా ఈశాన్య రాష్ట్రాలు, గోవా, జమ్మూ, హిమాచల్, ఝార్ఖండ్ వంటివి ఉన్నాయి. ఇలాంటి స్థితిలో రాష్ట్రం ఉండటం నిజంగా సిగ్గు చేటు.

మొత్తం ఆదాయంలో రాష్ట్రానికి పన్నులపై వచ్చే సొంత ఆదాయంలో ఏపీది 9వ స్థానం
మొత్తం ఆదాయంలో మన సొంత పన్నుల ఆదాయం 70 శాతం దేశంలో 9వ స్థానంలో ఉన్నాం. మనం మినహా మొత్తం, తెలంగాణాతో సహా 4 దక్షిణాది రాష్ట్రాలు, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ అన్నీ మనకన్నా ముందే…. మొత్తం ఆదాయంలో పన్నేతర ఆదాయం (నాన్ టాక్స్ రెవిన్యూ)లో 4 శాతం పన్ను ఆదాయంతో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ 15వ స్థానంలో ఉంది. మనరాష్ట్రం కంటే తక్కువ ఉండేది బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలే.

రాష్ట్రం ఇచ్చిన బ్యాంక్ గ్యారెంటీ లలో, దేశంలో మన స్థానం ..
సందేహమే లేదు… దేశంలో మన రాష్ట్రానిదే అగ్రస్థానం. 2023 రివైస్డ్ అంచనాల ప్రకారం రూ.1,38,874 కోట్లు. ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ విలేకరులకు చెప్పిన ప్రకారం 1,97, 895 కోట్లు. మనకు దగ్గరగా ఉన్నది రూ. 90,451 కోట్లతో తమిళనాడు. దేశంలో ఇంకే రాష్ట్రమూ మనలో సగం కూడా లేదు. కార్పొరేషన్ అప్పులు రిజర్వ్ బ్యాంక్ పరిధిలోకి రావు కాబట్టి, వాటి వివరాలు రిజర్వ్ బ్యాంక్ ఇవ్వలేదు.

ఆదాయ సముపార్జనలో, ప్రాధాన్యత రంగాలకు న్యాయం చేయడంలో, అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో జగ్ రెడ్డి అంచనాలు దారుణంగా దెబ్బతిని, రాష్ట్రం అన్నిరంగాల్లో చివరిస్థానంలో నిలిచింది ” అని విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE