• ముఖ్యమంత్రి స్వప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి
• కృష్ణా మిగులు జలాల వినియోగానికి సంబంధించి కేంద్రప్రభుత్వ తాజా నిర్ణయంపై జగన్ రెడ్డి నోరువిప్పాలి
• నేడు ఢిల్లీ వెళ్తున్న జగన్ రెడ్డి, కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో ఏపీకి ముఖ్యంగా రాయలసీమకు జరిగే నష్టాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియచేయాలి
• తన ఆస్తులు.. భూముల్ని కాకుండా రాష్ట్ర ప్రజానీకం, ఏపీ రైతాంగం.. భూముల్ని దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డి ఆలోచించాలి
• సుప్రీంకోర్టులో రాష్ట్రంతరుపున ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించి ఏపీ రైతాంగానికి న్యాయం చేయాలి
• లేకుంటే తెలుగుజాతి ఎన్నటికీ ఈ ముఖ్యమంత్రిని క్షమించదు
– తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
జగన్ రెడ్డి పాలనలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యా యని, తన అవినీతి దోపిడీ కోసం ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నాడని, కృష్ణాజలాల్లో న్యాయంగా ఆంధ్రప్రదేశ్ కు దక్కాల్సిన నీటివాటాకు సంబంధించి గతంలో బచావత్ ట్రైబ్యునల్ నిబంధనలు ఏవీ అమల్లోకి రాలేదని టీడీపీనేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణాజలాల కేటాయింపులకు సంబంధించి తొలుత బచావత్ ట్రిబ్యునల్ వేశారు. ఆ బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ కు 811 టీఎంసీల కృష్ణా నీటిని కేటాయించారు. ఈ కేటాయింపుల అనంతరం కృష్ణానది మిగులుజలాలపై తమకు వాటా కావాలని కర్ణాటక రాష్ట్రం వాదన మొదలు పెట్టింది. అంతర్జాతీయ నదీజలాల ఒప్పందం ప్రకారం నదీపరీవాహక ప్రాంతంలోని దిగువరాష్ట్రాలు వరదల ప్రభావానికి కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు నష్టపోయే అవకాశం ఎక్కువ ఉండేది ఆ రాష్ట్రాలే కాబట్టి, మిగులు జలాలు వినియోగించుకునే హక్కు వాటికే ఉంటుందని నిర్ధారించారు.
ఆ ప్రకారం కృష్ణా మిగులు జలాల వినియోగంపై తెలంగాణ, ఏపీకి మాత్రమే హక్కు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనానంత రం ఆంధ్రప్రదేశ్ కు కృష్ణాజలాల్లో 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటా యిస్తూ ఆనాడు అపెక్స్ కౌన్సిల్ తీర్మానించింది. ఆ ప్రకారం కొన్నాళ్లుగా నీటి వినియోగం కూడా జరుగుతోంది. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం ఈ వ్యవహారంపై వింతవాదన మొదలెట్టింది. కృష్ణానదీ పరీవాహక ప్రాంతం ఏపీకంటే తెలంగాణలోనే ఎక్కువగా ఉంది కాబట్టి.. మిగులు జలాల్లో తమరాష్ట్రానికి ఎక్కువ కేటాయించాలనేదే ఆ వాదన.
ఈ వాదన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల్లో ఉండే నీటినిల్వల ఆధారంగా చేసిన కేటాయింపులకు విరుద్ధంగా ఉంది. గతంలో బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ తెలంగాణలోని బీమా – నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల్ని, ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలిగొండ ప్రాజెక్టుల్ని నోటిఫై చేసి, వాటి ఆధారంగా కృష్ణాజలాల కేటాయింపులు చేసింది.
ఈ ప్రాజెక్టులపై పూర్తి అధ్యయనం జరక్కముందే తెలంగాణ ప్రభుత్వం పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా అదనపు కృష్ణా జలాల వినియోగంపై దృష్టిపెట్టింది. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి.. రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలాంటి పురోగతి చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే ఇవ్వడంతో దానిపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా తన స్వప్రయోజనాలకోసం జగన్ రెడ్డి మిన్నకుండిపోయాడు. తెలంగాణలోని తన ఆస్తులు, భూముల్ని కాపాడుకోవడానికి ఏపీ రైతాంగానికి, ముఖ్యంగా రాయలసీమకు తీవ్ర అన్యాయం చేయడానికి ఈ ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడు.
తెలంగాణ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొనే ఏపీకి అన్యాయం చేయడానికి సిద్ధమయ్యారు
ఈ వ్యవహారం ఇలా ఉంటే తాజాగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల కేటాయింపుల విషయంలో కొత్త ట్రైబ్యునల్ తెరపైకి తెచ్చి, దాని ప్రకారం నీటి కేటాయింపులు అమలు చేయడానికి సిద్ధమయ్యారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నందున అక్కడ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడానికి, ఎన్నికల్లో ఎంతో కొంత బలం పెంచుకోవాలన్న తాపత్రయంతోనే ఏపీ , తెలంగాణకు సంబంధించిన కృష్ణాజలాల నీటి కేటాయింపులపై కేంద్రప్రభుత్వం సరికొత్త వాదన తెరపైకి తెచ్చినట్టు అర్థమవుతోంది.
కృష్ణానదీ పరీవాహక ప్రాంతం.. ఆ ప్రాంతంలో లభించే నీటిలభ్యతలు కాకుండా, అప్పటికే ఆ నదిపై రెండుతెలుగు రాష్ట్రాల్లో పూర్తైన సాగునీటి ప్రాజెక్టుల ఆధారంగా బచావత్ ట్రైబ్యునల్ నీటికేటాయింపులు చేసింది. ఆ ప్రకారం నీటి వాడకం కూడా జరుగుతోంది. కానీ నేడు మరలా దానికి విరుద్ధంగా బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ విధానాలో, కొత్త ట్రైబ్యునల్ ఆలోచనలో అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం దురదృష్టకరం.
బచావత్ ట్రైబ్యునల్ నీటి కేటాయింపుల్ని తెలంగాణ తప్పుపట్టినప్పుడు జగన్ రెడ్డి స్పందించలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా, వ్యక్తిగత ప్రయోజనాలకోసం ఆలోచించాడు
జగన్ సర్కార్ కృష్ణా నదీ జలాల వినియోగంపై ఆదినుంచీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యహరిస్తున్నందునే గతంలో బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించి న 811 టీఎంసీల కృష్ణాజలాల్లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 512 టీఎంసీలు, తెలంగా ణకు 299టీఎంసీలు కేటాయించారు. ఆ కేటాయింపుల ప్రకారం రాష్ట్ర విభజన నాటి నుంచి ఏపీ ప్రభుత్వం కృష్ణానీటిని వినియోగించుకుంటోంది. కానీనేడు కేంద్రప్రభుత్వం కొత్తగా బచావత్ ట్రైబ్యునల్ గతంలో చేసిన నీటి కేటాయింపుల్ని పరిశీలించి మళ్లీ కొత్త గా కేటాయింపులు చేసే అధికారాన్ని ట్రైబ్యునల్ కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ పరిస్థితి తలెత్తడానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డే కారణం. తన స్వప్రయోజనాలు.. అసమర్థత వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం చేయడానికి కూడా జగన్ రెడ్డి వెనుకాడలేదు. తెలంగాణ రాష్ట్రం ఆదినుంచీ బచావత్ ట్రైబ్యునల్ నీటి కేటాయింపుల్ని తప్పు పడు తూ, తమకు అన్యాయం జరిగిందని చెబుతుంటే, ఏనాడూ జగన్ రెడ్డి, అతని ప్రభు త్వం ఏపీ తరుపున సమర్థవంతంగా వాదనలు వినిపించలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి, ఏపీలోని భూములు.. నీటి వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఏనాడూ కేంద్రప్రభుత్వం వద్దగానీ, ట్రైబ్యునళ్ల ఎదుటగానీ సమర్థవంతమైన వాదనలు విని పించలేదు. జగన్ చేతగానితనం అంతిమంగా రాయలసీమను మరలా తీవ్రదుర్భిక్ష పరిస్థితుల్లోకి నెట్టనుంది.
నేడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి, తెలంగాణ ఏ విధంగా అయితే హక్కులకు విరుద్దంగా తమరాష్ట్ర ప్రయోజనాలకోసం లాబీయింగ్ చేస్తోందో.. దానికంటే ఎక్కువగా ఏపీ ప్రయోజనాలకోసం జగన్ రెడ్డి కేంద్రపెద్దల ముందు నోరు విప్పాలి. జగన్ రెడ్డి తక్షణమే అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయించి, తాజాగా తీసుకొచ్చి న కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కేటాయించిన తర్వాత, కొద్ది కాలం తర్వాత ఆ నగరం ఏపీ రాజ ధాని కాదని తెలిశాక.. చట్టవిరుద్ధంగా ఏపీ ఆ నగరంపై తమకు హక్కులున్నాయని వాదిస్తే తెలంగాణ సమ్మతిస్తుందా?
ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి సమర్థవంతంగా వ్యవహరించి కృష్ణా మిగులు జలాల విషయంలో ఏపీకి న్యాయం చేయకుంటే, తెలుగుజాతి ఎప్పటికీ ఆయన్ని క్షమించదు
అదే విధంగా గతంలో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన కేటాయింపులకు విరుద్ధంగా, ఇన్నేళ్ల తర్వాత తమకు కృష్ణా మిగులు జలాల్లో ఎక్కువ వాటా ఉందని తెలంగాణ వాదించడం.. ఆ వాదనపై జగన్ రెడ్డి మౌనం వహించడం ముమ్మాటికీ ఏపీకి తీరని నష్టం కలిగించడమే. కృష్ణా మిగులు జలాలపై కేంద్ర కేబినెట్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి స్పందించి, ఏపీకి న్యాయం చేయాలని, సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించి ఏపీ రైతాంగానికి న్యాయం చేయాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర ప్రజానీకం, ఇక్కడి రైతులు..భూముల్ని దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డి ఆలోచించాలి. లేకుంటే తెలుగుజాతి ఎన్నటికీ ఈ ముఖ్యమంత్రిని క్షమించదు.” అని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు.